ఇందూరు : అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం ఇక అందరికీ సమానంగా అందనుంది. గర్భిణులు, బాలింతలు, పిల్లల కోసం ప్రత్యేకంగా ఇందిరమ్మ అమృత హస్తం ద్వారా అందించే పరిపుష్టమైన పౌష్టికాహారాన్ని జిల్లాలోని అన్ని ఐసీడీఎస్ సీడీపీఓ ప్రాజెక్టుల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ నెల నుంచి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాలో మొత్తం పది సీడీపీఓ ప్రాజెక్టుల ద్వారా 2711 అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఇందులో కేవలం ఆరు ప్రాజెక్టులైన బోధన్, బాన్సువాడ, మద్నూర్, ఎల్లారెడ్డి, దోమకొండ, భీమ్‌గల్ ప్రాజెక్టుల్లో మాత్రమే అమృత హస్తం పథకాన్ని గత ప్రభుత్వం అమలు చేసింది. మిగతా నాలుగు ప్రాజెక్టుల్లో అమలు చేయలేదు. ఎందుకు అమలు చేయడం లేదో కూడా అధికారులకు అర్థం కాలేదు. ఆరు ప్రాజెక్టుల్లో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం, గుడ్లు, పాలు, పోపు దినుసులు, కూరగాయల భోజనం, ఐరన్ మాత్రలు, ఇతరాత్రవి అందేవి.
జిల్లాలో పది ప్రాజెక్టులకు గాను ఆరు ప్రాజెక్టుల్లో పథకం అమలు కావడం, మిగతా ప్రాజెక్టుల్లో ఎందుకు అమలు కావడం లేదని జిల్లా ఐసీడీఎస్ పీడీ రాములును రాష్ట్ర ఉన్నతాధికారులు ప్రశ్నించారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లాలో అమలు జరగుతుందని తెలిపారు. ఒక ప్రాజెక్టు వారికి అలా, మరో ప్రాజెక్టు వారికి ఇలా అమలు చేయడం సరికాదని తారతమ్యం లేకుండా పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇదివరకు అమలు కాని నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, కామారెడ్డి ప్రాజెక్టుల్లో కూడా పథకాన్ని అమలు చేసి పౌష్టికాహారం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందజేయాలని తీర్మానిం చారు. దీని మార్గదర్శకాలు, విధి విధానాలు త్వరలోనే ప్రభుత్వం ప్రకటించనుంది. డిసెంబర్ నెల నుంచి పథకాన్ని అమలు చేసేందుకు ఇటు రాష్ట్ర అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఫలితంగా కొత్తగా నాలుగు ప్రాజెక్టుల్లో పథకం అమలు కానున్న సందర్భంగా వాటి పరిధిలో ఉన్న దాదాపు 1050 అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు, పిల్లలకు లబ్ధి చేకూరనుంది.
ప్రతి రోజు గుడ్డు..
జిల్లాలోని పది ఐసీడీఎస్ సీడీపీఓ ప్రాజెక్టుల్లో ఇందిరమ్మ అమృత హస్తం కావడం ఒక విశేషమైతే, పౌష్టికాహారాన్ని పెంచడం మరో విశేషంగా చెప్పవచ్చు. ఇది వరకు గర్భిణులు, బాలింతలు, పిల్లలకు నెలకు 25 గుడ్లు అందించేవారు. కానీ ప్రస్తుతం ఆ సంఖ్యను ప్రతి రోజు అంటే నెల రోజుల పాటు గుడ్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంగన్‌వాడీ కేంద్రాలకు డిసెంబర్ నెల నుంచి అదనంగా గుడ్లు సరఫరా కానున్నాయి.
ఇక అన్ని ప్రాజెక్టుల్లో ‘అమృత హస్తం’!
Published Thu, Nov 27 2014 4:10 AM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM
Advertisement