మహిళలపై దాడులను అడ్డుకోలేమా?
లైంగిక దాడులను జాతీయ సమస్యగా చూడాలి
సీపీఎం జాతీయ నేత బృందాకారత్
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: సమాజంలో మహిళలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయని సీపీఎం జాతీయ కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై జరిగే లైంగిక దాడులను జాతీయ సమస్యగా చూడాలన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ‘స్త్రీ స్వేచ్ఛ-ఆటంకాలు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆమె ప్రసంగించారు. దళిత మహిళపై లైంగిక దాడి జరిగితే ఏ ఒక్కరూ స్పందించకపోవటం విచారకరమన్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో మతోన్మాదం పెరిగిపోయిందని ఆరోపించారు. జాతీయ సంపద, సహజ వనరులను దోచుకునే విధంగా రాజకీయ వ్యవస్థ తయారైందన్నారు.
హిందూత్వ మతతత్వ శక్తులు మహిళల సాధికారతను అడ్డుకుంటున్నాయని, ఇది దేశాభివృద్ధికి ఆటంకమని తెలిపారు. ముగ్గురు ఉన్న కుటుంబంలో ఒక్కరికే పెన్షన్ ఇవ్వాలనే విధానం లింగవివక్షతకు దారితీసి చివరకు విడాకులు తీసుకునే పరిస్థితి వస్తుందని, ఇదేనా ప్రభుత్వ విధానమని ఆమె ప్రశ్నించారు. కొత్త రాష్ట్రంలో మహిళల పట్ల ఎలాంటి వివక్ష లేకుండా చూడాలని ఆమె కోరారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి.జ్యోతి అధ్యక్షతన జరిగిన సదస్సులో ప్రొఫెసర్ వి.పద్మజ, భూమిక ఎడిటర్ కొండవీటి సత్యవతి, ప్రముఖ రచయిత్రి శిలాలోలిత, ఐద్వా రాష్ర్ట కార్యదర్శి హైమావతి, ఐలు నగర కార్యదర్శి పొత్తూరి సురేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.