
సాక్షి, హైదరాబాద్ : మహిళలు, బాలికలపై దాడులకు నిరసనగా శనివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ అంతటా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించబోతున్నట్టు ఆ పార్టీ సీనియర్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 13 జిల్లాల్లో రేపు సాయంత్రం 6.30 గంటలకు కొవ్వొత్తుల ర్యాలీ చేపడతామని వివరించారు.
ఈ నెల 14న వైఎస్ జగన్ పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుందని చెప్పారు. ఏలూరు వద్ద వైఎస్ జగన్ పాదయాత్ర 2,000 కిలోమీటర్ల మైలురాయిని దాటుతుందని చెప్పారు. చంద్రబాబు మోసాలను ఎండగడుతూ ఈ నెల 14, 15 తేదీల్లో నల్లజెండాలతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, శ్రేణులు పాదయాత్రలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ నెల 16న కలెక్టరేట్ల వద్ద వంచనపై గర్జన పేరుతో ధర్నాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ధర్నాల అనంతరం సమస్యలపై కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పిస్తామని చెప్పారు.
బీజేపీతో ముఖ్యమంత్రి చంద్రబాబు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. మహారాష్ట్రకు చెందిన బీజేపీ మంత్రి భార్యకు టీటీడీ బోర్డులో స్థానం కల్పించడంలో చంద్రబాబు ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. నాలుగేళ్ల చంద్రబాబు పరిపాలనలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ వచ్చిన దాఖలాలు లేవని అన్నారు. పరిశ్రమల పేరిట లక్షలమందికి ఉద్యోగాలు వస్తున్నాయంటూ చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అవినీతి తాండవం అడుతోందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అన్ని వ్యవస్థలనూ సీఎం చంద్రబాబు అవినీతిమయం చేశారని ఆయన విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment