మగాళ్ల కోసం ఓ కమిషనా?! | Attacks On Womens Says Women Wings | Sakshi
Sakshi News home page

మగాళ్ల కోసం ఓ కమిషనా?!

Published Tue, Jun 5 2018 1:52 AM | Last Updated on Sat, Jul 28 2018 8:40 PM

Attacks On Womens Says Women Wings - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్మన్‌ ‘పురుష కమిషన్‌’ కూడా ఉండా లని వాక్రుచ్చారు. దాంతో మహిళలే కాదు పురుష ప్రపంచం కూడా నివ్వెరపోయింది. ఎవరో కొద్దిమంది 498ఎ ముద్దా యిలు, 498ఎ బూచితో ఎన్‌ఆర్‌ఐ నిధులు పొందే ‘బాధితుల’ సంఘాలు మినహాయింపు అనుకోండి. ఈ అద్భుతమైన ఆలోచన, ఆమె దగ్గరికి వస్తున్న వారికి ఆమె కౌన్సెలింగ్‌ ఇస్తున్న సందర్భంలో ఆమె చైర్మన్‌గా ‘కేసు’ తెలుసుకోవడం మానేసి కౌన్సి లింగ్‌లు నిర్వహిస్తున్న సందర్భంలో వచ్చిందన్న మాట. 40 శాతం భార్యల తప్పు ఉన్నట్లు ఆమెకు తెలిసిందట. ఈ శాతం అంశంలో ఆమె అనుభవాల నయినా ఒక పద్ధతి ప్రకారం నమోదు చేసి విశ్లేషించి చెప్పలేదు.

ఇటువంటి అరుదైన అధ్యయనాలతో మహిళా సంఘాల కళ్లు తెరిపించడానికి, లెక్కలు విడుదల చేయండి అంటే అబ్బే అలా చేయకూడదు. వాళ్ల పేర్లు బయటపెట్టకూడదన్నారు. అసలు 40 శాతం స్త్రీలు.. పురుషుల్ని బాధ పెట్టేంత సాధికారత పొందినట్లయితే ఇక మహిళా కమిషన్‌ అవసరం ఏముంది? 60 శాతం పురుషులు హింసిస్తున్నారట.  సగం వాళ్లు సగం వీళ్లు హింసిస్తూ సాగే పవిత్ర కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆద ర్శంగా ఉంటుంది. అసలు కుటుంబం అంటే ఏమిటి? గృహ హింస ఏ ఆధిపత్య సంబంధాల వలన వస్తుంది? వాటిని ఆర్థిక వ్యవస్థ– (వనరుల్లేక స్త్రీలు ఆధారపడే స్థితి) ఎందుకు కొనసాగిస్తుంది? వంటì  మౌలిక అవగాహన కూడా లేని వ్యక్తుల్ని కమి షన్లలో నియమించడమే అసలు దారుణం.

ఆంధ్రప్రదేశ్‌లో భర్తల్ని చంపిన భార్యలకు చెందిన రెండు మూడు ఘటనలు, తెలంగాణలో జరి గిన ఐదు ఘటనలు.. ఇంకా దేశంలో అత్యంత అరు దుగా జరిగే ఇటువంటి ఘటనలు మీడియాలో చాలా సమయం పొందుతున్నాయి. ఒక నల్ల బానిస తెల్ల వాడిని చంపితే ఇటువంటి ఆగ్రహమే ప్రకటిత మయ్యేది ఒకప్పుడు. ఒక శూద్రుడు బ్రాహ్మడిని తన్నితే ఇలాగే కూసాలు కదిలిపోయేవి. ఒక స్త్రీ భర్తను కాదంటే ఇలాగే ఆవేశాలు పెల్లుబికేవి. 498ఎని నీరుకార్చడం ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరో ధక చట్టం బుట్టదాఖలు చేయటం ఇపుడు ఎదురు దాడి చేస్తున్న ఆధిపత్య వర్గాల వ్యూహంలో భాగమే.

వ్యక్తిగతంగా నేరం చేసినవాళ్లని ఎవరినయినా చట్టప్రకారం సత్వరంగా న్యాయ విచారణ పూర్తిచేసి శిక్షించాలి. దీనికి ఆడ, మగా తేడా లేదు. అట్లాగే నేర ప్రవృత్తి స్త్రీలకు ఉండదు అనడం స్త్రీలను దేవతలుగా కీర్తిస్తూ బానిసలుగా మార్చిన సంస్కృతి తాలూకూ భావజాలమే. ఆమె మనిషి. మనిషికుండే మంచి చెడు లక్షణాలు ఆమెక్కూడా ఉంటాయనడం వాస్త వం. మహిళా కమిషన్‌ ఏర్పాటు జరిగింది మహిళలు ఏం చేసినా రక్షించడానికి కాదు.

కుటుంబ వ్యవస్థకు కాపలా వేయడానికి కూడా కాదు. ప్రపంచ వ్యాప్తంగా 40 శాతం స్త్రీలు గృహ హింసకు గురవుతున్న విషయం నమోదు కాదు. కుటుంబ పరువు, ఆర్థికంగా ఆధారపడటం, పిల్లలకు వేరే భరోసా లేకపోవడంతో హింసను వీళ్లు మౌనంగా భరిస్తుంటారు. అలా భరించడమే ఉత్తమ ఇల్లాలి లక్షణమని సమాజం, మతం ఊదరగొట్టి స్త్రీల నరనరాల్లో దీన్ని నింపేశారు.

 కానీ ఇపుడు కాస్త చదువుకుని, ఉద్యోగాలు చేస్తూ ప్రపంచం తెలు సుకుని నేనూ మనిషినే అని తిరగబడితే అది మగా డిపై హింసగా మారిపోతోంది. ‘అత్తమామల్ని చూడ రంట. ఆడపడుచులకి సేవలు చేయరంట. ఎంత దారుణం’ అని సదరు చైర్మన్‌ వాపోతున్నది. అలా అయితే భార్య తల్లిదండ్రుల్ని చూసే బాధ్యత భర్తకు ఉందా? ఇద్దరూ సమానం అయినపుడు ఇరువైపులా తల్లిదండ్రులపట్లా సమానంగా బాధ్యత వహించాలి కదా. అట్లా కాకుండా తనపై పెత్తనం చేసే వారికి సేవలు చేయకపోవడం దారుణం అంటున్నామంటే కుటుంబం ‘మగాడిది’ అని అంగీకరించడమే.

భర్త తాలూకు అధికారంతో తనపై నిరంతర నిఘా వేసి తప్పులుబట్టి సేవల్ని కూడా గుర్తించక పోవడం తమ హక్కుగా భావించే వారితో కలిసి ఉండాలని ఎవరికి ఉంటుంది? వారి జీవిత భాగస్వాములను వారికి బలవంతంగా సేవలు చేయమనడం సరికాదు. ‘మగాడి’ ఇంటికి వచ్చి ఇంటి పేరు (కొన్నిసార్లు స్వంత పేరు కూడా) మార్చుకుని, అత్తింటి మనిషిగా స్త్రీలను తయారు చేసే క్రమమే హింస. ఓ మనిషిగా గుర్తింపుని (కన్యాదానంతో) కోల్పోయే క్రమం. సామాజిక కట్టుబాట్లతో మొదలయ్యే హింస.

స్త్రీలపై హింస నానాటికీ పెరుగుతుండటం అంటే ఆధిపత్యం, అసమానత పెరుగుతున్నదనే అర్థం. చదువురాని స్త్రీలు కూడా తమ అనుభవాల నుంచి∙దీనిని చక్కగా అర్థం చేసుకోగలరు. ఆధిపత్యాన్ని సమర్థించేవారు దీన్ని అర్థం చేసుకోవడానికి నిరాకరిస్తారు. పీడితులకు న్యాయం చేయాల్సిన పద విలో ఉన్న వారికి పీడిత వర్గ పక్షపాతం లేకుంటే వారికి అన్యాయం జరుగుతుంది.

స్త్రీలకు చట్టపరమైన హక్కులు కల్పిస్తున్నాయా లేదా పర్యవేక్షించడానికి ఒక స్వతంత్ర సంస్థగా ఏర్ప రచినవే కమిషన్లు. వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలు అన్నింటిపైనా నిఘా ఉంచడం. వాటిని ప్రశ్నించడం,  పనిచేసేలా ముల్లుగర్రతో పొడవటం. చట్టాల లోపాలను ఎత్తిచూపడం వీటి పని. వివాహేతర సంబంధాలలో పురుషుడికే స్వేచ్ఛ ఉంది. స్త్రీకే లేదు. స్త్రీ వివాహం వద్దని చెబితే గౌరవ హత్యలు జరుగుతాయి. విడాకులు కావాలంటే.. వెలి వేస్తారు. చుట్టూ వాతావరణం నేరం చేసినా తప్పిం చుకోవచ్చనే భరోసా కల్పిస్తుంది. భర్తను చంపే బదులు వదిలివేయవచ్చు కదా అని దీర్ఘాలు తీస్తు న్నారు కొందరు.

రెండేళ్లలో 87 శాతం పెరిగిన వర కట్న హత్యలకు కారకులైన భర్తలక్కూడా అదే చెప్పి చూడండి. గృహ హింసకు కారణం అయిన వారికి ఈ నీతిబోధ చేయండి.స్త్రీలు ఇట్లా చేసినవి జరిగిన నేరాల్లో 0.0000 శాతం కూడా లేవు. దానికే ఇంత గగ్గోలు అంటే మనది ఎంత మగాధిపత్య సమాజమో, ఎంత మగ మీడియానో, స్త్రీలు అణగి ఉండాలనే భావజాలం మనలో ఎంత పేరుకుపోయిందో అర్థమౌతుంది. సమాజంలో గల అసమానతకు తద్వారా స్త్రీలపై హింసకు కుటుంబంలోని ఆధిపత్య సంబంధాలకూ, హింసకూ గల సంబంధాన్ని దాని చారిత్రక క్రమాన్ని అందరూ అధ్యయనం చేయక పోవచ్చు. కానీ కాస్త ఇంగిత జ్ఞానం, వాస్తవాల పట్ల గౌరవం ఉండాలి. 

కమిషన్‌ చైర్మన్‌గా ఉన్నప్పుడు తాను మాట్లా డిన మాట మహిళల ప్రయోజనాలకు గొడ్డలి వేటుగా మారుతుందనీ, స్త్రీలను హింసించేవారంతా ఈ తప్పుడు వాదనను భుజానేసుకుంటారనే సోయి కూడా లేనివారికి రాజ్యాంగ పదవి ఉండాలా? అర్హ తలేమీ లేకుండా ఒక రాజ్యాంగ పదవిలో వ్యక్తుల్ని నియమిస్తే ఏమవుతుందో ప్రభుత్వాలకు ఇప్పుడ యినా అర్థమైందో లేదో.. వారికి అర్థం కాకుంటే ఇటువంటి  భావాలున్న వారినీ, అనర్హులనూ పదవి నుండి తొలగించాలని డిమాండ్‌ చేయాలి.


దేవి 
వ్యాసకర్త సాంస్కృతిక కార్యకర్త 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement