Attacks on women
-
మహిళలకు భద్రత ఉందా?.. సర్కార్‌పై మాజీ మంత్రి సబిత ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు భద్రత కరువైందన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మహిళల భద్రతపై ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని హితవు పలికారు. రాష్ట్రంలో వరుసగా అత్యాచార ఘటనలు జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.కాగా, మాజీ మంత్రి సబిత ట్విట్టర్ వేదికగా.. తెలంగాణలో ఏం జరుగుతోంది. అసెంబ్లీలో మాట్లాడి 48 గంటలు కూడా కాలేదు. రాష్ట్రంలో నాలుగు అత్యాచారాలు జరగడం బాధాకరం. సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి ఘటనలు వరుసగా జరగటం ఆందోళనకరం. మహిళలకు భద్రత కరువైంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్లు తెరవాలి అంటూ ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో జరిగిన ఘటనలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు.1. వనస్థలిపురం పీఎస్ పరిధిలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై సామూహిక అత్యాచారం2. ఓయూ పీఎస్ పరిధిలో ప్రయాణికురాలిపై ఆర్టీసీ బస్సు డ్రైవర్ అఘాయిత్యం3. నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో దివ్యాంగ మహిళపై అత్యాచారం4. నిర్మల్ నుండి ప్రకాశం వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో మహిళపై అత్యాచారం చేసిన డ్రైవర్. pic.twitter.com/reV7o3MB8o— Sabitha Reddy (@BrsSabithaIndra) July 31, 2024 -
మహిళలపై పెరుగుతున్న అరాచకాలు.. 2022లో 31వేల ఫిర్యాదులు
న్యూఢిల్లీ: మహిళలపై జరిగిన నేరాలు ఘోరాలకు సంబంధించి 2022లో దాదాపుగా 31 వేల ఫిర్యాదులు అందాయని జాతీయ మహిళా కమిషన్ వెల్లడించింది. 2014 తర్వాత ఇవే అత్యధికమని తెలిపింది. 2021లో 30,864 ఫిర్యాదులు అందితే , తర్వాత ఏడాదికి స్వల్పంగా పెరిగి 30,957 ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల్లో ఎక్కువగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినవే ఉన్నాయని, 9,710 వరకు ఆ ఫిర్యాదులేనని గణాంకాలు వెల్లడించాయి. ఆ తర్వాత గృహ హింసకు సంబంధించి 6,970 కేసులు, వరకట్నం వేధింపులు 4,600 ఫిర్యాదులు అందాయి. ఇదీ చదవండి: సెల్ డ్రైవింగ్‌తో దేశవ్యాప్తంగా... ఏడాదిలో 1,040 మంది మృతి -
దస్తక్.. స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా ప్రదర్శించబడుతున్న నాటకం
దేశం కదిలిపోయింది. దేశం కన్నీరయ్యింది. దేశం ఆగ్రహంతో ఊగిపోయింది. పదేళ్ల క్రితం డిసెంబర్ 16, 2012న ఢిల్లీలో జరిగిన ఘటన లక్షలాది స్త్రీలను, యువతులను, బాలికలను రోడ్డు మీదకు వచ్చి నిరసన చేసేలా చేసింది. కొత్త చట్టం ‘నిర్భయ’ పేరున వచ్చింది. అయితే అది సరిపోదు. ఆ హైన్యమైన ఘటన పునరావృత్తం కాకూడదని ఆ మహా చైతన్యం సజీవంగా ఉండాలని థియేటర్ నటి శిల్పి మర్వాహ గత పదేళ్లుగా నిర్భయ నాటకాన్ని ప్రదర్శిస్తోంది. ఆమె ఆ నాటకాన్ని కొనసాగిస్తున్న తీరు, నిర్భయగా నటిస్తున్నప్పుడు ఆమె పడే వేదన తెలుసుకోదగ్గది. ఆ నాటకం ప్రతి చోటా వేయదగ్గది. ‘దస్తక్’ అంటే ‘తలుపు తట్టడం’ లేదా ‘తట్టి లేపడం’ లేదా ‘పిలుపునివ్వడం’. ఢిల్లీలో డిసెంబర్ 16, 2012 రాత్రి 9.30 నుంచి 11 గంటల మధ్య జరిగిన పాశవికమైన ‘నిర్భయ ఘటన’– చుట్టూ ఏం జరిగితే మనకెందుకు అని తలుపు మూసుకుని ఉన్న ఈ సమాజాన్ని, నిద్ర నటిస్తున్న ఈ సంఘాన్ని, బధిరత్వం నటిస్తున్న బండబారిన ఈ సమూహాన్ని తట్టి లేపింది. జాగృతపరిచింది. ఇప్పుడైనా కదలండి అని పిలుపును ఇచ్చింది. ‘నిర్భయ ఘటన ఈ దేశం నుంచి ఒక్కటే కోరింది–మారండి అని’ అని అంటుంది శిల్పి మార్వాహ. ఢిల్లీ నాటకరంగంలో చిరపరిచితమైన శిల్పి గత పదేళ్లుగా నిర్భయ ఘటన మీద ప్రదర్శిస్తున్న వీధి నాటకం పేరు– దస్తక్. ఢిల్లీ కమలా నెహ్రూ కాలేజ్‌లో చదువుకున్న శిల్పి ‘క్యాంపస్ థియేటర్’, ‘స్ట్రీట్ థియేటర్’లో అనేక ప్రయోగాలు చేసింది. 2011 ఢిల్లీ ‘యాంటి కరప్షన్ మూవ్మెంట్’లో చురుగ్గా పాల్గొని నాటకాలు వేసిన షిల్పి గుర్తింపు పొందింది. 2013 నుంచి ‘దస్తక్’ నాటకం ద్వారా తన సామాజిక బాధ్యతను గట్టిగా చాటుకుంటోంది. ఘటనకు మూల కారణం... ‘నిర్భయ ఘటనకు మూలకారణం పితృస్వామ్యం. ఇంటి వాతావరణంలో మగవాడికి పెత్తనం ఇవ్వడం నుంచి ఇది మొదలవుతుంది. తాను అణగదొక్కగలిగేవాడిగా స్త్రీ అణగదొక్కబడేదిగా మగవాడు ఎప్పుడైతే తర్ఫీదు ఇవ్వబడతాడో అప్పుడు స్త్రీ మీద హింస చేయడానికి వెనుకాడడు’ అంటుంది శిల్పి. ‘నిర్భయ ఘటన జరిగిన రోజు బస్సులో డ్రైవర్‌తో సహా 6 మంది ఉన్నారు. వారు మొదట నిర్భయతో గొడవ మొదలెట్టింది– ఇంత రాత్రి నువ్వు ఎందుకు రోడ్ల మీద తిరుగుతున్నావ్ అని. అప్పుడు టైమ్ తొమ్మిదిన్నరే. ఏ ఒంటిగంటో కాదు. అయినా సరే స్త్రీని కంట్రోల్ చేసే స్వభావంతో ఆ ప్రశ్న వేశారు. అలా కంట్రోల్లో లేని స్త్రీని ఏమైనా చేయవచ్చని బరితెగించారు’ అంటుందామె. ఇండియా గేట్లో మొదటి ప్రదర్శన... ‘నిర్భయ ఘటన తర్వాత ఊరికే ఉండలేకపోయాను. ఆ ముందు సంవత్సరమే ‘దస్తక్’ అనే నాటకాన్ని స్త్రీపై సాగే హింసకు వ్యతిరేకంగా ప్రదర్శించేదాన్ని. అందులో రేప్ సన్నివేశం దుర్మార్గంగా చూపేదాన్ని. ఆడవాళ్లు నా దగ్గరకు వచ్చి ‘మరీ అంత దుర్మార్గం ఉండదు. నువ్వు ఎక్కువ చేస్తున్నావ్’ అని అనేవారు. నిర్భయ ఘటన తర్వాత నేను మొత్తం నాటకాన్ని తిరగరాసి నిర్భయ మీద జరిగిన పాశవిక దాడిని నాటకంలో యధాతధంగా పెట్టాను. నిర్భయగా నేనే నటించాను. ఇండియా గేట్లో మొదటిసారి ప్రదర్శిస్తున్నప్పుడు నా మెదడు మొద్దుబారింది. ఆ నాటకంలో నేను కోపంతో అరుస్తున్నప్పుడు అది నటనగా కాక జరిగిన దారుణానికి నిరసనగా సగటు మహిళలో పెల్లుబికే కోపంగా వ్యక్తమైంది. చుట్టూ ఉన్న జనం చాలా మౌనంగా నాటకం చూశారు. సాధారణంగా వీధి నాటకాలు గోలగా చూస్తారు ప్రేక్షకులు. ఈ నాటకం సమయంలో మాత్రం దారుణమైన నిశ్శబ్దం