![Dastak, Nirbhaya Case Melodrama By Shilpi Marwaha - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/17/dd.jpg.webp?itok=5oq4XA8K)
దేశం కదిలిపోయింది. దేశం కన్నీరయ్యింది.
దేశం ఆగ్రహంతో ఊగిపోయింది.
పదేళ్ల క్రితం డిసెంబర్ 16, 2012న
ఢిల్లీలో జరిగిన ఘటన లక్షలాది స్త్రీలను, యువతులను,
బాలికలను రోడ్డు మీదకు వచ్చి నిరసన చేసేలా చేసింది.
కొత్త చట్టం ‘నిర్భయ’ పేరున వచ్చింది. అయితే అది సరిపోదు.
ఆ హైన్యమైన ఘటన పునరావృత్తం కాకూడదని
ఆ మహా చైతన్యం సజీవంగా ఉండాలని
థియేటర్ నటి శిల్పి మర్వాహ
గత పదేళ్లుగా నిర్భయ నాటకాన్ని ప్రదర్శిస్తోంది.
ఆమె ఆ నాటకాన్ని కొనసాగిస్తున్న తీరు,
నిర్భయగా నటిస్తున్నప్పుడు ఆమె పడే వేదన
తెలుసుకోదగ్గది. ఆ నాటకం ప్రతి చోటా వేయదగ్గది.
‘దస్తక్’ అంటే ‘తలుపు తట్టడం’ లేదా ‘తట్టి లేపడం’ లేదా ‘పిలుపునివ్వడం’. ఢిల్లీలో డిసెంబర్ 16, 2012 రాత్రి 9.30 నుంచి 11 గంటల మధ్య జరిగిన పాశవికమైన ‘నిర్భయ ఘటన’– చుట్టూ ఏం జరిగితే మనకెందుకు అని తలుపు మూసుకుని ఉన్న ఈ సమాజాన్ని, నిద్ర నటిస్తున్న ఈ సంఘాన్ని, బధిరత్వం నటిస్తున్న బండబారిన ఈ సమూహాన్ని తట్టి లేపింది. జాగృతపరిచింది. ఇప్పుడైనా కదలండి అని పిలుపును ఇచ్చింది.
‘నిర్భయ ఘటన ఈ దేశం నుంచి ఒక్కటే కోరింది–మారండి అని’ అని అంటుంది శిల్పి మార్వాహ. ఢిల్లీ నాటకరంగంలో చిరపరిచితమైన శిల్పి గత పదేళ్లుగా నిర్భయ ఘటన మీద ప్రదర్శిస్తున్న వీధి నాటకం పేరు– దస్తక్. ఢిల్లీ కమలా నెహ్రూ కాలేజ్‌లో చదువుకున్న శిల్పి ‘క్యాంపస్ థియేటర్’, ‘స్ట్రీట్ థియేటర్’లో అనేక ప్రయోగాలు చేసింది. 2011 ఢిల్లీ ‘యాంటి కరప్షన్ మూవ్‌మెంట్’లో చురుగ్గా పాల్గొని నాటకాలు వేసిన షిల్పి గుర్తింపు పొందింది. 2013 నుంచి ‘దస్తక్’ నాటకం ద్వారా తన సామాజిక బాధ్యతను గట్టిగా చాటుకుంటోంది.
ఘటనకు మూల కారణం... ‘నిర్భయ ఘటనకు మూలకారణం పితృస్వామ్యం. ఇంటి వాతావరణంలో మగవాడికి పెత్తనం ఇవ్వడం నుంచి ఇది మొదలవుతుంది. తాను అణగదొక్కగలిగేవాడిగా స్త్రీ అణగదొక్కబడేదిగా మగవాడు ఎప్పుడైతే తర్ఫీదు ఇవ్వబడతాడో అప్పుడు స్త్రీ మీద హింస చేయడానికి వెనుకాడడు’ అంటుంది శిల్పి. ‘నిర్భయ ఘటన జరిగిన రోజు బస్సులో డ్రైవర్‌తో సహా 6 మంది ఉన్నారు. వారు మొదట నిర్భయతో గొడవ మొదలెట్టింది– ఇంత రాత్రి నువ్వు ఎందుకు రోడ్ల మీద తిరుగుతున్నావ్ అని. అప్పుడు టైమ్ తొమ్మిదిన్నరే. ఏ ఒంటిగంటో కాదు. అయినా సరే స్త్రీని కంట్రోల్ చేసే స్వభావంతో ఆ ప్రశ్న వేశారు. అలా కంట్రోల్‌లో లేని స్త్రీని ఏమైనా చేయవచ్చని బరితెగించారు’ అంటుందామె.
ఇండియా గేట్‌లో మొదటి ప్రదర్శన... ‘నిర్భయ ఘటన తర్వాత ఊరికే ఉండలేకపోయాను. ఆ ముందు సంవత్సరమే ‘దస్తక్’ అనే నాటకాన్ని స్త్రీపై సాగే హింసకు వ్యతిరేకంగా ప్రదర్శించేదాన్ని. అందులో రేప్ సన్నివేశం దుర్మార్గంగా చూపేదాన్ని. ఆడవాళ్లు నా దగ్గరకు వచ్చి ‘మరీ అంత దుర్మార్గం ఉండదు. నువ్వు ఎక్కువ చేస్తున్నావ్’ అని అనేవారు. నిర్భయ ఘటన తర్వాత నేను మొత్తం నాటకాన్ని తిరగరాసి నిర్భయ మీద జరిగిన పాశవిక దాడిని నాటకంలో యధాతధంగా పెట్టాను. నిర్భయగా నేనే నటించాను.
ఇండియా గేట్‌లో మొదటిసారి ప్రదర్శిస్తున్నప్పుడు నా మెదడు మొద్దుబారింది. ఆ నాటకంలో నేను కోపంతో అరుస్తున్నప్పుడు అది నటనగా కాక జరిగిన దారుణానికి నిరసనగా సగటు మహిళలో పెల్లుబికే కోపంగా వ్యక్తమైంది. చుట్టూ ఉన్న జనం చాలా మౌనంగా నాటకం చూశారు. సాధారణంగా వీధి నాటకాలు గోలగా చూస్తారు ప్రేక్షకులు. ఈ నాటకం సమయంలో మాత్రం దారుణమైన నిశ్శబ్దం పాటించారు. వారిలో వచ్చిన గాంభీర్యానికి గుర్తు అది. ఆ ప్రదర్శన తర్వాత అత్యాచారాన్ని అంత పాశవికంగా చూపడం ఎందుకో స్త్రీలు అర్థం చేసుకున్నారు. ఆ తీవ్రతను చూపితే తప్ప మార్పు రాదని తెలుసుకున్నారు’ అంటుంది శిల్పి.
కొద్దిగానే మార్పు... ‘పదేళ్లుగా నిర్భయ నాటకాన్ని ప్రదర్శిస్తున్నాను. పదేళ్లుగా నిర్భయ వంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నేటికీ పెద్ద మార్పు లేదు. నిర్భయ నిందితుల్లో నలుగురికి ఉరిశిక్ష పడింది (ఒకరు విచారణ సమయంలో మరణించారు). జువెనైల్ చట్టంలో మార్పు వచ్చింది (ఒక నిందితుడు జువెనైల్ చట్టం నిర్థారించిన వయసు వల్ల విడుదల అయ్యాడు).
కాని ఇంకా దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజా నాటకం నిర్భయ ఘటనను మాత్రం వదల్లేదు. అనేక గ్రూప్‌లు ఈ నాటకాన్ని ఆడుతూనే ఉన్నాయి. రంగస్థలం మీదకు నిర్భయ శవాన్ని తీసుకొచ్చినప్పుడల్లా జనం ఏడుస్తారు. కాని ఏడుపు మాత్రమే చాలదు. మార్పు రావాలి. ఇన్ని సంవత్సరాలుగా ఈ నాటకాన్ని వేయాలా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. కాని మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు అని కూడా అనిపిస్తుంది. అందుకే నాటకం కొనసాగిస్తున్నాను. నిర్భయను మరువనివ్వను. నిర్భయ వల్ల వచ్చిన చైతన్యం కొనసాగాలి’ అంటుంది శిల్పి.
Comments
Please login to add a commentAdd a comment