‘సోషల్’ వేధింపులు
బాధితుల్లో ఉద్యోగినులు, విద్యావంతులే అధికం
ఏటేటా పెరుగుతున్న కేసుల సంఖ్య
ప్రతిపాదనలకే పరిమితమైన మహిళా ఠాణాలు
సిటీబ్యూరో: నగరంలో మహిళలపై సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఈ-మెయిల్, ఫేస్‌బుక్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా మహిళలపై బెదిరింపులకు పాల్పడుతున్న కేసులు ప్రతి రోజు జంట పోలీసు కమిషనరేట్లలోని సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌కు వస్తున్నాయి. 2012లో సైబర్ నేరాల బారిన పడిన బాధిత మహిళల సంఖ్య 120 వరకు ఉంటే 2013లో ఆ సంఖ్య 172కు పెరిగింది, 2014లో 342 మంది మహిళలు ఫిర్యాదు చేశారు. బాధితుల్లో ఎక్కువగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, విద్యావంతులే ఉన్నారు. మగ వారితో ఉన్న చిన్నపాటి పరిచయాతోనే వేధింపులకు గురవుతున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది.
‘‘నన్ను ప్రేమించు..పెళ్లి చేసుకో..లేదంటే ఫేస్‌బుక్‌లో మార్ఫింగ్ చేసిన పొటోలు పెడుతా’’. ‘‘నా కోరిక తీర్చకుంటే.. నీ పెళ్లి కాకుండా అసత్య ప్రచారం చేస్తా’’ ఇలా బెదిరిస్తున్న ఆకతాయిలపై బాధిత మహిళలు ఫిర్యాదు చేయడం, పోలీసులు కేసు నమోదు చేయడం వరకు బాగానే ఉంది. అయితే కేసులు నమోదై ఏళ్లు గడుస్తున్నా ఇంత వరకు ఒక్కరంటే ఒక్కరికి కోర్టులో శిక్ష పడలేదు. సకాలంలో చార్జీ షీట్ దాఖలు చేయకపోవడం ఓ కారణమైతే, కేసు మధ్యలో నిందితుడితో బాధిత మహిళలు తమకెందుకులే అనుకుని రాజీ కుదుర్చుకోవడం మరో కారణం. కొన్ని కేసులలో పోలీసుల దర్యాప్తులో లోపాలు ఉన్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సైబర్ నేరగాళ్ల వేధింపులు భరించలేక కొంత మంది మహిళలు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు సైతం ఉన్నాయి. మరికొందరు మహిళలు ఉద్యోగాలకు పులిస్టాప్ పెట్టి ఇంటికే పరిమితమవుతున్నారు. ఇక విద్యార్థినుల విషయంలోను ఇదే జరుగుతోంది. లెక్చరర్లు, తోటి విద్యార్థుల వేధింపులు భరించలేక సగంలోనే చదువును మానివేస్తున్నారు. పోలీసు స్టేషన్‌లలో నమోదైన గణాంకాలు ఇలా ఉంటే ఇక పరువు పోతుందనే భయంతో, మగ పోలీసులకు ఏమని ఫిర్యాదు చేయాలనే భయంతో ఫిర్యాదు చేయకుండా ఉన్న వారి సంఖ్య నమోదవుతున్న కేసుల సంఖ్య కంటే మూడింతలు ఎక్కువగానే ఉంటుంది.
ఖాళీ పోస్టులే..
జంట పోలీసు కమిషనరేట్లలో మహిళలు, విద్యార్థినిలకు భద్రత, భరోసా కల్పిస్తామంటున్న అధికారులు ఖాళీగా ఉన్న మహిళా పోస్టులను భర్తీ చేయడంలో ఆసక్తి చూపడంలేదు. సైబరాబాద్, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్లలో జోన్‌కు ఒకటి చొప్పున మహిళా పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద మూడేళ్లుగా పెండింగ్‌లో ఉంది. జంట పోలీసు కమిషనరేట్లలో కనీసం 10 ఠాణాలు ఉండాల్సింది. అయితే కేవలం ఐదు మాత్రమే ఉన్నాయి. మహిళా పోలీసు సిబ్బంది సంఖ్య కూడా తక్కువగా ఉంది. నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో దశాబ్దాల క్రితం ప్రభుత్వం 504 మహిళా పోలీసు పోస్టులను మంజూరు చేయగా 2014 గణాంకాల ప్రకారం 226 మంది మాత్రమే భర్తీ అయ్యారు. 238 పోస్టులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. వీటి భర్తీ ఆగమ్య గోచరంగానే మారింది.