సంపాదకీయం
దేశ రాజధాని నగరంగా ఉంటున్న న్యూఢిల్లీలో ఈశాన్యవాసుల స్థితి ఇంకా దిన దిన గండంగానే ఉంటున్నదని మరోసారి రుజువైంది. అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన 19 ఏళ్ల విద్యార్థి నిడో తానియంను ఒక చిన్న ఘర్షణలో కొట్టి చంపిన తీరు అందరినీ కలచివేస్తుంది. ఒక్క ఢిల్లీ అనే కాదు... చదువుకనో, వివిధ వృత్తుల్లో చేరి జీవితంలో స్థిరపడదామని ఆశించో వేర్వేరు నగరాలకు ఈశాన్య ప్రాంతం నుంచి వస్తున్న ఇతర పౌరులు కూడా కొంత హెచ్చుతగ్గులతో ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అకారణంగా గేలిచేయడానికి, దుర్వ్యాఖ్యలు చేసి మనసు కష్టపెట్టడానికి ఈశాన్యవాసులను లక్ష్యంగా చేసుకుంటున్న ఘటనలు తరచు చోటు చేసుకుంటున్నాయి. ఆడవాళ్లకయితే వీటితో పాటు లైంగిక హింస అదనం. గంభీరంగా, ప్రశాంతంగా, భద్రతా బలగాల పహరాతో అడుగడుగునా రాజ్యం అడుగుజాడలు కనబడే ఢిల్లీలో ఈశాన్యేతరులకు ఇదంతా కనబడని హింస. ఖండాంతరాల్లో భారతీయులను వేధించారని, దాడులు చేశారని విని తల్లడిల్లేవారంతా తమ ముందే తమ తోటి పౌరులకు జరుగుతున్న ఇలాంటి అన్యాయాలను సరిదిద్దలేకపోతున్నారు. తామూ ఈ దేశ పౌరులమేనని, తమకూ ఈ దేశ నిర్మాణంలో భాగం కల్పించాలని కోరుకుంటున్న ఈశాన్యవాసులను అనుమానపు దృక్కులే వెన్నాడుతున్నాయి.
చిత్రమేమంటే, దేశంలోని ఇతర ప్రాంతాల పౌరులు పేదరికాన్ని ఎదుర్కోవడానికి ఏదో పని చేద్దామని వస్తుంటే... ఈశాన్యం నుంచి వచ్చే వారిలో చాలా మంది మధ్యతరగతికి చెందినవారు. వీరు ఉన్నత చదువులకో, తాము చేస్తున్న వృత్తుల్లో మరింత రాణించడానికో, ఉద్యోగాల్లో మరిన్ని అవకాశాలను అందుకోవడానికో వస్తారు. అయిదేళ్లక్రితం మిజోరం ముఖ్యమంత్రి లాల్ తన్‌వాలా సింగపూర్‌లో జరిగిన ఒక సెమినార్‌లో స్వదేశంలో తాను అనేకసార్లు జాతి వివక్ష ఎదుర్కొనవలసివచ్చిందని చెప్పి ఆశ్చర్య పరిచారు. ‘దేశంలో ఏదైనా ప్రాంతానికి వెళ్తే మీరు నేపాలీలా, చైనీయులా అని అడుగు తార’ని వాపోయారు. హోటళ్లలోనూ, విమానాశ్రయాల్లోనూ తమను పాస్‌పోర్టులు చూపమంటారని అన్నారు.
స్వేచ్ఛాయుత సమాజంలో నివసిస్తున్నామని... ఎవరైనా, ఎక్కడికైనా వెళ్లి ఉండొచ్చని, గౌరవ ప్రదమైన ఎలాంటి పని అయినా చేసుకోవచ్చునని మనం అనుకుంటున్నదంతా బూటకమేనని ఇలాంటి ఉదంతాలు చాటి చెబుతాయి.
చాన్నాళ్లక్రితం ఈశాన్య ప్రాంత పౌరుల సహాయ కేంద్రం ఢిల్లీ, పుణే, బెంగళూరువంటి నగరాల్లో సర్వేచేసి ఈశాన్య ప్రాంత పౌరులు ఎదుర్కొంటున్న వివక్ష గురించి సవివరమైన నివేదిక ఇచ్చింది. ఆ సంస్థ మాట్లాడినవారిలో 78.75 శాతం మంది తాము జాతిపరమైన వివక్షను ఎదుర్కొన్నామని చెప్పారు. ఢిల్లీలో అత్యంత దారుణమైన వివక్ష ఎదుర్కొంటుండగా, ముంబైలో తమ స్థితి మెరుగ్గా ఉంటుందని పలువురు ఈశాన్య పౌరులు చెబుతున్నారు. జాతీయ మహిళా కమిషన్ వివిధ ప్రాంతాల్లో చేసిన అధ్యయనంలో ఈశాన్యప్రాంత యువతుల్లో 60 శాతం మంది నిత్యమూ లైంగిక నేరాలకు లోనవుతున్నారని తేలింది. వీరంతా ఉన్నత చదువుల కోసం, చేస్తున్న ఉద్యోగాల్లో మంచి అవకాశాల కోసం వేర్వేరు నగరాలకు వలస వస్తున్నవారే. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండదని, పైగా అదనపు వేధింపులుంటాయని ఈ యువతులు చెబుతున్నారు.
ఈశాన్య ప్రాంత పౌరులపై అలుముకుని ఉన్న దురభిప్రాయాలు చాలా భయంకరమైనవి. వారు నేరస్వభావం, దురలవాట్లు దండిగా ఉన్నవారని, నైతిక విలువలు లేనివారని భావించేవారున్నారు. అందువల్లే చాలా నగరాల్లో వారికి అద్దెకు ఇళ్లు లభించడం గగనం. ఇచ్చినచోట కూడా తమను నిత్యం అనుమానపు చూపులు వెంటాడుతుంటాయన్నది వారి ఫిర్యాదు. శతాబ్దాలుగా తమతో సహజీవనం చేస్తున్నవారినే కులం పేరిట, మతం పేరిట వేరుగా చూడటం అలవాటైపోయిన వారికి ఈశాన్య ప్రాంత పౌరులు ఎదుర్కొం టున్న ఇలాంటి వివక్ష అర్ధం కావడం అంత సులభం కాదు.
రెండేళ్లక్రితం చెలరేగిన వదంతులను విశ్వసించి వివిధ రాష్ట్రాల నుంచి ఈశాన్యవాసులు పెద్ద సంఖ్యలో స్వస్థలాలకు తరలిపోయారు. మీ ప్రాణాలకొచ్చిన భయమేమీ లేదని ఎంతగానో భరోసా ఇచ్చాకగానీ పరిస్థితి చక్కబడలేదు. ఈలోగా వారంరోజులు గడిచిపోయాయి. ఏదైనా ఘటన జరిగినప్పుడు హుటాహుటీన రంగంలోకి దిగి, ఏవో కంటి తుడుపు చర్యలు తీసుకోవడం తప్ప సమస్యను లోతుగా సమీక్షించడం ప్రభుత్వాలకు చేతగావటం లేదు. అందువల్లే ఈశాన్య పౌరులపై పదే పదే అవే తరహా దౌర్జన్యాలు, హింస చోటుచేసుకుంటున్నాయి.
ఢిల్లీ పోలీసు విభాగంలో ప్రత్యేకించి ఈశాన్య ప్రాంత విభాగం ఉన్నది. దానికి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి నేతృత్వం వహిస్తున్నారు. కానీ ప్రయో జనం శూన్యం. ఇప్పుడు జరిగిన ఢిల్లీ ఘటనలో మిఠాయి దుకాణంలోని వారు నిడోపై దాడిచేస్తే కేసులు పెట్టి చర్య తీసుకోవాల్సిన పోలీసులు సర్దిచెప్పి పంపేశారు. తీరా ఆ యువకుడు మర్నాటికల్లా మరణించాడు. నిడో మరణించి ఉండకపోతే... ఈశాన్య ప్రాంత పౌరులపై జరిగే అన్ని దౌర్జన్యం కేసుల్లాగే ఇది కూడా మరుగునపడిపోయేది. రిపబ్లిక్ డే, స్వాతంత్య్ర దినోత్సవం వంటి సందర్భాల్లో దేశ సమైక్యత, సమగ్రతల గురించి మాట్లాడే మన నేతలు... వాస్తవస్థితి ఎలా ఉన్నదో గుర్తించిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా మించిపోయింది లేదు... సామాజిక శాస్త్రవేత్తలతో, పౌరసమాజం ప్రతినిధులతో ఈ సమస్యపై అధ్యయనం చేయించి, అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఈశాన్య ప్రాంత వాసులను కూడా తమలో ఒకరిగా భావించే సంస్కారాన్ని, చైతన్యాన్ని పెంచడానికి కృషిచేయాలి.