సాక్షి, అమరావతి : ఏపీలో జరుగుతున్న వరుస దారుణాలు మహిళాలోకాన్ని కలవర పెడుతున్నాయి. దాచేపల్లి దారుణం తర్వాత రోజుకో ప్రాంతంలో అత్యాచారాలు జరుగుతున్నాయి. నేరస్తులు ఏమాత్రం చట్టాలకు భయపడటం లేదు. తూర్పుగోదావరి జిల్లాలో సాక్షాత్తూ అధికార టీడీపీ నేతలే యువతిపై అత్యాచారానికి ప్రయత్నించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్నారిపై లైంగిక దాడి జరిగింది. వైఎస్‌ఆర్ జిల్లా బద్వేలులో యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. తిరుపతి రుయా ఆస్పత్రిలో వైద్య విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. వరుస ఘటనలు.. పోలీసు యంత్రాంగం నిర్లిప్తత... ప్రభుత్వ ఉదాసీనత నేరస్తులకు ఆసరాగా మారుతోంది.
బద్వేలులో 17 ఏళ్ల యువతిపై..
వైఎస్సార్ జిల్లా బద్వేలులో 17 ఏళ్ల యువతిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసిన ఘటనలు జనాన్ని భయాందోళనకు గురిచేసింది. బద్వేలు సుందరయ్య కాలనీకి చెందిన 17 ఏళ్ల యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. యువతిని చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. అత్యాచారానికి పాల్పడిన నిందితుల్ని రమేష్, కృష్ణగా గుర్తించారు. పరారీలో ఉన్న ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తిరుపతి రుయాలో..
తిరుపతి రుయాలో వైద్యులు లైంగికి వేధింపులకు గురిచేస్తున్నారని పీడియాట్రిక్ విభాగంలో పీజీ పైనల్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని గవర్నర్‌కు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన గవర్నర్ విచారణ జరిపించాలని హెల్త్ వర్సిటీకి ఆదేశించారు. ఈ మేరకు తిరుపతి రుయాలో రెండు రోజులుగా అధికారులు అంతర్గత విచారణ జరిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న చిన్నపిల్లల విభాగం ఇన్‌చార్జ్ ప్రొఫెసర్ రవికుమార్, ప్రొఫెసర్ శశికుమార్, ప్రొఫెసర్ కిరీటీలను విచారించారు. బాధితురాలు ఫిర్యాదుపై తాము విచారణ జరిపామని ఎస్వీ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రమణయ్య ‘సాక్షి టీవీ’కి వెల్లడించారు. నివేదికను ఆదివారంలోగా హెల్త్ వర్సిటీ వీసీకి పంపుతామని రమణయ్య తెలిపారు.
సాక్షాత్తూ అధికార టీడీపీ నేతలే..
చంద్రబాబు నాయుడు పాలనలో మహిళలకు ఏ స్థాయి భద్రత ఉందో రుజువు చేసే మరో ఘటన తూర్పు గోదావరిలో జరిగింది. తెలుగు దేశం పార్టీ నాయకుడు, అతని అనుచరులు ముగ్గురు ఓ బాలికపై అత్యాచారయత్నం చేసేందుకు ప్రయత్నించడం సంచలనం రేపింది. అయితే స్థానికులు తిరగబడటంతో ఆ నలుగురూ ఘటనాస్థలం నుంచి పలాయనం చిత్తగించారు. ఈ సంఘటన బుధవారం అర్ధరాత్రి తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం తమ్మయ్యపేట గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కత్తిపూడికి చెందిన టీడీపీ ఎంపీటీసీ కంచిబోయిన సంధ్య భర్త శ్రీనివాస్, ఆయన అనుచరులు శ్రావణ్, రవి, సత్యనారాయణ బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో అన్నవరం నుంచి కత్తిపూడి వెళ్తూ తమ్మయ్యపేట వద్ద ఉన్న టీ దుకాణం వద్ద ఆగారు. టీ కావాలంటూ డిమాండ్ చేశారు.
ఆ దుకాణాన్ని ఓ మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలసి నిర్వహిస్తోంది. ఇంతరాత్రి టీ ఏంటని ఆమె ప్రశ్నించడంతో.. మాకే అడ్డు చెబుతావా అంటూ అక్కడే ఉన్న ఆమె 17 ఏళ్ల పెద్ద కుమార్తె చేయిపట్టుకుని పక్కనే ఉన్న తోటలోకి శ్రీనివాస్, అతని ముగ్గురు అనుచరులు లాక్కుని పోవడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో తల్లితోపాటు ఆమె చిన్న కుమార్తె గట్టిగా అరవడంతో స్థానికులు పరుగున వచ్చి వారిని అడ్డుకున్నారు. అయినా వారిపై దుర్భాషలాడుతూ.. ‘ప్రభుత్వం మాది ఏమి చేసినా చెల్లుబాటవుతుంది’ అంటూ వాదనకు దిగారు. అయినా స్థానికులు ధైర్యంగా ఎదురునివడంతో వారు అక్కడినుంచి పారిపోయారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కంచిబోయిన శ్రీనివాస్, పసుపులేటి సత్యనారాయణ, మట్టా రవికుమార్‌లను అరెస్ట్ చేశారు. పరారీలో వున్న నాలుగో నిందితుడు శ్రావణ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అత్యాచారయత్నం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ విశాల్ గున్ని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
తేతలిలో..
అభంశుభం తెలియని ఓ ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం తేతలి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. అఘాయిత్యానికి పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధిత బాలికను చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తేతలి గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలిక తణుకు పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతోంది. శుక్రవారం సాయంత్రం చిన్నారి అమ్మమ్మ ఇంటి సమీపంలోని పాఠశాల ఆవరణలో ఆడుకుంటూ ఉండగా నలుగురు మైనర్ బాలలు ఆమెకు మాయమాటలు చెప్పి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
పాలకుల అండతోనే నేరస్తులు తప్పించుకోగలుగుతున్నారని మహిళ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అధికార అండదండలు చూసుకొనే కొందరు ప్రజాప్రతినిధుల విచ్చలవిడిగా నేరాలకు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని మహిళలు మండిపడుతున్నారు. దాచేపల్లి ఘటనతోపాటు తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడికి చెందిన టీడీపీ ఎంపీటీసీ కంచిబోయిన సంధ్య భర్త శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి పునరావృతమవుతున్నాయని మండిపడుతున్నారు. ఇలాంటి ఘటనలకు నైతిక బాధ్యత వహించి హోంమంత్రి చినరాజప్ప, సీఎం చంద్రబాబు పదవుల నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment