ఇందూరు, న్యూస్‌లైన్: అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఫలితాల సీజన్ రానే వచ్చింది. సోమవారం మున్సిపల్ ఫలితాలు ముగిసిన నేపథ్యంలో మంగళవారం ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఫలితాలు వెల్లడి కానున్నాయి. బ్యాలెట్ బాక్సులలో దాగున్న అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. జిల్లాలో 36 జడ్‌పీటీసీ, 583 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఫలితాలను వెల్లడించేందుకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో లెక్కింపు ప్రారంభం కానుంది. నిజామాబాద్ డివిజన్‌లోని 14 మండలాలకు సంబంధించి డిచ్‌పల్లి మండలం ధర్మారంలోని తిరుమల నర్సింగ్ కళాశాలలో, బోధన్ డివిజన్ 12 మండలాల ఓట్లను ఆచన్‌పల్లి ఆర్‌కే ఇంజనీరింగ్ కళాశాలలో, కామారెడ్డి డివిజన్‌లోని 10 మండలాల ఓట్లను సదాశివనగర్ మండలం మర్కల్‌లోని విజయ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో లెక్కింపు చేపట్టనున్నారు.
మొత్తం ఈ మూడు కేంద్రాలలో 60 గదులను గుర్తించి కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. లెక్కింపు పక్రియ వీలైనంత తొందరగా పూర్తి చేయడానికి ప్రతీ ఎంపీటీసీ స్థానానికి ఒక కౌంటింగ్ టేబుల్‌ను ఏర్పాటు చేశారు. లెక్కింపు ప్రక్రియను వీడియో కెమెరాలతో చిత్రీకరిస్తారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల ఫలితాలు వెల్లడించడానికి జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఒక్కో ఎంపీటీసీ కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక సూపర్‌వైజర్, ముగ్గురు అసిస్టెంట్‌లు, ఒక అటెండర్, ఆర్వోలు మొత్తం దాదాపు మూడు వేలకు పైగా సిబ్బంది పాల్గొంటున్నారు. ప్రతీ రౌండ్‌కు సంబంధించిన ఓట్ల వివరాలు కౌంటింగ్ టేబుల్‌వారిగా షీట్‌లలో నమోదు చేసిన సిబ్బంది, అధికారులు ఎప్పటికప్పుడు జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేస్తారు.
సెల్‌ఫోన్‌లతో నో ఎంట్రీ
ఒక కౌంటింగ్ టేబుల్‌కు అభ్యర్థితోపాటు, ఒక ఏజెంటును మాత్రమే లోనికి అనుమతిస్తారు. రిటర్నింగ్ అధికారి తప్ప మిగతా కౌంటింగ్ సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్లు ఎవరు కూడా సెల్‌ఫోన్‌తో లోనికి వెళ్లరాదు. ఒక్కసారి లోపలికి వెళ్లిన వారు మళ్లీ బయటకు రావాలంటే రిటర్నింగ్ అధికారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. టీ, టిఫిన్, భోజనంలాంటివి లోపలికి అనుమతించరు.
పోలీసు బందోబస్తు
మూడు కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసు శాఖ గట్టి బందోబస్తును ఏర్పాటు చేసింది. డీఎస్‌పీలు, ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, ప్రత్యేక పోలీసు బలగాలు మొత్తంగా దాదాపు 260కి పైగా సిబ్బంది కౌంటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహిస్తారు.
పరిషత్ ఫలితాలు నేడే
Published Tue, May 13 2014 3:03 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement
Advertisement