కొడంగల్‌లో వెలిసిన అక్రమ వెంచర్
సాక్షి, కొడంగల్: పట్టణంలోని లాహోటీ కాలనీ నుంచి కొండారెడ్డిపల్లికి వెళ్లే దారిలో అనుమతి లేకుండా వెలిసిన వెంచర్‌పై మున్సిపల్ అధికారులు కొరడా ఝులిపించారు. ప్లాట్ల హద్దు రాళ్లను తొలగించారు. కొడంగల్ మున్సిపాలిటీగా మారిన తర్వా త పట్టణంలోని పలు చోట్ల అక్రమ వెంచర్లు వెలిశాయి.ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి ఇర్షాద్, కార్య నిర్వాహక అధికారి పద్మ, మున్సిపల్ సిబ్బంది మంగళవారం వీటిని పరిశీలించారు. లాహోటీ కాలనీ నుంచి కొండారెడ్డిపల్లికి వెళ్లే దారిలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి శిఖం భూమిని కొనుగోలు చేసి ప్లాట్లుగా విభజించాడు. ఎలాంటి అనుమతులు లేకుండానే శిఖం భూమిలో ప్లాట్లు చేసి విక్రయించాడు. పట్టణానికి చెందిన పలువురు వ్యాపారులు వీటిని కొనుగోలు చేశారు.
కొండారెడ్డిపల్లికి వెళ్లే దారి కావడంతో పాటు మాజీ ఎమ్మెల్యే ఇంటికి సమీపంలో ఉండటంతో కొడంగల్ వ్యాపారులు ప్లాట్లను కొనుగోలు చేశారు. దీంతో విపరీతంగా డిమాండ్ పెరిగింది. కొద్ది రోజుల్లోనే కోట్ల రూపాయలు వ్యాపారం జరిగింది. ఈ ప్లాట్లకు మున్సిపల్ అనుమతి లేదు. టౌన్ అండ్ కంట్రీ పర్మిషన్ లేదు. లే అవుట్ లేదు. శిఖం భూమిని కొనుగోలు చేసి రెవెన్యూ అధికారుల నుంచి నాలా (నాన్ అగ్రికల్చర్ ల్యాండ్) పర్మిషన్ తీసుకున్నారు. దీనిపై స్పందించిన మున్సిపల్ సిబ్బంది వెంచర్ వద్దకు వెళ్లి పరిశీలించారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన వెంచర్లలోని హద్దు రాళ్లను తొలగించారు. ఇందులో ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులకు ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతి ఇవ్వకూడదని మున్సిపల్ అధికారులు నిర్ణయించారు. అన్ని అనుమతులు తీసు కొని లే అవుట్ చేసిన తర్వాతనే అనుమతులు ఇ స్తామని టీపీఓ ఇర్షాద్, ఈఓ పద్మ తెలిపారు. పట్టణంలో అక్రమంగా వెలిసిన వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment