ఇందూరు: గ్రామ ప్రథమ పౌరుడిగా గుర్తింపు లభించిన సర్పంచుకు గౌరవ వేతనం ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సర్పంచులుగా ఎన్నికై ఏడాది గడుస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు ఒక్క రూపాయి కూడా వేతనం అందించలేదు. దీంతో వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 718 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 74 మేజర్, 644 మైనర్ పంచాయతీలు. వీటికి 2013 జూన్ నెలాఖరులో ఎన్నికలు జరిగాయి.
అప్పటినుంచి గౌరవ వేతనాలకు సంబంధించిన నిధులను ప్రభు త్వం విడుదల చేయలేదు. 2006 నుంచి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచులకు రూ.500, మైనర్ గ్రామ పంచాయతీ సర్పంచులకు రూ.700 వేతనం ఇచ్చేవారు. గత ఏడాది కొత్త పాలకవర్గాలు కొలువుదీరిన నేపథ్యంలో మేజర్ గ్రామ పంచాయతీలకు రూ.1500, మైనర్ గ్రామ పంచాయతీలకు రూ.1000 వేతనాలు ఇవ్వనున్నట్లు అ ప్పటి ప్రభుత్వం ఒక జీఓ విడుదల చేసింది.
గౌరవ వేతనాలలో సగం వాటా ప్రభుత్వానిది కాగా, మిగతా సగం పంచాయతీ నిధుల నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి కానీ, పంచాయతీల నుంచి వేతనాల నిధులు విడుదల కాలేదు. ఇలా అయితే గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించలేమని, పనులు, ప్రభుత్వ పథకాలు అమలు చేయబోమని, సమయం చూసుకుని ఆందోళనకు దిగుతామని సర్పంచులు హెచ్చరిస్తున్నారు.
కోట్లలో పేరుకుపోయిన బకాయిలు
దాదాపు 12 నెలల పాటు వేతనాలను విడుదల చేయకపోవడంతో బకాయిలు రూ. 9.60 కోట్లకు చేరుకున్నాయి. వెంటనే నిధులను విడుదల చేయాలని ప్రభుత్వానికి జిల్లా పంచాయతీ అధికారి, సర్పంచుల సంఘం విన్నవించినా ఫలితం లేదు. 2006 నుంచి పని చేసిన సర్పంచులకు కూడా రెండున్నర, మూడేళ్ల వేతనాలు మాత్రమే అందాయి. మిగతా వేతనాలను వారు దాదాపు మరిచిపోయారు.
మరో విచిత్రం ఏమిటంటే, ఆరు నెలల క్రితం జిల్లాకు దాదాపు రూ. మూడు కోట్ల నిధులు వచ్చాయని, వాటిని సర్పంచులకు అందజేయాలని డీఎల్‌పీఓలకు ఆదేశాలిచ్చామని పంచాయతీ అధికారులు అంటున్నారు. ఈ విషయం వారికి తెలియకపోవచ్చని, పంచాయతీల ఖాతాలలో చూస్తే తెలుస్తుందని పేర్కొంటున్నారు. సర్పంచులేమో తమకు ఇంత వరకు ఒక్క నెల వేతనం కూడా అందలేదని, పంచాయతీల ఖాతాలో నిధులు జమ కాలేదని చెబుతున్నారు.
దీంతో ఇంతకు ఆ నిధులు ఏమయ్యాయో అన్న సందేహం తలెత్తుతోంది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటే తప్ప ఈ విషయం తేలేలా లేదు. పాత వేతనాలను సవరించిన ప్రభుత్వం కొత్త వేతనాల జీఓను ఇంత వరకు అమలు చేయలేదు. ఆరు నెలల క్రితం అధికారులు ఇచ్చామని చెబుతున్న వేతనాలు కూడా పాతవే అని తెలిసింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వమైనా కొత్త జీఓ ప్రకారం వేతనాలు వేతనాలు విడుదల చేయాలని సర్పంచులు కోరుతున్నారు.
‘గౌరవం’ ఏదీ
Published Wed, Jul 23 2014 2:58 AM | Last Updated on Sat, Sep 2 2017 10:42 AM
Advertisement