ఇందూరు : దేశంలో రోజురోజుకు మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. ఎక్కడో ఒక చోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు ఉన్నా.. మరెందరికో శిక్షలు పడుతున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. అత్తారింట్లో, పని చేసే స్థలాల్లో మానసికంగా, శారీరకంగా హింసకు గురవుతూనే ఉన్నారు. బాధిత మహిళలకు తక్షణ వైద్య సహాయం, కౌన్సెలింగ్ అందడం లేదు. నిందితులకు శిక్షా పడడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది.
మహిళల రక్షణ కోసం, తక్షణ సాయం, న్యాయం అందించడం కోసం వన్ స్టాప్ క్రైసిస్ సెంటర్(నిర్భయ సెంటర్) ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. దేశంలో 660 ప్రాంతాల్లో ఇలాంటి కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా జిల్లాకు కూడా ‘నిర్భయ సెంటర్’ను మంజూరు చేసింది. దీనికి సంబంధించి లెటర్ నం: 1037 ద్వారా ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం జిల్లా ఐసీడీఎస్ కార్యాలయానికి ఈ నెల 13న పంపించింది. భవన నిర్మాణానికి రూ. 36 లక్షలను కేటాయించింది.
ఈ కేంద్రం ఎందుకంటే..
సెంటర్‌లో డాక్టర్, నర్సు, లీగల్ కౌన్సెలర్, పోలీసు, న్యాయవాది, హెల్పర్ ఉంటారు. వేధింపులు, అత్యాచారానికి గురైన వెంటనే సమాచారం అందించేందుకు సెంటర్‌లో ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నంబర్‌ను త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. సంఘటన లేదా వేధింపులకు గురైనవారు ఆ నెంబర్‌కు ఫోన్ చేస్తే.. సంఘటనను బట్టి సంబంధిత ఉద్యోగులు ప్రత్యేక వాహనం ద్వారా లేదా అంబులెన్స్‌లో ఘటనా స్థలానికి చేరుకుంటారు.
కుటుంబ సభ్యుల వేధింపుల కేసైతే ఇరువురికీ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల పై, లేదా భర్త, అత్త, మామలపై చర్యలు తప్పవన్న పరిస్థితుల్లో వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పని చేస్తున్న మహిళలు శారీరక, మానసిక వేధింపులకు గురైతే కూడా పై పద్ధతిన చర్యలు తీసుకుంటారు.
అత్యాచారానికి గురైన వారికి తక్షణ వైద్య సహాయం అందిస్తారు.
కేసులను ఉచితంగానే కోర్టులో వాదిస్తారు. పోలీసు స్టేషన్‌కు, కోర్టుకు బాధితురాలి వాంగ్మూలం వినేందుకు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని కల్పించనున్నారు. ఇటు బాధిత మహిళలకు తాత్కాలిక వసతిని కల్పిస్తారు. ఐదుగురు అధికారుల కమిటీకి కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. మొత్తం మీద బాధిత మహిళలకు తక్షణ సాయం, న్యాయం జరిగేలా ఈ ‘నిర్భయ సెంటర్’ పని చేస్తుంది.
సెంటర్ ఏర్పాటుకు సన్నాహాలు
జిల్లాకు నిర్భయ సెంటర్‌ను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం భవన నిర్మాణానికి రూ. 36 లక్ష లను కేటాయించింది. వీలైనంత త్వరగా భవనా న్ని నిర్మించి అందులో బాధిత మహిళలకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా తయారు చేయాలని ఐసీడీఎస్ అధికారులను కేంద్రం ఆదేశించింది. భవనం నిర్మించే వరకు తాత్కాలికంగా వేరే భవనాన్ని చూసుకోవాలని సూచించింది.
ఈ నిర్భయ సెంటర్‌ను 300 చదరపు మీటర్లు గల స్థలంలో నిర్మించాలని, అది కూడా జిల్లా కేంద్రంలోనే ఉండాలని ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల్లో ఉంది. అయితే జిల్లా ఆస్పత్రి ఆవరణలో లేదా రెండు కిలోమీటర్ల సమీపంలో భవనాన్ని నిర్మించాలని అధికారులను ఆదేశించింది. జిల్లా కేంద్రంలో స్థలం వెతకడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
జిల్లాకు ‘నిర్భయ’ సెంటర్ మంజూరు
Published Wed, Aug 20 2014 3:13 AM | Last Updated on Wed, Oct 17 2018 5:51 PM
Advertisement
Advertisement