ఇందూరు/డిచ్‌పల్లి, న్యూస్‌లైన్: సర్పంచుతోపాటు గ్రామపంచాయతీ పాలకమండలి సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే అధిక నిధులు వస్తాయని, వీటితో గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చని ఆశించి జిల్లాలోని 73 పంచాయతీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికలు జరిగి ఐదు నెలలు గడుస్తున్నా ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ఇస్తానని చెప్పిన నజరానా సొమ్ము విడుదల కాలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గ్రామాలలో ఎన్నికల పేరిట కక్షలు పెరగవద్దని, రాజకీయాలకతీతంగా ఏకగ్రీవం చేసుకుంటే ప్రోత్సాహకంగా మేజర్ పంచాయతీలకు రూ. 10 లక్షలు, చిన్న పంచాయతీలకు రూ. 5 లక్షలు అందజేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ నజరానాను మేజర్ పంచాయతీకి రూ. 15 లక్షలు, మైనర్ పంచాయతీకి రూ. 7 లక్షలకు పెంచింది. దీంతో ఈ సారి ఎన్నికలలో పలు గ్రామాల ప్రజలు సర్పంచ్‌తో పాటు పాలకమండలి సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఐదు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం వాటికి నజరానా విడుదల చేయడం లేదు. దీంతో గ్రామాలలో అభివృద్ధి కుంటుపడుతోంది.
నిర్వహణ ఖర్చు కూడా తగ్గుతుందని
గ్రామాలలో ఎన్నికల పేరిట కక్షలు పెరుగకుండా ఉండడంంతో పాటు, ఎన్నికల నిర్వహణ ఖర్చు కూడా తగ్గుతుందని భావించిన ప్రభుత్వం నజరానా సొమ్మును పెం చింది. ఏకగ్రీవం అయిన పంచాయతీలలో 15వేలు అంతకుపైగా జనాభా ఉన్న పంచాయతీలకు రూ. 15లక్షలు, అంత కంటే తక్కువ జనాభా ఉన్న పంచాయతీలకు రూ. 7 లక్షలను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 2013 జూలైలో నిర్వహించిన ఎన్నికలలో జిల్లాలోని 718 పంచాయతీలకు గాను 73 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఆయా గ్రామాల సర్పంచులు, పాలకమండలి సభ్యులతో పాటు గ్రామస్తులు తమ గ్రామాల అభివృద్ధికి నిధులు పుష్కలంగా వస్తాయని భావించారు. ప్రభుత్వం ఇచ్చిన మాట మరిచి పోవడంతో ఒక్క రూపాయి మంజూరు కాలేదు. నజరానా సొమ్మును కేవలం గ్రామాభివృద్ధి కోసం మాత్రమే వినియోగించాలని నింబంధన విధించింది. జిల్లాలో ఏకగ్రీవంగా ఎన్నికైన 73 పంచాయతీలలో 15వేల కంటే తక్కువ జనాభా ఉండటంతో ఒక్కో పంచాయతీకి రూ.7 లక్షలు రావాలి. మొత్తం రూ. 5. 11 కోట్లు మం జూరు కావాలి. ఎన్నికలు జరిగిన రెండు మూడు నెలలలోపు ప్రభుత్వం నజరానా నిధులను మంజూరు చేస్తుందని సర్పంచులు భావించారు. కానీ, అలా జరుగలేదు.
నజరానాతో అభివృద్ధి పనులు
ప్రభుత్వం అందించే నజరానా సొమ్ము, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీతోపాటు ఎమ్మెల్సీలు ఇచ్చే నిధులతో గ్రామాన్ని ఐదేళ్ల కాలంలో అన్ని రంగాలలో అభివృద్ధి చేయవచ్చ ని సర్పచులు భావించారు. ఇప్పటికైనా ప్రభుత్వం నజరానా సొమ్ములను విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఏకగ్రీవ పంచాయతీలకు ఏదీ నజరానా?
Published Tue, Jan 21 2014 6:59 AM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM
Advertisement
Advertisement