delhi incidents
-
షాకింగ్.. ఢిల్లీ ఘటన అంజలి ఇంట్లో చోరీ.. ఫ్రెండ్ నిధిపైనే అనుమానం!
న్యూఢిల్లీ: ఢిల్లీలో జనవరి 1న అంజలి అనే యువతిని కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటనలో ఆమె మరణించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అమన్ విహార్‌లోని ఆమె ఇంట్లో దొంగతనం జరిగింది. కొందరు దుండగులు తాళం పగలగొట్టి ఇంట్లోని విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. మరొకొన్నింటిని ధ్వంసం చేశారు. సోమవారం ఉదయం 7:30గంటల సమయంలో అంజలి తల్లిదండ్రులకు పొరుగింటివారు ఈ విషయాన్ని తెలియజేశారు. ఇంట్లో టీవితో పాటు ఇతర విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారని అంజలి కుటుంబసభ్యులు తెలిపారు. ఈ చోరీలో అంజలి స్నేహితురాలు నిధి హస్తం ఉండి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. వారం రోజులుగా ఇంటివద్ద భద్రతగా ఉన్న పోలీసులు దొంగతనం జరిగిన రోజు ఎందుకు లేరని ప్రశ్నించారు. అయితే పోలీసులు ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించాల్సి ఉంది. జనవరి 1న అంజలి, ఆమె స్నేహితురాలు నిధి స్కూటీపై వెళ్తుండగా మద్యం సేవించిన యువకులు కారుతో ఢీకొట్టారు. అంజలి కారు చక్రాల కింద ఇరుక్కున్నా పట్టించుకోకుండా వాహనాన్ని 12 కిలోమీటర్లు తిప్పారు. దీంతో ఆమె దారుణంగా చనిపోయింది. న్యూ ఇయర్ రోజున అంజలి మృతదేహం రోడ్డుపై నగ్నంగా లభ్యమవ్వడం కలకలం రేపింది. అయితే అంజలి కారు కింద పడిపోయినప్పుడు నిధి ఆమె పక్కనే ఉంది. కానీ ఎలాంటి సాయం చేసేందుకు ప్రయత్నించకుండా అక్కడి నుంచి పారిపోయింది. దీంతో ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చదవండి: అది అత్యాచారం కిందకు రాదు.. ఒరిస్సా హైకోర్టు కీలక తీర్పు.. -
దస్తక్.. స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా ప్రదర్శించబడుతున్న నాటకం
దేశం కదిలిపోయింది. దేశం కన్నీరయ్యింది. దేశం ఆగ్రహంతో ఊగిపోయింది. పదేళ్ల క్రితం డిసెంబర్ 16, 2012న ఢిల్లీలో జరిగిన ఘటన లక్షలాది స్త్రీలను, యువతులను, బాలికలను రోడ్డు మీదకు వచ్చి నిరసన చేసేలా చేసింది. కొత్త చట్టం ‘నిర్భయ’ పేరున వచ్చింది. అయితే అది సరిపోదు. ఆ హైన్యమైన ఘటన పునరావృత్తం కాకూడదని ఆ మహా చైతన్యం సజీవంగా ఉండాలని థియేటర్ నటి శిల్పి మర్వాహ గత పదేళ్లుగా నిర్భయ నాటకాన్ని ప్రదర్శిస్తోంది. ఆమె ఆ నాటకాన్ని కొనసాగిస్తున్న తీరు, నిర్భయగా నటిస్తున్నప్పుడు ఆమె పడే వేదన తెలుసుకోదగ్గది. ఆ నాటకం ప్రతి చోటా వేయదగ్గది. ‘దస్తక్’ అంటే ‘తలుపు తట్టడం’ లేదా ‘తట్టి లేపడం’ లేదా ‘పిలుపునివ్వడం’. ఢిల్లీలో డిసెంబర్ 16, 2012 రాత్రి 9.30 నుంచి 11 గంటల మధ్య జరిగిన పాశవికమైన ‘నిర్భయ ఘటన’– చుట్టూ ఏం జరిగితే మనకెందుకు అని తలుపు మూసుకుని ఉన్న ఈ సమాజాన్ని, నిద్ర నటిస్తున్న ఈ సంఘాన్ని, బధిరత్వం నటిస్తున్న బండబారిన ఈ సమూహాన్ని తట్టి లేపింది. జాగృతపరిచింది. ఇప్పుడైనా కదలండి అని పిలుపును ఇచ్చింది. ‘నిర్భయ ఘటన ఈ దేశం నుంచి ఒక్కటే కోరింది–మారండి అని’ అని అంటుంది శిల్పి మార్వాహ. ఢిల్లీ నాటకరంగంలో చిరపరిచితమైన శిల్పి గత పదేళ్లుగా నిర్భయ ఘటన మీద ప్రదర్శిస్తున్న వీధి నాటకం పేరు– దస్తక్. ఢిల్లీ కమలా నెహ్రూ కాలేజ్‌లో చదువుకున్న శిల్పి ‘క్యాంపస్ థియేటర్’, ‘స్ట్రీట్ థియేటర్’లో అనేక ప్రయోగాలు చేసింది. 2011 ఢిల్లీ ‘యాంటి కరప్షన్ మూవ్మెంట్’లో చురుగ్గా పాల్గొని నాటకాలు వేసిన షిల్పి గుర్తింపు పొందింది. 2013 నుంచి ‘దస్తక్’ నాటకం ద్వారా తన సామాజిక బాధ్యతను గట్టిగా చాటుకుంటోంది. ఘటనకు మూల కారణం... ‘నిర్భయ ఘటనకు మూలకారణం పితృస్వామ్యం. ఇంటి వాతావరణంలో మగవాడికి పెత్తనం ఇవ్వడం నుంచి ఇది మొదలవుతుంది. తాను అణగదొక్కగలిగేవాడిగా స్త్రీ అణగదొక్కబడేదిగా మగవాడు ఎప్పుడైతే తర్ఫీదు ఇవ్వబడతాడో అప్పుడు స్త్రీ మీద హింస చేయడానికి వెనుకాడడు’ అంటుంది శిల్పి. ‘నిర్భయ ఘటన జరిగిన రోజు బస్సులో డ్రైవర్‌తో సహా 6 మంది ఉన్నారు. వారు మొదట నిర్భయతో గొడవ మొదలెట్టింది– ఇంత రాత్రి నువ్వు ఎందుకు రోడ్ల మీద తిరుగుతున్నావ్ అని. అప్పుడు టైమ్ తొమ్మిదిన్నరే. ఏ ఒంటిగంటో కాదు. అయినా సరే స్త్రీని కంట్రోల్ చేసే స్వభావంతో ఆ ప్రశ్న వేశారు. అలా కంట్రోల్లో లేని స్త్రీని ఏమైనా చేయవచ్చని బరితెగించారు’ అంటుందామె. ఇండియా గేట్లో మొదటి ప్రదర్శన... ‘నిర్భయ ఘటన తర్వాత ఊరికే ఉండలేకపోయాను. ఆ ముందు సంవత్సరమే ‘దస్తక్’ అనే నాటకాన్ని స్త్రీపై సాగే హింసకు వ్యతిరేకంగా ప్రదర్శించేదాన్ని. అందులో రేప్ సన్నివేశం దుర్మార్గంగా చూపేదాన్ని. ఆడవాళ్లు నా దగ్గరకు వచ్చి ‘మరీ అంత దుర్మార్గం ఉండదు. నువ్వు ఎక్కువ చేస్తున్నావ్’ అని అనేవారు. నిర్భయ ఘటన తర్వాత నేను మొత్తం నాటకాన్ని తిరగరాసి నిర్భయ మీద జరిగిన పాశవిక దాడిని నాటకంలో యధాతధంగా పెట్టాను. నిర్భయగా నేనే నటించాను. ఇండియా గేట్లో మొదటిసారి ప్రదర్శిస్తున్నప్పుడు నా మెదడు మొద్దుబారింది. ఆ నాటకంలో నేను కోపంతో అరుస్తున్నప్పుడు అది నటనగా కాక జరిగిన దారుణానికి నిరసనగా సగటు మహిళలో పెల్లుబికే కోపంగా వ్యక్తమైంది. చుట్టూ ఉన్న జనం చాలా మౌనంగా నాటకం చూశారు. సాధారణంగా వీధి నాటకాలు గోలగా చూస్తారు ప్రేక్షకులు. ఈ నాటకం సమయంలో మాత్రం దారుణమైన నిశ్శబ్దం పాటించారు. వారిలో వచ్చిన గాంభీర్యానికి గుర్తు అది. ఆ ప్రదర్శన తర్వాత అత్యాచారాన్ని అంత పాశవికంగా చూపడం ఎందుకో స్త్రీలు అర్థం చేసుకున్నారు. ఆ తీవ్రతను చూపితే తప్ప మార్పు రాదని తెలుసుకున్నారు’ అంటుంది శిల్పి. కొద్దిగానే మార్పు... ‘పదేళ్లుగా నిర్భయ నాటకాన్ని ప్రదర్శిస్తున్నాను. పదేళ్లుగా నిర్భయ వంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నేటికీ పెద్ద మార్పు లేదు. నిర్భయ నిందితుల్లో నలుగురికి ఉరిశిక్ష పడింది (ఒకరు విచారణ సమయంలో మరణించారు). జువెనైల్ చట్టంలో మార్పు వచ్చింది (ఒక నిందితుడు జువెనైల్ చట్టం నిర్థారించిన వయసు వల్ల విడుదల అయ్యాడు). కాని ఇంకా దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజా నాటకం నిర్భయ ఘటనను మాత్రం వదల్లేదు. అనేక గ్రూప్‌లు ఈ నాటకాన్ని ఆడుతూనే ఉన్నాయి. రంగస్థలం మీదకు నిర్భయ శవాన్ని తీసుకొచ్చినప్పుడల్లా జనం ఏడుస్తారు. కాని ఏడుపు మాత్రమే చాలదు. మార్పు రావాలి. ఇన్ని సంవత్సరాలుగా ఈ నాటకాన్ని వేయాలా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. కాని మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు అని కూడా అనిపిస్తుంది. అందుకే నాటకం కొనసాగిస్తున్నాను. నిర్భయను మరువనివ్వను. నిర్భయ వల్ల వచ్చిన చైతన్యం కొనసాగాలి’ అంటుంది శిల్పి. -
దేశ రాజధానిలో దారుణం!
సంపాదకీయం దేశ రాజధాని నగరంగా ఉంటున్న న్యూఢిల్లీలో ఈశాన్యవాసుల స్థితి ఇంకా దిన దిన గండంగానే ఉంటున్నదని మరోసారి రుజువైంది. అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన 19 ఏళ్ల విద్యార్థి నిడో తానియంను ఒక చిన్న ఘర్షణలో కొట్టి చంపిన తీరు అందరినీ కలచివేస్తుంది. ఒక్క ఢిల్లీ అనే కాదు... చదువుకనో, వివిధ వృత్తుల్లో చేరి జీవితంలో స్థిరపడదామని ఆశించో వేర్వేరు నగరాలకు ఈశాన్య ప్రాంతం నుంచి వస్తున్న ఇతర పౌరులు కూడా కొంత హెచ్చుతగ్గులతో ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అకారణంగా గేలిచేయడానికి, దుర్వ్యాఖ్యలు చేసి మనసు కష్టపెట్టడానికి ఈశాన్యవాసులను లక్ష్యంగా చేసుకుంటున్న ఘటనలు తరచు చోటు చేసుకుంటున్నాయి. ఆడవాళ్లకయితే వీటితో పాటు లైంగిక హింస అదనం. గంభీరంగా, ప్రశాంతంగా, భద్రతా బలగాల పహరాతో అడుగడుగునా రాజ్యం అడుగుజాడలు కనబడే ఢిల్లీలో ఈశాన్యేతరులకు ఇదంతా కనబడని హింస. ఖండాంతరాల్లో భారతీయులను వేధించారని, దాడులు చేశారని విని తల్లడిల్లేవారంతా తమ ముందే తమ తోటి పౌరులకు జరుగుతున్న ఇలాంటి అన్యాయాలను సరిదిద్దలేకపోతున్నారు. తామూ ఈ దేశ పౌరులమేనని, తమకూ ఈ దేశ నిర్మాణంలో భాగం కల్పించాలని కోరుకుంటున్న ఈశాన్యవాసులను అనుమానపు దృక్కులే వెన్నాడుతున్నాయి. చిత్రమేమంటే, దేశంలోని ఇతర ప్రాంతాల పౌరులు పేదరికాన్ని ఎదుర్కోవడానికి ఏదో పని చేద్దామని వస్తుంటే... ఈశాన్యం నుంచి వచ్చే వారిలో చాలా మంది మధ్యతరగతికి చెందినవారు. వీరు ఉన్నత చదువులకో, తాము చేస్తున్న వృత్తుల్లో మరింత రాణించడానికో, ఉద్యోగాల్లో మరిన్ని అవకాశాలను అందుకోవడానికో వస్తారు. అయిదేళ్లక్రితం మిజోరం ముఖ్యమంత్రి లాల్ తన్వాలా సింగపూర్‌లో జరిగిన ఒక సెమినార్లో స్వదేశంలో తాను అనేకసార్లు జాతి వివక్ష ఎదుర్కొనవలసివచ్చిందని చెప్పి ఆశ్చర్య పరిచారు. ‘దేశంలో ఏదైనా ప్రాంతానికి వెళ్తే మీరు నేపాలీలా, చైనీయులా అని అడుగు తార’ని వాపోయారు. హోటళ్లలోనూ, విమానాశ్రయాల్లోనూ తమను పాస్‌పోర్టులు చూపమంటారని అన్నారు. స్వేచ్ఛాయుత సమాజంలో నివసిస్తున్నామని... ఎవరైనా, ఎక్కడికైనా వెళ్లి ఉండొచ్చని, గౌరవ ప్రదమైన ఎలాంటి పని అయినా చేసుకోవచ్చునని మనం అనుకుంటున్నదంతా బూటకమేనని ఇలాంటి ఉదంతాలు చాటి చెబుతాయి. చాన్నాళ్లక్రితం ఈశాన్య ప్రాంత పౌరుల సహాయ కేంద్రం ఢిల్లీ, పుణే, బెంగళూరువంటి నగరాల్లో సర్వేచేసి ఈశాన్య ప్రాంత పౌరులు ఎదుర్కొంటున్న వివక్ష గురించి సవివరమైన నివేదిక ఇచ్చింది. ఆ సంస్థ మాట్లాడినవారిలో 78.75 శాతం మంది తాము జాతిపరమైన వివక్షను ఎదుర్కొన్నామని చెప్పారు. ఢిల్లీలో అత్యంత దారుణమైన వివక్ష ఎదుర్కొంటుండగా, ముంబైలో తమ స్థితి మెరుగ్గా ఉంటుందని పలువురు ఈశాన్య పౌరులు చెబుతున్నారు. జాతీయ మహిళా కమిషన్ వివిధ ప్రాంతాల్లో చేసిన అధ్యయనంలో ఈశాన్యప్రాంత యువతుల్లో 60 శాతం మంది నిత్యమూ లైంగిక నేరాలకు లోనవుతున్నారని తేలింది. వీరంతా ఉన్నత చదువుల కోసం, చేస్తున్న ఉద్యోగాల్లో మంచి అవకాశాల కోసం వేర్వేరు నగరాలకు వలస వస్తున్నవారే. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండదని, పైగా అదనపు వేధింపులుంటాయని ఈ యువతులు చెబుతున్నారు. ఈశాన్య ప్రాంత పౌరులపై అలుముకుని ఉన్న దురభిప్రాయాలు చాలా భయంకరమైనవి. వారు నేరస్వభావం, దురలవాట్లు దండిగా ఉన్నవారని, నైతిక విలువలు లేనివారని భావించేవారున్నారు. అందువల్లే చాలా నగరాల్లో వారికి అద్దెకు ఇళ్లు లభించడం గగనం. ఇచ్చినచోట కూడా తమను నిత్యం అనుమానపు చూపులు వెంటాడుతుంటాయన్నది వారి ఫిర్యాదు. శతాబ్దాలుగా తమతో సహజీవనం చేస్తున్నవారినే కులం పేరిట, మతం పేరిట వేరుగా చూడటం అలవాటైపోయిన వారికి ఈశాన్య ప్రాంత పౌరులు ఎదుర్కొం టున్న ఇలాంటి వివక్ష అర్ధం కావడం అంత సులభం కాదు. రెండేళ్లక్రితం చెలరేగిన వదంతులను విశ్వసించి వివిధ రాష్ట్రాల నుంచి ఈశాన్యవాసులు పెద్ద సంఖ్యలో స్వస్థలాలకు తరలిపోయారు. మీ ప్రాణాలకొచ్చిన భయమేమీ లేదని ఎంతగానో భరోసా ఇచ్చాకగానీ పరిస్థితి చక్కబడలేదు. ఈలోగా వారంరోజులు గడిచిపోయాయి. ఏదైనా ఘటన జరిగినప్పుడు హుటాహుటీన రంగంలోకి దిగి, ఏవో కంటి తుడుపు చర్యలు తీసుకోవడం తప్ప సమస్యను లోతుగా సమీక్షించడం ప్రభుత్వాలకు చేతగావటం లేదు. అందువల్లే ఈశాన్య పౌరులపై పదే పదే అవే తరహా దౌర్జన్యాలు, హింస చోటుచేసుకుంటున్నాయి. ఢిల్లీ పోలీసు విభాగంలో ప్రత్యేకించి ఈశాన్య ప్రాంత విభాగం ఉన్నది. దానికి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి నేతృత్వం వహిస్తున్నారు. కానీ ప్రయో జనం శూన్యం. ఇప్పుడు జరిగిన ఢిల్లీ ఘటనలో మిఠాయి దుకాణంలోని వారు నిడోపై దాడిచేస్తే కేసులు పెట్టి చర్య తీసుకోవాల్సిన పోలీసులు సర్దిచెప్పి పంపేశారు. తీరా ఆ యువకుడు మర్నాటికల్లా మరణించాడు. నిడో మరణించి ఉండకపోతే... ఈశాన్య ప్రాంత పౌరులపై జరిగే అన్ని దౌర్జన్యం కేసుల్లాగే ఇది కూడా మరుగునపడిపోయేది. రిపబ్లిక్ డే, స్వాతంత్య్ర దినోత్సవం వంటి సందర్భాల్లో దేశ సమైక్యత, సమగ్రతల గురించి మాట్లాడే మన నేతలు... వాస్తవస్థితి ఎలా ఉన్నదో గుర్తించిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా మించిపోయింది లేదు... సామాజిక శాస్త్రవేత్తలతో, పౌరసమాజం ప్రతినిధులతో ఈ సమస్యపై అధ్యయనం చేయించి, అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఈశాన్య ప్రాంత వాసులను కూడా తమలో ఒకరిగా భావించే సంస్కారాన్ని, చైతన్యాన్ని పెంచడానికి కృషిచేయాలి.