పాటించారు. వారిలో వచ్చిన గాంభీర్యానికి గుర్తు అది. ఆ ప్రదర్శన తర్వాత అత్యాచారాన్ని అంత పాశవికంగా చూపడం ఎందుకో స్త్రీలు అర్థం చేసుకున్నారు. ఆ తీవ్రతను చూపితే తప్ప మార్పు రాదని తెలుసుకున్నారు’ అంటుంది శిల్పి. కొద్దిగానే మార్పు... ‘పదేళ్లుగా నిర్భయ నాటకాన్ని ప్రదర్శిస్తున్నాను. పదేళ్లుగా నిర్భయ వంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నేటికీ పెద్ద మార్పు లేదు. నిర్భయ నిందితుల్లో నలుగురికి ఉరిశిక్ష పడింది (ఒకరు విచారణ సమయంలో మరణించారు). జువెనైల్ చట్టంలో మార్పు వచ్చింది (ఒక నిందితుడు జువెనైల్ చట్టం నిర్థారించిన వయసు వల్ల విడుదల అయ్యాడు). కాని ఇంకా దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజా నాటకం నిర్భయ ఘటనను మాత్రం వదల్లేదు. అనేక గ్రూప్‌లు ఈ నాటకాన్ని ఆడుతూనే ఉన్నాయి. రంగస్థలం మీదకు నిర్భయ శవాన్ని తీసుకొచ్చినప్పుడల్లా జనం ఏడుస్తారు. కాని ఏడుపు మాత్రమే చాలదు. మార్పు రావాలి. ఇన్ని సంవత్సరాలుగా ఈ నాటకాన్ని వేయాలా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. కాని మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు అని కూడా అనిపిస్తుంది. అందుకే నాటకం కొనసాగిస్తున్నాను. నిర్భయను మరువనివ్వను. నిర్భయ వల్ల వచ్చిన చైతన్యం కొనసాగాలి’ అంటుంది శిల్పి. -
NCRB Report: ఆర్థిక నేరాల్లో హైదరాబాద్ నెం.3
సాక్షి, హైదరాబాద్: నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) 2020 సంవత్సరానికి సంబంధించిన జాతీయ స్థాయి గణాంకాలు విడుదల చేసింది. 20 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న 19 నగరాలను పోల్చినప్పుడు హైదరాబాద్ నగరం ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్లో మూడో స్థానంలో ఉంది. అలాగే మహిళలపై జరిగే నేరాల్లో ఐదో స్థానం, కిడ్నాప్ కేసుల నమోదులో ఏడో స్థానంలో నిలిచినట్లు ఎన్నీఆర్బీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరోపక్క నగరంలో 2018 నుంచి హత్య కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. వీటితో అత్యధికం వివాదాల నేపథ్యంలో జరిగినవే. హత్యకు గురైన వారిలో 18–30 ఏళ్ల మధ్య వయస్కులే ఎక్కువగా ఉన్నారు. ఇతర నగరాలతో పోలిస్తే హత్య కేసుల విషయంలో హైదరాబాద్ 11వ స్థానంలో ఉంది. ►ఆర్థిక నేరాలకి వస్తే.. నగరంలో 2020 సంవత్సరంలో మొత్తం 3,427 కేసులు నమోదయ్యాయి. 4,445 కేసులతో ఢిల్లీ, 3,927 కేసులతో ముంబై రెండో స్థానంలో ఉన్నాయి. వీటిలో ఫోర్జరీ, చీటింగ్, ఫ్రాడ్ కేసులే 3,307 ఉన్నాయి. ►సైబర్ నేరాల నమోదులో నగరానికి రెండో స్థానం. ఇక్కడ 2018లో 428, 2019లో 1379 కేసులు నమోదయ్యాయి. గతేడాది విషయానికి వచ్చేసరికి ఈ సంఖ్య అమాంతం 2553కు చేరింది. వీటిలో ఫ్రాడ్ కేసులు 2020 ఉండగా వాటిలో బ్యాంకింగ్ ఫ్రాడ్స్ 1366. ►మహిళలపై జరిగే నేరాలకు సంబంధించిన కేసుల్లో హైదరాబాద్ ఐదో స్థానంలో ఉంది. 9,782 కేసులతో ఢిల్లీ, 4583 కేసులతో ముంబై, 2730 కేసులతో బెంగళూరు, 2636 కేసులతో లక్నో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ►నగరంలో నమోదైన కేసుల్లో భర్తలు చేసిన దాషీ్టకాలకు సంబంధించినే 1226 కేసులు ఉన్నాయి. మిగిలిన వాటిలో 21 వరకట్న చావులు, 17 ఆత్మహత్యకు ప్రేరేపించడాలు, 131 కిడ్నాప్‌లు నమోదయ్యాయి. ► 4011 కిడ్నాపులతో దేశ రాజధాని మొదటి స్థానంలో ఉంది. 1173 కేసులతో ముంబై రెండు, 735 కేసులతో లక్నో మూడో స్థానంలో ఉండగా... 451 కేసులతో హైదరాబాద్ ఏడో స్థానంలో నిలవడం ఆందోళన కలిగించే అంశం. ► కిడ్నాప్ బాధితుల్లో మైనర్లకు సంబంధించినవి 95 ఉదంతాలు నమోదు కాగా... వీరంతా బాలికలే కావడం గమనార్హం. మొత్తం 451 ఉదంతా ల్లోనూ 352 కేసులు బాలికలు, మహిళలకు సంబంధించినవే. ►నగరంలో 2018లో 81, 2019లో 86 హత్యలు జరగ్గా... 2020లో ఆ సంఖ్య 71గా నమోదైంది. వీటిలో వ్యక్తిగత కక్షల వల్ల 10, సొత్తు కోసం 4, ప్రేమ వ్యవహారాలతో 3 హత్యలు జరిగాయి. అత్యధికంగా 39 ఉదంతాలు విభేదాల కారణంగా జరిగాయి. ►హతుల్లో పురుషులు 63 మంది, స్త్రీలు 8 మంది ఉన్నారు. అత్యధికంగా 18–30 ఏళ్ల మధ్య వయసు్కలు 41 మంది ఉండగా... వీరిలో 35 మంది పురుషులు, ఆరుగురు స్త్రీలు. ►చిన్నారులపై నేరాలకు సంబంధించి నగరంలో 467 కేసులు నమోదు కాగా... ఇతర నగరాలతో పోలిస్తే 11వ స్థానంలో ఉంది. వీటిలో 318 ఉదంతాలతో పోక్సో యాక్ట్ కేసులో అత్యధికంగా ఉన్నాయి. ఆ తర్వాత 95 కేసులు కిడ్నాప్‌లకు సంబంధించినవి. ►2020లో నగర పోలీసులు వివిధ క్రిమినల్ కేసులకు సంబంధించి మొత్తం 4,855 మందిని అరెస్టు చేశారు. -
మహిళల రక్షణకు ‘దిశా’నిర్దేశం
సాక్షి, అమరావతి: ‘దిశ’ చట్టాన్ని తెచ్చి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బాధిత మహిళలకు సత్వర న్యాయం చేసేందుకు అంతే వేగంగా చర్యలు చేపడుతోంది. రాజమహేంద్రవరంలో ‘దిశ’ తొలి పోలీస్ స్టేషన్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ప్రారంభించనున్నారు. అనంతరం నన్నయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో పోలీసులు, న్యాయవాదులతో జరిగే సదస్సులో మాట్లాడతారు. ఈ సందర్భంగా దిశ యాప్‌ను కూడా ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటవుతాయి. ఒక్కో స్టేషన్లో డీఎస్పీలు, సీఐలు ఇద్దరు, ఐదుగురు ఎస్ఐలు, కానిస్టేబుళ్లతో కలిపి మొత్తం 52 మంది పోలీస్ సిబ్బంది ఉంటారు. దిశ చట్టంపై అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేయడం, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐఏఎస్ అధికారిణి కృతికా శుక్లా, ఐపీఎస్ అధికారి దీపికను ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించింది. ఆంధ్రప్రదేశ్‌లో తెచ్చిన దిశ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తామని ఢిల్లీ, మహారాష్ట్ర ప్రకటించడం గమనార్హం. -
వ్యవస్థ ‘దిశ’ దశ మార్చగల స్త్రీ..!
దేశంలో మహిళలపై, చిన్నారులపై అనునిత్యం జరుగుతున్న అత్యాచారాలు కర్ణకఠోర సత్యాలుగా మారి మనల్ని వేధిస్తున్నాయి. అత్యాచార ఘటనలను ప్రసారం చేయడంలో మన మీడియా భావోద్వేగంతో కూడిన శీర్షికలతోనే సరిపెట్టుకుంటోంది తప్ప, ఈ అకృత్యాలకు వ్యవస్థాగతమైన పునాది ఎక్కడ ఉందో వివరించడంలో వెనుకాడుతోంది. మహిళను నిస్సహాయ స్థితి నుంచి బయటపడవేసి, సర్వ శక్తిమంతురాలైన చైతన్యమూర్తిగా తీర్చిదిద్దగలగడమే శాశ్వత పరిష్కారమన్న భావనను మీడియా పెంచగలగాలి. ఈ వ్యవస్థ దిశనూ, దశనూ సమూలంగా మార్చివేయగల ఆ పరిణామంవైపునకు సమాజం అడుగులు వేయడమే తదుపరి ఘట్టం కావాలని ఆశిద్దాం. ‘భారతదేశంలో దోపిడీ వ్యవస్థ కొనసాగినంత కాలం సంపన్న స్త్రీ కూడా దళితురాలేన’ని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పింది అక్షర సత్యం. నేనీ మధ్య ఓ హాస్యాస్పదమైన మాట విన్నాను. స్త్రీ–పురుషుల మధ్య వివక్ష లేని సమానత వెలుగు చూడడానికి మరో 250 సంవత్సరాలు మనం కళ్లు కాయలు కాచేలా ఎదురు తెన్నులు చూడ వలసి వచ్చేలా ఉంది అని. నిజానికి ఇది ఓ వ్యంగ్యపూరితమైన చరుపు! వస్తుతహ ప్రజలు చెడ్డవారు కారు. వారు మరోలా మారడానికి కారణం వారి చుట్టూ ఉన్న సమాజ పరిస్థితులు. ఆ పరిస్థితుల్ని సమూ లంగా మార్చడమే సర్వత్రా మన నిరంతర ఎజెండాగా ఉండాలి. – కేన్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవ సభలో ప్రసిద్ధ ఫ్రెంచ్ నటి ఇసాబెల్లి హ్యూపెర్ట్ సమాజంలో మానవ లంపటత్వానికి, లైంగికపరమైన హింసకు కారణమైన సంక్లిష్టమైన సాంఘిక సమస్యలను పరిష్కరించడానికి కఠిన తరమైన శిక్షలు విధించడం, మరణశిక్ష విధించడం ఒక్కటే మార్గంగా చూడకూడదు. ఇందుకు క్రిమినల్ (నేర) చట్టం ఒక్కటే చాలదు. ప్రతి మహిళ నేను సహితం (మీ టూ) అంటూ స్వీయరక్షణార్థం తెగించి ప్రతిఘటనా శక్తిగా ముందుకు దూకాలి. – ప్రభా కోటేశ్వరన్, లా అండ్ సోషల్ జస్టిస్ ప్రొఫెసర్, లండన్. ఢిల్లీలో ‘క్రిమినల్ లా 39–ఎ సెక్సువల్ వయొలెన్స్’ అనే అంశంపై జరిగిన సదస్సులో చేసిన ప్రసంగం సామాజిక మాధ్యమాల పేరిట నేడు సోషల్ మీడియా ముమ్మరించి నందున ఇప్పుడు భారీ స్థాయిలో సమాజంలో బహుముఖాలుగా జరుగుతున్న హింసాకాండ, అకృత్యాలు, హత్యలు, ఆత్మహత్యలు ప్రజల దృష్టికి, పాలకుల దృష్టికి వచ్చి కళ్లు తెరిపించడానికి ప్రయ త్నిస్తున్నాయి, అంతకు ముందు కూడా ఎన్నో అసాంఘిక అకృ త్యాలు జరిగినా మాధ్యమాల దృష్టికి ఈ స్థాయిలో వచ్చేవి కాదు. కానీ సమాజంలో జరుగుతున్న అనేక అకృత్యాలు, అవకతవకలు వెల్ల డవుతున్నా, కొంతమంది రాజకీయనేతలు, అధికారులు కలిసి నేర గాళ్లతో మిలాఖత్ కావడం వల్ల దేశంలో నేరాల సంఖ్య అదుపు లేకుండా పెరుగుతోంది. ఈ వాస్తవాన్ని సుమారు ముప్పై ఏళ్ల నాడే కేంద్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి ఓహ్రా నిశితంగా ఒక నివేదికలో బహిర్గతం చేశారు. అయినా సరే, అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారు అన్న సామెతలాగా పాలకులు, నేరగాళ్ల పరిస్థితి తయారైంది. ఇందులో భాగంగానే గాంధీజీ ఎంత గానో మద్యాన్ని (తాగుడును) ప్రోత్సహించడం ద్వారా వచ్చే రెవెన్యూ ఆధారంగా ప్రభుత్వాలు పరిపాలన నిర్వహించడాన్ని వేనోళ్లా నిరసించి, హెచ్చరించినా పలువురు స్వతంత్ర భారత రాష్ట్రాల పాలకులు ఏదో ఒక రూపంలో మద్యపానాన్ని విచ్చలవిడిగా ప్రోత్సహిస్తూనే ఉన్నారు. వెరసి వీటన్నింటి ఫలితమే ఇటీవలి కాలంలో దేశంలోనూ, తెలంగాణా రాష్ట్రంలోనూ పోటెత్తిన స్త్రీల మానభంగాలు, హత్యలు, ఆత్మహత్యలు... ఇందులో భాగమే. పెట్టుబడిదారీ వ్యవస్థ దశనూ, దిశనూ మార్చగల స్త్రీ విమోచన ఉద్యమానికి, తద్వారా వ్యవస్థాగతమైన కుదుపునకూ, ఒక దశలో శ్రీకారం చుట్టాయి. నిర్భయ, అభయల హత్యా ఉదంతాలు. కాగా, ఆతర్వాత కొద్ది కాలంగానూ, నిన్నగాక మొన్న జరిగిన డాక్టర్ దిశ తదితర యువతులపై అత్యాచారాలు, అభంశుభం తెలియని చిన్నారు లపైనా గురిపెట్టిన మగమృగాలు ఉదాహరణలు. వినడానికి సైతం మనస్కరించని కర్ణకఠోర సత్యాలుగా మనల్ని వేధిస్తున్నాయి. ‘ఇన్ని అఘాయిత్యాలు, మన చుట్టూ జరుగుతున్నా మన టీవీలూ, ఇతర మాధ్యమాలూ ఘటనల ప్రసారంలో గానీ, విమర్శ లలో, వ్యాఖ్యానాలలో గానీ, ఎంతసేపూ ‘మృగాళ్ల అంతు చూద్దాం’, ఇంటి నుంచి బయటకు వెళ్తే చాలు మళ్లీ వచ్చేవరకు భయమే, ‘మన సంస్కృతి ఆడపిల్లల్ని గౌరవించడం’, ‘కామాంధుల వికృత చేష్టలకు ఇంకెంతమంది బలికావాలో’ అన్న శీర్షికలతోనే సరిపెట్టుకుంటు న్నాం. కానీ ఎక్కడా మన మాధ్యమాల ప్రసారాలలో, సమాజంలోని ఈ అకృత్యాలకు పునాది, లేదా పుట్టి పెరిగిన ‘పుండు’ ఎక్కడ ఉందో వివరించడంలో జంకుతున్నాయి. స్త్రీ అబల కాదు, సబల అని చెప్పు కోవడంలో పురాణ కథలతో, లేదా కట్టు కథలతో సరిపెట్టుకుం టున్నాం. అంతేగానీ–అమృతాన్ని, హాలాహలాన్ని సమానంగా ఇము డ్చుకోగల శక్తి కూడా స్త్రీకి ఉందన్న సత్యాన్ని గుర్తించి, ఆమెను శాశ్వ తంగా నిస్సహాయ స్థితి నుంచి, సర్వ శక్తిమంతురాలైన చేతనామూ ర్తిగా తీర్చగలిగేది పెట్టుబడిదారీ దోపిడీ సమాజ వ్యవస్థను సమూ లంగా మార్చడంవల్లనే సాధ్యమూ, శాశ్వత పరిష్కారమూనన్న అవ గాహనను వారిలో వ్యాఖ్యాతలు, విశ్లేషకులూ పెంచగలగాలి. మాధ్యమాలు దోపిడీ వ్యవస్థకు వాహకాలుగా వ్యవహరించ కూడదు. దోషాలు సోషలిస్టు వ్యవస్థల్లో మాత్రం ఉండవా అంటే, ఉండవచ్చు గానీ, పెట్టుబడిదారీ వ్యవస్థలో సాగే దోపిడీలో కానవచ్చే నామమాత్రపు ‘సుగుణం’ దాని నూరు దోషాలలో ఒకటిగా మాత్రమే గణనలోకి వస్తుంది. ఇదీ నిరంతర దోపిడీపై ఆధారపడితేగానీ తన ఉనికిని కాపాడుకోలేని పెట్టుబడి వ్యవస్థకూ, దాని రద్దుపై ఆధార పడిన సమసమాజ వ్యవస్థకూ మధ్య మౌలికమైన వాస్తవ వ్యత్యాస మని ప్రసార మాధ్యమాలకు స్పృహ ఉండాలి. ఈ స్పృహకు స్వార్థ చింతనలేని చైతన్యం అవసరం. బహుశా అందుకనే భారత రాజ్యాంగ అగ్రశ్రేణి నిర్మాత, దళిత వెలుగు దివ్వె డాక్టర్ అంబేడ్కర్ ‘భారతదేశంలో దోపిడీ వ్యవస్థ కొనసాగినంత కాలం సంపన్న స్త్రీ కూడా దళితురాలేన’ని స్పష్టం చేశారు. గాంధీజీ ‘దేశంలో ఆఖరి నిరుపేద కూడా బానిసత్వం నుంచి, దోపిడీనుంచి విముక్తి అయ్యే దాకా దేశానికి స్వాతంత్య్రం రానట్టే’నని చాటడంతోపాటు ‘అర్ధరాత్రి కూడా స్త్రీ నిర్భయంగా వీధులలో స్వేచ్ఛగా నడిచి వెళ్లగలిగినప్పుడే’ దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు భావించాలన్నాడు. ఈ వరసలోని వారే ఫ్రెంచి విప్లవకాలంనాటి బ్రిటిష్ వనిత ఉద్యమ సారథి ఊల్స్టోన్క్రాఫ్డ్, ఆ తరువాత ఫ్రెంచి మహిళా విమోచనోద్యమ నాయకురాలైన సిమన్ దిబోవెర్, భారతదేశంలో అనీబిసెంట్, దుర్గా బాయి దేశ్‌ముఖ్, రాజారామ్మోహన్రాయ్, వీరేశలింగం, చిలకమర్తి ప్రభృతులు విద్యలో, వివాహంలో, మానవ పురోగతికి చెందిన సకల శాస్త్ర, సాంకేతిక రంగాలలో మహిళల నిరంతర పురోగతిని, ఉన్నతిని ఆశించి అందుకు కృషి చేసిన మహోదయులు. ఇక ప్రపంచ శాస్త్రీయ సోషలిజం సిద్ధాంతకర్తలు మార్క్స్–ఎంగె ల్స్‌లు... ఫ్యూడల్, పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థల్లో పాలక స్థానాల్లో ఉన్నవారు నేరగాళ్లు, బేరగాళ్లతో చేతులు కలిపి తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం క్రిమినల్స్పైన, నేరస్థుల ఆధారంగా ఏర్పడే న్యాయవ్యవస్థలూ, న్యాయవాదులు, న్యాయ మూర్తులూ, పోలీసు యంత్రాంగం, దళారీ వ్యవస్థతోపాటు తలారులు, వీరందరి పరస్పర ఆధారంతో వెలువడే తీర్పు సారాంశం– స్థూలంగా అమలులో ఉన్న దోపిడీ వ్యవస్థను ఏదో విధంగా కొనసాగేలా చేదోడువాదోడు కావడ మేనని మార్క్స్ ‘ధనికవర్గ నాగరికత–నేరాలు’ అన్న రచనలో పేర్కొ న్నాడు. 150 సంవత్సరాల నాటిదే అయినా, ఎంతటి దార్శనికత. కాకపోతే ఏమిటి చెప్పండి తానింకా తల్లిగర్భంనుంచి పూర్తిగా లోకంలోకి వచ్చి కళ్లు తెరవనేలేదు/ నా ప్రార్థన మనసులో ఉంచండి/ పశుప్రాయుడైనవాడు/ భగవంతుడ్ననేవాడు/ నాకు ఈ ఇరువురి సంపర్కం వదిలించండి/ బయటికి రాబోతున్న నాకు ఇవ్వండి– నాలో గల మానవత్వం ఎవరైతే రేపు అపహరించబోతారో /ఎవరైతే నన్నొక యంత్రంగా మార్చాలని ప్రయత్నిస్తారో/ బజారులో నన్నొక సరుకుగా మొఖానికొక ఖరీదు తగిలించి/ నా ఆస్తిపాస్తుల్ని ఎవరైతే చీల్చాలనీ చూస్తారో/ అటూ ఇటూ బంతిలాగా తంతారో/ ఎవరైతే నన్నొక జీవంలేని శిలను చేసి వేధిస్తారో/ అలాంటివారందరినీ ప్రతి ఘటించగల శక్తిని నాకివ్వండి/ ఈ షరతుల మీదనే నన్ను బయటికి రానివ్వండి’! రేపో మాపో, ఈవేళో లోకంలోకి అడుగుపెట్టడానికి ఉవ్విళ్లూరుతూ భీతిభీతిగా ఆక్రోశిస్తున్న శిశు ఘోష, పుట్టిన, పుట్ట బోయే బిడ్డల, తల్లులందరి మనస్సుల్లో నిప్పుకణాలుగా మారి ‘మేము సహితం’ అంటూ నేటి నుంచే ముందడుగై సాగాలి. నికృష్టపు మన దోపిడీ వ్యవస్థకు, ఆర్థిక, మానసిక, వివక్షాపూరిత దోపిడీ వ్యవస్థలో బందీలైపోయి కునారిల్లుతున్న వివాహిత, అవివా హిత మహిళలందరూ ఒక్కొక్కరూ ఒక– ‘‘అగ్నికాళిగా/ ఒక భద్ర కాళిగా/ ఒక మంత్ర కాళిగా/ ఒక నాట్యకాళిగా/ ఓ ఘటనకాళిగా/ ఓ ఉగ్రకాళిగా, ఓ రుద్రకాళిగా మారాలి’ అప్పుడే ఆ క్షణమే సామాజిక అజ్ఞాత విదూషకుల ఆత్మహత్యకు ప్రారంభోత్సవమూ జరగాలి. అప్పుడే–పెట్టుబడి దోపిడీపై ఆధారపడిన ఈ వ్యవస్థ దిశనూ, దశనూ మన మహిళా లోకం సత్యభామలై మార్చగలరు. ఆ ముహూ ర్తంవైపే ఇక అడుగులు పడబోవటమే తరువాయి ఘట్టం కావాలని ఆశిద్దాం! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
అమరావతిలో మహిళలకు రక్షణ కరువు!
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో మహిళల వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడేలా చేస్తాం.. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడేవారికి అదే ఆఖరి రోజవుతుంది.. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి మహిళలపై దాడులు చేసేవారిని కఠినంగా శిక్షిస్తాం.. గుంటూరు జిల్లా దాచేపల్లిలో బాలికపై లైంగిక దాడి జరిగిన సమయంలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి చెప్పిన మాటలు ఇవి.. అయితే ఆ తరువాత జిల్లాలో వరుసగా 20 ఘటనలు జరిగాయి. ఇంతవరకూ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసిన దాఖలాలు గానీ, మృగాళ్లపై కఠిన చర్యలు తీసుకున్న సందర్భం గానీ లేదు. జిల్లాలో పరిస్థితి ఇలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి అతి చేరువలో ఉండే మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో యువతులపై లైంగిక దాడులకు పాల్పడి, హత్య చేస్తున్న ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఏడాది వ్యవధిలో రాజధాని ప్రాంతంలో నాలుగు వరుస ఘటనలు జరిగాయి. ప్రేమికులు నిర్మానుష్య ప్రాంతాల్లో కనిపిస్తే చాలు దాడులకు తెగబడడం, ప్రియుడిని బెదిరించో, లేక దాడి చేసో ప్రియురాలిపై లైంగిక దాడులకు యత్నించిన ఘటనలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. తాజాగా మంగళగిరి మండలం నవులూరు వద్ద ప్రేమ జంటపై గుర్తుతెలియని వ్యక్తులు యువతిని హత్యచేసి, యువకుడిని తీవ్రంగా గాయపరిచిన ఘటన సంచలనం కలిగించింది. ఈ ఘటనతో రాజధాని ప్రాంత ప్రజలు హడలిపోతున్నారు. రాజధాని ప్రాంతంలో ప్రేమజంటలపై దాడులు, యువతులపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు అనేకం జరుగుతున్నా వీటిలో కొన్ని మాత్రమే బయటకు వస్తున్నాయని చెబుతున్నారు. ముఖ్యమంత్రి నివాసం పరిసర ప్రాంతాల్లోనే ఆందోళనకర ఘటనలు జరుగుతుండటం దారుణమని వారు వాపోతున్నారు. చంద్రబాబు రోజూ చెపుతున్న సింగపూర్ తరహా రాజధాని ఇదేనా.. అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏడాదిలో ఎన్నో ఘటనలు... 1. గత ఏడాది సీతానగరం రైల్వే బ్రిడ్జిపై ప్రేమికులను బెదిరించి ప్రియుడిపై దాడిచేసి కొట్టడంతోపాటు యువతిపై లైంగిక దాడికి ప్రయత్నించారు. అదే సమయంలో అటుగా కొందరు వస్తున్న విషయం గమనించి పరారయ్యారు. పరువు పోతుందనే భయంతో ప్రేమ జంట పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. 2. 2018, ఆగస్టులో చినకాకాని రాజ్‌కమల్ రోడ్డులో ఓ కానిస్టేబుల్ ఓ యువతితో ఉండగా, నలుగురు యువకులు వారిపై దాడిచేసి బంగారం లాక్కోవడమే కాకుండా యువతిని ముళ్ళపొదల్లోకి లాక్కెళ్ళే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన కానిస్టేబుల్ చుట్టుపక్కల వారిని పిలవడంతో వారు పరారయ్యారు. 3. నాలుగు నెలల క్రితం మంగళగిరి మండలం పెదవడ్లపూడి సమీపంలోని కోకాకోలా ఫ్యాక్టరీ వద్ద నిర్జన ప్రదేశంలో ఉన్న ప్రేమ జంటపై దాడిచేసి ముగ్గురు యువకులు ప్రియుడిని కొట్టి పంపించారు. యువతిపై రాత్రంతా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం కలిగించింది. తాజాగా నవులూరు సమీపంలో ప్రేమ జంటపై దాడి కలకలం సృష్టించింది. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న వరుస ఘటనలు ఆ ప్రాంతవాసులను ముఖ్యంగా యువతుల తల్లిదండ్రులకు వణుకు పుట్టిస్తున్నాయి. ఈ ప్రాంతంలో పలు యూనివర్సిటీలు, కళాశాలలు ఉండటంతో యువతీ యువకులు ప్రేమ పేరుతో నిర్జన ప్రాంతాల్లో తిరుగుతుండటం పరిపాటిగా మారింది. ప్రేమ జంటలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయాందోళన రాజధాని ప్రాంత ప్రజల్లో నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంతో పాటు, డీజీపీ కార్యాలయాలకు కూతవేటు దూరంలో ఈ ఘటనలు చోటుచేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వం మహిళలకు ఇచ్చే రక్షణ ఇదేనా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏదైనా ఘటనలు జరిగినప్పుడు కఠినంగా వ్యవహరిస్తే నేరాలకు పాల్పడేవారికి భయం కలుగుతుందని, పోలీసులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి కొన్ని కేసులను నీరుగారుస్తుండటం మృగాళ్లకు చట్టం అంటే భయం లేకుండా ఉందని చెబుతున్నారు. -
మగాళ్ల కోసం ఓ కమిషనా?!
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్ ‘పురుష కమిషన్’ కూడా ఉండా లని వాక్రుచ్చారు. దాంతో మహిళలే కాదు పురుష ప్రపంచం కూడా నివ్వెరపోయింది. ఎవరో కొద్దిమంది 498ఎ ముద్దా యిలు, 498ఎ బూచితో ఎన్ఆర్ఐ నిధులు పొందే ‘బాధితుల’ సంఘాలు మినహాయింపు అనుకోండి. ఈ అద్భుతమైన ఆలోచన, ఆమె దగ్గరికి వస్తున్న వారికి ఆమె కౌన్సెలింగ్ ఇస్తున్న సందర్భంలో ఆమె చైర్మన్‌గా ‘కేసు’ తెలుసుకోవడం మానేసి కౌన్సి లింగ్‌లు నిర్వహిస్తున్న సందర్భంలో వచ్చిందన్న మాట. 40 శాతం భార్యల తప్పు ఉన్నట్లు ఆమెకు తెలిసిందట. ఈ శాతం అంశంలో ఆమె అనుభవాల నయినా ఒక పద్ధతి ప్రకారం నమోదు చేసి విశ్లేషించి చెప్పలేదు. ఇటువంటి అరుదైన అధ్యయనాలతో మహిళా సంఘాల కళ్లు తెరిపించడానికి, లెక్కలు విడుదల చేయండి అంటే అబ్బే అలా చేయకూడదు. వాళ్ల పేర్లు బయటపెట్టకూడదన్నారు. అసలు 40 శాతం స్త్రీలు.. పురుషుల్ని బాధ పెట్టేంత సాధికారత పొందినట్లయితే ఇక మహిళా కమిషన్ అవసరం ఏముంది? 60 శాతం పురుషులు హింసిస్తున్నారట. సగం వాళ్లు సగం వీళ్లు హింసిస్తూ సాగే పవిత్ర కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆద ర్శంగా ఉంటుంది. అసలు కుటుంబం అంటే ఏమిటి? గృహ హింస ఏ ఆధిపత్య సంబంధాల వలన వస్తుంది? వాటిని ఆర్థిక వ్యవస్థ– (వనరుల్లేక స్త్రీలు ఆధారపడే స్థితి) ఎందుకు కొనసాగిస్తుంది? వంటì మౌలిక అవగాహన కూడా లేని వ్యక్తుల్ని కమి షన్లలో నియమించడమే అసలు దారుణం. ఆంధ్రప్రదేశ్‌లో భర్తల్ని చంపిన భార్యలకు చెందిన రెండు మూడు ఘటనలు, తెలంగాణలో జరి గిన ఐదు ఘటనలు.. ఇంకా దేశంలో అత్యంత అరు దుగా జరిగే ఇటువంటి ఘటనలు మీడియాలో చాలా సమయం పొందుతున్నాయి. ఒక నల్ల బానిస తెల్ల వాడిని చంపితే ఇటువంటి ఆగ్రహమే ప్రకటిత మయ్యేది ఒకప్పుడు. ఒక శూద్రుడు బ్రాహ్మడిని తన్నితే ఇలాగే కూసాలు కదిలిపోయేవి. ఒక స్త్రీ భర్తను కాదంటే ఇలాగే ఆవేశాలు పెల్లుబికేవి. 498ఎని నీరుకార్చడం ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరో ధక చట్టం బుట్టదాఖలు చేయటం ఇపుడు ఎదురు దాడి చేస్తున్న ఆధిపత్య వర్గాల వ్యూహంలో భాగమే. వ్యక్తిగతంగా నేరం చేసినవాళ్లని ఎవరినయినా చట్టప్రకారం సత్వరంగా న్యాయ విచారణ పూర్తిచేసి శిక్షించాలి. దీనికి ఆడ, మగా తేడా లేదు. అట్లాగే నేర ప్రవృత్తి స్త్రీలకు ఉండదు అనడం స్త్రీలను దేవతలుగా కీర్తిస్తూ బానిసలుగా మార్చిన సంస్కృతి తాలూకూ భావజాలమే. ఆమె మనిషి. మనిషికుండే మంచి చెడు లక్షణాలు ఆమెక్కూడా ఉంటాయనడం వాస్త వం. మహిళా కమిషన్ ఏర్పాటు జరిగింది మహిళలు ఏం చేసినా రక్షించడానికి కాదు. కుటుంబ వ్యవస్థకు కాపలా వేయడానికి కూడా కాదు. ప్రపంచ వ్యాప్తంగా 40 శాతం స్త్రీలు గృహ హింసకు గురవుతున్న విషయం నమోదు కాదు. కుటుంబ పరువు, ఆర్థికంగా ఆధారపడటం, పిల్లలకు వేరే భరోసా లేకపోవడంతో హింసను వీళ్లు మౌనంగా భరిస్తుంటారు. అలా భరించడమే ఉత్తమ ఇల్లాలి లక్షణమని సమాజం, మతం ఊదరగొట్టి స్త్రీల నరనరాల్లో దీన్ని నింపేశారు. కానీ ఇపుడు కాస్త చదువుకుని, ఉద్యోగాలు చేస్తూ ప్రపంచం తెలు సుకుని నేనూ మనిషినే అని తిరగబడితే అది మగా డిపై హింసగా మారిపోతోంది. ‘అత్తమామల్ని చూడ రంట. ఆడపడుచులకి సేవలు చేయరంట. ఎంత దారుణం’ అని సదరు చైర్మన్ వాపోతున్నది. అలా అయితే భార్య తల్లిదండ్రుల్ని చూసే బాధ్యత భర్తకు ఉందా? ఇద్దరూ సమానం అయినపుడు ఇరువైపులా తల్లిదండ్రులపట్లా సమానంగా బాధ్యత వహించాలి కదా. అట్లా కాకుండా తనపై పెత్తనం చేసే వారికి సేవలు చేయకపోవడం దారుణం అంటున్నామంటే కుటుంబం ‘మగాడిది’ అని అంగీకరించడమే. భర్త తాలూకు అధికారంతో తనపై నిరంతర నిఘా వేసి తప్పులుబట్టి సేవల్ని కూడా గుర్తించక పోవడం తమ హక్కుగా భావించే వారితో కలిసి ఉండాలని ఎవరికి ఉంటుంది? వారి జీవిత భాగస్వాములను వారికి బలవంతంగా సేవలు చేయమనడం సరికాదు. ‘మగాడి’ ఇంటికి వచ్చి ఇంటి పేరు (కొన్నిసార్లు స్వంత పేరు కూడా) మార్చుకుని, అత్తింటి మనిషిగా స్త్రీలను తయారు చేసే క్రమమే హింస. ఓ మనిషిగా గుర్తింపుని (కన్యాదానంతో) కోల్పోయే క్రమం. సామాజిక కట్టుబాట్లతో మొదలయ్యే హింస. స్త్రీలపై హింస నానాటికీ పెరుగుతుండటం అంటే ఆధిపత్యం, అసమానత పెరుగుతున్నదనే అర్థం. చదువురాని స్త్రీలు కూడా తమ అనుభవాల నుంచి∙దీనిని చక్కగా అర్థం చేసుకోగలరు. ఆధిపత్యాన్ని సమర్థించేవారు దీన్ని అర్థం చేసుకోవడానికి నిరాకరిస్తారు. పీడితులకు న్యాయం చేయాల్సిన పద విలో ఉన్న వారికి పీడిత వర్గ పక్షపాతం లేకుంటే వారికి అన్యాయం జరుగుతుంది. స్త్రీలకు చట్టపరమైన హక్కులు కల్పిస్తున్నాయా లేదా పర్యవేక్షించడానికి ఒక స్వతంత్ర సంస్థగా ఏర్ప రచినవే కమిషన్లు. వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలు అన్నింటిపైనా నిఘా ఉంచడం. వాటిని ప్రశ్నించడం, పనిచేసేలా ముల్లుగర్రతో పొడవటం. చట్టాల లోపాలను ఎత్తిచూపడం వీటి పని. వివాహేతర సంబంధాలలో పురుషుడికే స్వేచ్ఛ ఉంది. స్త్రీకే లేదు. స్త్రీ వివాహం వద్దని చెబితే గౌరవ హత్యలు జరుగుతాయి. విడాకులు కావాలంటే.. వెలి వేస్తారు. చుట్టూ వాతావరణం నేరం చేసినా తప్పిం చుకోవచ్చనే భరోసా కల్పిస్తుంది. భర్తను చంపే బదులు వదిలివేయవచ్చు కదా అని దీర్ఘాలు తీస్తు న్నారు కొందరు. రెండేళ్లలో 87 శాతం పెరిగిన వర కట్న హత్యలకు కారకులైన భర్తలక్కూడా అదే చెప్పి చూడండి. గృహ హింసకు కారణం అయిన వారికి ఈ నీతిబోధ చేయండి.స్త్రీలు ఇట్లా చేసినవి జరిగిన నేరాల్లో 0.0000 శాతం కూడా లేవు. దానికే ఇంత గగ్గోలు అంటే మనది ఎంత మగాధిపత్య సమాజమో, ఎంత మగ మీడియానో, స్త్రీలు అణగి ఉండాలనే భావజాలం మనలో ఎంత పేరుకుపోయిందో అర్థమౌతుంది. సమాజంలో గల అసమానతకు తద్వారా స్త్రీలపై హింసకు కుటుంబంలోని ఆధిపత్య సంబంధాలకూ, హింసకూ గల సంబంధాన్ని దాని చారిత్రక క్రమాన్ని అందరూ అధ్యయనం చేయక పోవచ్చు. కానీ కాస్త ఇంగిత జ్ఞానం, వాస్తవాల పట్ల గౌరవం ఉండాలి. కమిషన్ చైర్మన్‌గా ఉన్నప్పుడు తాను మాట్లా డిన మాట మహిళల ప్రయోజనాలకు గొడ్డలి వేటుగా మారుతుందనీ, స్త్రీలను హింసించేవారంతా ఈ తప్పుడు వాదనను భుజానేసుకుంటారనే సోయి కూడా లేనివారికి రాజ్యాంగ పదవి ఉండాలా? అర్హ తలేమీ లేకుండా ఒక రాజ్యాంగ పదవిలో వ్యక్తుల్ని నియమిస్తే ఏమవుతుందో ప్రభుత్వాలకు ఇప్పుడ యినా అర్థమైందో లేదో.. వారికి అర్థం కాకుంటే ఇటువంటి భావాలున్న వారినీ, అనర్హులనూ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేయాలి. దేవి వ్యాసకర్త సాంస్కృతిక కార్యకర్త -
ఏపీలో రోజుకో అరాచకం.. నిన్న దాచేపల్లి.. నేడు తేతలి!
సాక్షి, అమరావతి : ఏపీలో జరుగుతున్న వరుస దారుణాలు మహిళాలోకాన్ని కలవర పెడుతున్నాయి. దాచేపల్లి దారుణం తర్వాత రోజుకో ప్రాంతంలో అత్యాచారాలు జరుగుతున్నాయి. నేరస్తులు ఏమాత్రం చట్టాలకు భయపడటం లేదు. తూర్పుగోదావరి జిల్లాలో సాక్షాత్తూ అధికార టీడీపీ నేతలే యువతిపై అత్యాచారానికి ప్రయత్నించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్నారిపై లైంగిక దాడి జరిగింది. వైఎస్ఆర్ జిల్లా బద్వేలులో యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. తిరుపతి రుయా ఆస్పత్రిలో వైద్య విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. వరుస ఘటనలు.. పోలీసు యంత్రాంగం నిర్లిప్తత... ప్రభుత్వ ఉదాసీనత నేరస్తులకు ఆసరాగా మారుతోంది. బద్వేలులో 17 ఏళ్ల యువతిపై.. వైఎస్సార్ జిల్లా బద్వేలులో 17 ఏళ్ల యువతిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసిన ఘటనలు జనాన్ని భయాందోళనకు గురిచేసింది. బద్వేలు సుందరయ్య కాలనీకి చెందిన 17 ఏళ్ల యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. యువతిని చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. అత్యాచారానికి పాల్పడిన నిందితుల్ని రమేష్, కృష్ణగా గుర్తించారు. పరారీలో ఉన్న ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తిరుపతి రుయాలో.. తిరుపతి రుయాలో వైద్యులు లైంగికి వేధింపులకు గురిచేస్తున్నారని పీడియాట్రిక్ విభాగంలో పీజీ పైనల్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని గవర్నర్‌కు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన గవర్నర్ విచారణ జరిపించాలని హెల్త్ వర్సిటీకి ఆదేశించారు. ఈ మేరకు తిరుపతి రుయాలో రెండు రోజులుగా అధికారులు అంతర్గత విచారణ జరిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న చిన్నపిల్లల విభాగం ఇన్చార్జ్ ప్రొఫెసర్ రవికుమార్, ప్రొఫెసర్ శశికుమార్, ప్రొఫెసర్ కిరీటీలను విచారించారు. బాధితురాలు ఫిర్యాదుపై తాము విచారణ జరిపామని ఎస్వీ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రమణయ్య ‘సాక్షి టీవీ’కి వెల్లడించారు. నివేదికను ఆదివారంలోగా హెల్త్ వర్సిటీ వీసీకి పంపుతామని రమణయ్య తెలిపారు. సాక్షాత్తూ అధికార టీడీపీ నేతలే.. చంద్రబాబు నాయుడు పాలనలో మహిళలకు ఏ స్థాయి భద్రత ఉందో రుజువు చేసే మరో ఘటన తూర్పు గోదావరిలో జరిగింది. తెలుగు దేశం పార్టీ నాయకుడు, అతని అనుచరులు ముగ్గురు ఓ బాలికపై అత్యాచారయత్నం చేసేందుకు ప్రయత్నించడం సంచలనం రేపింది. అయితే స్థానికులు తిరగబడటంతో ఆ నలుగురూ ఘటనాస్థలం నుంచి పలాయనం చిత్తగించారు. ఈ సంఘటన బుధవారం అర్ధరాత్రి తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం తమ్మయ్యపేట గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కత్తిపూడికి చెందిన టీడీపీ ఎంపీటీసీ కంచిబోయిన సంధ్య భర్త శ్రీనివాస్, ఆయన అనుచరులు శ్రావణ్, రవి, సత్యనారాయణ బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో అన్నవరం నుంచి కత్తిపూడి వెళ్తూ తమ్మయ్యపేట వద్ద ఉన్న టీ దుకాణం వద్ద ఆగారు. టీ కావాలంటూ డిమాండ్ చేశారు. ఆ దుకాణాన్ని ఓ మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలసి నిర్వహిస్తోంది. ఇంతరాత్రి టీ ఏంటని ఆమె ప్రశ్నించడంతో.. మాకే అడ్డు చెబుతావా అంటూ అక్కడే ఉన్న ఆమె 17 ఏళ్ల పెద్ద కుమార్తె చేయిపట్టుకుని పక్కనే ఉన్న తోటలోకి శ్రీనివాస్, అతని ముగ్గురు అనుచరులు లాక్కుని పోవడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో తల్లితోపాటు ఆమె చిన్న కుమార్తె గట్టిగా అరవడంతో స్థానికులు పరుగున వచ్చి వారిని అడ్డుకున్నారు. అయినా వారిపై దుర్భాషలాడుతూ.. ‘ప్రభుత్వం మాది ఏమి చేసినా చెల్లుబాటవుతుంది’ అంటూ వాదనకు దిగారు. అయినా స్థానికులు ధైర్యంగా ఎదురునివడంతో వారు అక్కడినుంచి పారిపోయారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కంచిబోయిన శ్రీనివాస్, పసుపులేటి సత్యనారాయణ, మట్టా రవికుమార్‌లను అరెస్ట్ చేశారు. పరారీలో వున్న నాలుగో నిందితుడు శ్రావణ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అత్యాచారయత్నం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ విశాల్ గున్ని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తేతలిలో.. అభంశుభం తెలియని ఓ ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం తేతలి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. అఘాయిత్యానికి పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధిత బాలికను చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తేతలి గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలిక తణుకు పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎల్కేజీ చదువుతోంది. శుక్రవారం సాయంత్రం చిన్నారి అమ్మమ్మ ఇంటి సమీపంలోని పాఠశాల ఆవరణలో ఆడుకుంటూ ఉండగా నలుగురు మైనర్ బాలలు ఆమెకు మాయమాటలు చెప్పి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. పాలకుల అండతోనే నేరస్తులు తప్పించుకోగలుగుతున్నారని మహిళ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అధికార అండదండలు చూసుకొనే కొందరు ప్రజాప్రతినిధుల విచ్చలవిడిగా నేరాలకు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని మహిళలు మండిపడుతున్నారు. దాచేపల్లి ఘటనతోపాటు తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడికి చెందిన టీడీపీ ఎంపీటీసీ కంచిబోయిన సంధ్య భర్త శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి పునరావృతమవుతున్నాయని మండిపడుతున్నారు. ఇలాంటి ఘటనలకు నైతిక బాధ్యత వహించి హోంమంత్రి చినరాజప్ప, సీఎం చంద్రబాబు పదవుల నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తున్నారు. -
మహిళలు, బాలికలపై దాడులకు నిరసనగా
-
ఏపీలో మహిళలపై దాడులకు నిరసనగా..
సాక్షి, హైదరాబాద్ : మహిళలు, బాలికలపై దాడులకు నిరసనగా శనివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ అంతటా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించబోతున్నట్టు ఆ పార్టీ సీనియర్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 13 జిల్లాల్లో రేపు సాయంత్రం 6.30 గంటలకు కొవ్వొత్తుల ర్యాలీ చేపడతామని వివరించారు. ఈ నెల 14న వైఎస్ జగన్ పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుందని చెప్పారు. ఏలూరు వద్ద వైఎస్ జగన్ పాదయాత్ర 2,000 కిలోమీటర్ల మైలురాయిని దాటుతుందని చెప్పారు. చంద్రబాబు మోసాలను ఎండగడుతూ ఈ నెల 14, 15 తేదీల్లో నల్లజెండాలతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, శ్రేణులు పాదయాత్రలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ నెల 16న కలెక్టరేట్ల వద్ద వంచనపై గర్జన పేరుతో ధర్నాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ధర్నాల అనంతరం సమస్యలపై కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పిస్తామని చెప్పారు. బీజేపీతో ముఖ్యమంత్రి చంద్రబాబు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. మహారాష్ట్రకు చెందిన బీజేపీ మంత్రి భార్యకు టీటీడీ బోర్డులో స్థానం కల్పించడంలో చంద్రబాబు ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. నాలుగేళ్ల చంద్రబాబు పరిపాలనలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ వచ్చిన దాఖలాలు లేవని అన్నారు. పరిశ్రమల పేరిట లక్షలమందికి ఉద్యోగాలు వస్తున్నాయంటూ చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అవినీతి తాండవం అడుతోందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అన్ని వ్యవస్థలనూ సీఎం చంద్రబాబు అవినీతిమయం చేశారని ఆయన విమర్శించారు. -
పోడు మహిళలపై దాడులు ఆపాలి
పీఓడబ్ల్యూ రాష్ట్ర నేతలు చండ్ర అరుణ. ఝాన్సీ రేగళ్ల (కొత్తగూడెం రూరల్): ఎన్నో ఏళ్లుగా పోడు భూములు సాగు చేసుకుంటున్న మహిళలపై దాడులు ఆపాలని పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు జి.ఝాన్సీ, ప్రధాన కార్యదర్శి చండ్ర అరుణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేగళ్ళ పంచాయతీలోని బాబోజితండా, చంద్రాలగూడెం, పగడాయిగూడెం, తోకబందాల తదితర గ్రామాలలో మంగళవారం పర్యటించారు. వారు మాట్లాడుతూ.. దశాబ్దాలుగా పోడు చేసుకుంటున్న మహిళల నుంచి భూములను లాక్కునేందుకే హరిత హారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతన లేదన్నారు. పేద దళితులు, గిరిజనుల కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తానన్న హామీని విస్మరించి; పోడు భూములను బలవంతంగా లాక్కునేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. పోడు సాగుదారులకు పట్టాలివ్వాలని, దాడులు ఆపాలని, అక్రమ కేసులను బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్.శిరోమణి, నాయకులు గోకినపల్లి లలిత, వై.సావిత్రి, ఎంపీటీసీ సభ్యుడు వాంకుడోత్ కోబల్ తదితరులు పాల్గొన్నారు. -
‘సోషల్’ వేధింపులు
బాధితుల్లో ఉద్యోగినులు, విద్యావంతులే అధికం ఏటేటా పెరుగుతున్న కేసుల సంఖ్య ప్రతిపాదనలకే పరిమితమైన మహిళా ఠాణాలు సిటీబ్యూరో: నగరంలో మహిళలపై సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఈ-మెయిల్, ఫేస్బుక్, ఎస్ఎంఎస్ల ద్వారా మహిళలపై బెదిరింపులకు పాల్పడుతున్న కేసులు ప్రతి రోజు జంట పోలీసు కమిషనరేట్లలోని సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌కు వస్తున్నాయి. 2012లో సైబర్ నేరాల బారిన పడిన బాధిత మహిళల సంఖ్య 120 వరకు ఉంటే 2013లో ఆ సంఖ్య 172కు పెరిగింది, 2014లో 342 మంది మహిళలు ఫిర్యాదు చేశారు. బాధితుల్లో ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విద్యావంతులే ఉన్నారు. మగ వారితో ఉన్న చిన్నపాటి పరిచయాతోనే వేధింపులకు గురవుతున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ‘‘నన్ను ప్రేమించు..పెళ్లి చేసుకో..లేదంటే ఫేస్బుక్లో మార్ఫింగ్ చేసిన పొటోలు పెడుతా’’. ‘‘నా కోరిక తీర్చకుంటే.. నీ పెళ్లి కాకుండా అసత్య ప్రచారం చేస్తా’’ ఇలా బెదిరిస్తున్న ఆకతాయిలపై బాధిత మహిళలు ఫిర్యాదు చేయడం, పోలీసులు కేసు నమోదు చేయడం వరకు బాగానే ఉంది. అయితే కేసులు నమోదై ఏళ్లు గడుస్తున్నా ఇంత వరకు ఒక్కరంటే ఒక్కరికి కోర్టులో శిక్ష పడలేదు. సకాలంలో చార్జీ షీట్ దాఖలు చేయకపోవడం ఓ కారణమైతే, కేసు మధ్యలో నిందితుడితో బాధిత మహిళలు తమకెందుకులే అనుకుని రాజీ కుదుర్చుకోవడం మరో కారణం. కొన్ని కేసులలో పోలీసుల దర్యాప్తులో లోపాలు ఉన్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సైబర్ నేరగాళ్ల వేధింపులు భరించలేక కొంత మంది మహిళలు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు సైతం ఉన్నాయి. మరికొందరు మహిళలు ఉద్యోగాలకు పులిస్టాప్ పెట్టి ఇంటికే పరిమితమవుతున్నారు. ఇక విద్యార్థినుల విషయంలోను ఇదే జరుగుతోంది. లెక్చరర్లు, తోటి విద్యార్థుల వేధింపులు భరించలేక సగంలోనే చదువును మానివేస్తున్నారు. పోలీసు స్టేషన్లలో నమోదైన గణాంకాలు ఇలా ఉంటే ఇక పరువు పోతుందనే భయంతో, మగ పోలీసులకు ఏమని ఫిర్యాదు చేయాలనే భయంతో ఫిర్యాదు చేయకుండా ఉన్న వారి సంఖ్య నమోదవుతున్న కేసుల సంఖ్య కంటే మూడింతలు ఎక్కువగానే ఉంటుంది. ఖాళీ పోస్టులే.. జంట పోలీసు కమిషనరేట్లలో మహిళలు, విద్యార్థినిలకు భద్రత, భరోసా కల్పిస్తామంటున్న అధికారులు ఖాళీగా ఉన్న మహిళా పోస్టులను భర్తీ చేయడంలో ఆసక్తి చూపడంలేదు. సైబరాబాద్, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్లలో జోన్‌కు ఒకటి చొప్పున మహిళా పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద మూడేళ్లుగా పెండింగ్‌లో ఉంది. జంట పోలీసు కమిషనరేట్లలో కనీసం 10 ఠాణాలు ఉండాల్సింది. అయితే కేవలం ఐదు మాత్రమే ఉన్నాయి. మహిళా పోలీసు సిబ్బంది సంఖ్య కూడా తక్కువగా ఉంది. నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో దశాబ్దాల క్రితం ప్రభుత్వం 504 మహిళా పోలీసు పోస్టులను మంజూరు చేయగా 2014 గణాంకాల ప్రకారం 226 మంది మాత్రమే భర్తీ అయ్యారు. 238 పోస్టులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. వీటి భర్తీ ఆగమ్య గోచరంగానే మారింది. -
'శక్తిగా ఎదిగి.. 'నిర్భయం'గా ఉండండి'
- నిర్భయ కేంద్రం, శిశు గృహ భవనాల ప్రారంభోత్సవంలో ఎంపీ కవిత ఇందూరు: తెలంగాణ ఆడబిడ్డలు ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనే శక్తిని సముపార్జించుకుని నిర్భయంగా ఉండాలని ఎంపీ కవిత సూచించారు. సుభాష్‌నగర్‌లో నిర్మించిన శిశుగృహ భవనాన్ని శుక్రవారం ప్రారంభించారు. భవనంలోని సౌకర్యాలను ఆమె పరిశీలించారు. శిశుగృహలో ఉన్న అనాథలైన ఏడాదిలోపు పిల్లలకు అన్నప్రాసన చేశారు. ఏడాది వయసు గల పాపను ఆర్మూ ర్ మండలం పెర్కిట్‌కు చెందిన దంపతులకు దత్తత ఇచ్చారు. అనంతరం జిల్లా ప్రభుత్వాస్పత్రికి చేరుకుని ఐదో అంతస్తులో ఏర్పాటు చేసిన నిర్భయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఐసీడీఎస్ పీడీ రాములుతో మాట్లాడి నిర్భయ కేంద్రంలో కల్పించి న సౌకర్యాలు, పని చేసే సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. ఫోన్ ద్వారా ట్రయల్ కాల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన సమావేశాన్ని కవిత ప్రారంభించారు. తెలంగాణ ఆడబిడ్డల సంక్షేమం కోసం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఆడబిడ్డ బిందెతో రోడ్డెక్కకుండా ఉండేందుకు వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తున్నారన్నారు. పేద ఎస్సీ ఎస్టీ మహిళలను వివాహ సమయంలో ఆదుకోవడానికి కళ్యాణలక్ష్మి, ఆడబిడ్డలను ఆపదలనుంచి కాపాడేందుకు షీ టీంల ఏర్పాటు వంటి చర్యలు తీసుకున్నారన్నారు. ఆడబిడ్డలపై లైంగిక దాడులు, గృహహింస వేధింపులు జరిగితే వారికి అండగా నిలిచేందుకు నిర్భయ కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. దాడుల బారిన పడిన మహిళలు, గృహహింస బాధితులు వారి సమస్యను నేరుగా చెప్పుకోవడానికి నిర్భయ కేంద్రం ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇందులో లీగల్ కౌన్సిలర్, పోలీసులు, డాక్టర్ ఉంటారని, ఎలాంటి సమస్యకైనా ఇక్కడ పరిష్కారం లభించడంతో పాటు నిందితులకు శిక్షపడే విధంగా నిర్భయ కేంద్రం పని చేస్తుందని తెలిపారు. ఎలాంటి సమస్య ఎదురైనా నిర్భయ కేంద్రానికి 08462-225181 ఫోన్ చేయాలని సూచించారు. త్వరలోనే టోల్ ఫ్రీ నంబరు కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం నిర్భయ కేంద్రానికి సంబంధించి వాల్ పోస్టర్లను, కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, కలెక్టర్ రొనాల్డ్ రోస్, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, మేయర్ ఆకుల సుజాత తదితరులు పాల్గొన్నారు. -
కామాంధులను కఠినంగా శిక్షించాలి
రాయచూరు రూరల్ : రాష్ట్రంలో మహిళలపై రోజురోజుకూ అత్యాచారాలు పెరిగిపోతున్నాయని మహిళా మోర్చా సంచాలకురాలు సులోచన ఆందోళన వ్యక్తం చేశారు. అత్యాచార ఘటనల్లో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ సూపర్ మార్కెట్ వద్ద మంగళవారం చేపట్టిన ధర్నాలో ఆమె ప్రసంగించారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు, హత్యలు చేయడం నిలుపుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో 6 నెలలలో 479 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయని, వీటిపై చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. కార్యక్రమంలో సుమతీ శాస్త్రి, శరణమ్మ, సుశీల, సరోజమ్మ తదితరులున్నారు. -
మహిళలపై దాడులను అడ్డుకోలేమా?
లైంగిక దాడులను జాతీయ సమస్యగా చూడాలి సీపీఎం జాతీయ నేత బృందాకారత్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం: సమాజంలో మహిళలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయని సీపీఎం జాతీయ కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై జరిగే లైంగిక దాడులను జాతీయ సమస్యగా చూడాలన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ‘స్త్రీ స్వేచ్ఛ-ఆటంకాలు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆమె ప్రసంగించారు. దళిత మహిళపై లైంగిక దాడి జరిగితే ఏ ఒక్కరూ స్పందించకపోవటం విచారకరమన్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో మతోన్మాదం పెరిగిపోయిందని ఆరోపించారు. జాతీయ సంపద, సహజ వనరులను దోచుకునే విధంగా రాజకీయ వ్యవస్థ తయారైందన్నారు. హిందూత్వ మతతత్వ శక్తులు మహిళల సాధికారతను అడ్డుకుంటున్నాయని, ఇది దేశాభివృద్ధికి ఆటంకమని తెలిపారు. ముగ్గురు ఉన్న కుటుంబంలో ఒక్కరికే పెన్షన్ ఇవ్వాలనే విధానం లింగవివక్షతకు దారితీసి చివరకు విడాకులు తీసుకునే పరిస్థితి వస్తుందని, ఇదేనా ప్రభుత్వ విధానమని ఆమె ప్రశ్నించారు. కొత్త రాష్ట్రంలో మహిళల పట్ల ఎలాంటి వివక్ష లేకుండా చూడాలని ఆమె కోరారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి.జ్యోతి అధ్యక్షతన జరిగిన సదస్సులో ప్రొఫెసర్ వి.పద్మజ, భూమిక ఎడిటర్ కొండవీటి సత్యవతి, ప్రముఖ రచయిత్రి శిలాలోలిత, ఐద్వా రాష్ర్ట కార్యదర్శి హైమావతి, ఐలు నగర కార్యదర్శి పొత్తూరి సురేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాకు ‘నిర్భయ’ సెంటర్ మంజూరు
ఇందూరు : దేశంలో రోజురోజుకు మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. ఎక్కడో ఒక చోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు ఉన్నా.. మరెందరికో శిక్షలు పడుతున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. అత్తారింట్లో, పని చేసే స్థలాల్లో మానసికంగా, శారీరకంగా హింసకు గురవుతూనే ఉన్నారు. బాధిత మహిళలకు తక్షణ వైద్య సహాయం, కౌన్సెలింగ్ అందడం లేదు. నిందితులకు శిక్షా పడడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. మహిళల రక్షణ కోసం, తక్షణ సాయం, న్యాయం అందించడం కోసం వన్ స్టాప్ క్రైసిస్ సెంటర్(నిర్భయ సెంటర్) ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. దేశంలో 660 ప్రాంతాల్లో ఇలాంటి కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా జిల్లాకు కూడా ‘నిర్భయ సెంటర్’ను మంజూరు చేసింది. దీనికి సంబంధించి లెటర్ నం: 1037 ద్వారా ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం జిల్లా ఐసీడీఎస్ కార్యాలయానికి ఈ నెల 13న పంపించింది. భవన నిర్మాణానికి రూ. 36 లక్షలను కేటాయించింది. ఈ కేంద్రం ఎందుకంటే.. సెంటర్లో డాక్టర్, నర్సు, లీగల్ కౌన్సెలర్, పోలీసు, న్యాయవాది, హెల్పర్ ఉంటారు. వేధింపులు, అత్యాచారానికి గురైన వెంటనే సమాచారం అందించేందుకు సెంటర్లో ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నంబర్‌ను త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. సంఘటన లేదా వేధింపులకు గురైనవారు ఆ నెంబర్‌కు ఫోన్ చేస్తే.. సంఘటనను బట్టి సంబంధిత ఉద్యోగులు ప్రత్యేక వాహనం ద్వారా లేదా అంబులెన్స్‌లో ఘటనా స్థలానికి చేరుకుంటారు. కుటుంబ సభ్యుల వేధింపుల కేసైతే ఇరువురికీ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల పై, లేదా భర్త, అత్త, మామలపై చర్యలు తప్పవన్న పరిస్థితుల్లో వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పని చేస్తున్న మహిళలు శారీరక, మానసిక వేధింపులకు గురైతే కూడా పై పద్ధతిన చర్యలు తీసుకుంటారు. అత్యాచారానికి గురైన వారికి తక్షణ వైద్య సహాయం అందిస్తారు. కేసులను ఉచితంగానే కోర్టులో వాదిస్తారు. పోలీసు స్టేషన్‌కు, కోర్టుకు బాధితురాలి వాంగ్మూలం వినేందుకు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని కల్పించనున్నారు. ఇటు బాధిత మహిళలకు తాత్కాలిక వసతిని కల్పిస్తారు. ఐదుగురు అధికారుల కమిటీకి కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. మొత్తం మీద బాధిత మహిళలకు తక్షణ సాయం, న్యాయం జరిగేలా ఈ ‘నిర్భయ సెంటర్’ పని చేస్తుంది. సెంటర్ ఏర్పాటుకు సన్నాహాలు జిల్లాకు నిర్భయ సెంటర్‌ను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం భవన నిర్మాణానికి రూ. 36 లక్ష లను కేటాయించింది. వీలైనంత త్వరగా భవనా న్ని నిర్మించి అందులో బాధిత మహిళలకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా తయారు చేయాలని ఐసీడీఎస్ అధికారులను కేంద్రం ఆదేశించింది. భవనం నిర్మించే వరకు తాత్కాలికంగా వేరే భవనాన్ని చూసుకోవాలని సూచించింది. ఈ నిర్భయ సెంటర్‌ను 300 చదరపు మీటర్లు గల స్థలంలో నిర్మించాలని, అది కూడా జిల్లా కేంద్రంలోనే ఉండాలని ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల్లో ఉంది. అయితే జిల్లా ఆస్పత్రి ఆవరణలో లేదా రెండు కిలోమీటర్ల సమీపంలో భవనాన్ని నిర్మించాలని అధికారులను ఆదేశించింది. జిల్లా కేంద్రంలో స్థలం వెతకడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
మహిళల భద్రతకు తొలిప్రాధాన్యం: నాయిని
బాధ్యతలు స్వీకరించిన హోంమంత్రి నాయిని సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళల భద్రతకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి తెలిపారు. మహిళలపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. గురువారం సచివాలయంలో హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సందర్భంగా పెట్టిన కేసులను ఎత్తి వేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అసెంబ్లీ మొదటి రోజున కేసుల ఎత్తివేతపై ఉత్తర్వులు వెలువడేలా అధికారులకు ఆదేశించినట్టు తెలిపారు. నేరరహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు. టైస్టుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు.