పైపూతలే పరిష్కారమా? | Mallepally Laxmaiah Write Article On Khatva Issue | Sakshi
Sakshi News home page

పైపూతలే పరిష్కారమా?

Published Thu, Apr 26 2018 12:33 AM | Last Updated on Sat, Jul 28 2018 8:40 PM

Mallepally Laxmaiah Write Article On Khatva Issue - Sakshi

కొత్త కోణం

అత్యాచారాలు కేవలం వ్యక్తుల చేష్టలు మాత్రమే కావు. ఆ దుర్మార్గాలకు సమాజం నిండా ఆవరించి ఉన్న అహంకారం, పెత్తనం, ఆధిపత్యంలాంటి భావాలు అటువంటి వాటిని పెంచి పోషిస్తున్న సంస్థలు బాధ్యులు. రేపిస్టులకు శిక్షలూ, బాధిత కుటుంబాలకు న్యాయం అనే రెండూ సరైన డిమాండ్లే. కానీ అవే సమస్యకు సంపూర్ణ పరిష్కారం కావు. అత్యాచారాలకు వ్యక్తులు మాత్రమే కారణం కాదనీ, వాటిని ప్రేరేపిస్తున్న భావజాలానిదీ, రాజకీయాలదే ప్రధాన బాధ్యత అని గ్రహించినప్పుడు వ్యవస్థపైనే మనం యుద్ధం ప్రకటించగలుగుతాం.

అప్పుడెప్పుడో 2012లో ఢిల్లీలో నిర్భయ మీద జరిగిన ఘటనపై దేశ వ్యాప్తంగా ఉద్యమాలు వెల్లువెత్తాయి. భవిష్యత్తుపై ఆశలు రేకెత్తించాయి. ఓ చట్టం తేవడంతోనో, లేదా వాళ్ళని ఉరితీయాలని కోరడంతోనో ఆగ్రహం చల్లారిపోతోంది. నిజానికి మనం ఏం కోరుకుంటున్నాం. తప్పు చేసిన వారికి శిక్ష పడాలనా? తప్పులు జరగకుండా ఉండాలనా? మనమంతా కోరుకునేది తప్పులు జరగకుండా ఉండడమే అయితే అసలు తప్పుకి కారణాలేమిటో వెతకాలి. దాని మూలాలను విశ్లేషించాలి. ఈ దేశంలో స్త్రీలపైనా, ప్రధానంగా పాపం పుణ్యం ఎరుగని పసిబిడ్డలపైనా జరుగుతున్న హింస, అత్యాచా రాలూ, హత్యలూ మానవత్వం మిగిలివున్న మనసులను, మనుషులనూ కలవరపెడుతున్నాయి. 

ఘటనలు జరిగినప్పుడు వెల్లువెత్తుతోన్న ఆగ్రహం, ఉద్యమాలు ఆ తరువాత చప్పున చల్లారిపోతున్నాయి. మళ్ళీ ఏదైనా ఘటన జరిగినప్పుడే మన గొంతు వినిపించేది. మనలో ఆందోళన కనిపించేది. మన లోని ఆగ్రహావేశాలు ఉద్యమరూపం దాల్చేదీ. ఈ నిరసనలన్నీ కూడా వ్యక్తుల దగ్గరే ఆగిపోతున్నాయి. వాళ్ల శిక్షలవరకే పరిమితమౌతున్నాయి. అంతగా అయితే బా«ధిత కుటుంబాలకు న్యాయం జరగాలన్న డిమాండ్‌ వరకూ కొన సాగుతున్నాయి. ఇవి రెండూ న్యాయమైన డిమాండ్లే, సరైనవే. కానీ అవే సమ స్యకి సంపూర్ణ పరిష్కారం కావు. భవిష్యత్‌లో జరగబోయే అఘాయిత్యాలకు యీ డిమాండ్లే విముక్తి పలకలేవు.

అత్యాచారం వ్యక్తిగతం కాదు
నిజానికి అత్యాచారాలకూ, హత్యలకూ పాల్పడుతున్న వారు వ్యక్తులు గానే కనిపించినప్పటికీ, కొన్ని వ్యవస్థలకీ, రాజకీయాలకీ ముడివడి వున్న విష యమిది. అందుకే ఆయా రాజకీయాలూ, ఆ భావజాలం కొన్నిసార్లు బహి రంగంగానే నిందితులకు అండగా నిలుస్తుంటాయి. ఈ దేశంలో చిన్నా పెద్దా తేడా లేకుండా వయసుతో నిమిత్తం లేకుండా అత్యాచారాలు జరగడానికీ, పసిబిడ్డలని కూడా చూడకుండా అత్యంత క్రూరంగా హత్యలకు సైతం ఒడి గట్టడానికీ, మతం, ప్రాంతం, భాష, పితృస్వామ్య భావజాలం కారణాలని పదే పదే రుజువవుతూ వస్తున్నది.  

జమ్మూలోని కథువా గ్రామంలో ఎనిమిదేళ్ల పసిపాపను ఒక ప్రార్థనా మందిరంలో బంధించి, కొన్ని రోజులపాటు పసికూనపై అత్యాచారం చేసి చివరకు అతిక్రూరంగా చంపేసిన దారుణం దేశంలో ప్రకంపనలు సృష్టిం చింది. ప్రపంచం మొత్తాన్ని కలవరపరిచింది. కానీ గతంలో ఎప్పుడూ లేన ట్టుగా ఈ దారుణాన్ని బహిరంగంగా నిస్సిగ్గుగా సమర్థించడం దేశంలో మారుతున్న సామాజిక, రాజకీయ పరిస్థితులకు ప్రత్యక్ష ఉదాహరణ. ఆ పసి పాపను∙అత్యాచారం చేసి, హత్య చేసిన వారి సామాజిక వర్గం నేతలు, చివ రకు బీజేపీ మంత్రులు, నాయకులు కూడా నిందితులను బహిరంగంగా సమ ర్థించారు. పైగా వారికి మద్దతుగా జెండాలు పట్టుకొని వీరావేశంతో వీ«ధుల్లో కెక్కారు. ఇట్లా ప్రవర్తించడం వెనుక మతపరమైన, రాజకీయపరమైన కారణా లున్నాయనేది నమ్మక తప్పని వాస్తవం.

ఘాతుకానికి బలైన ఎనిమిదేళ్ల చిన్నారి ఆసిఫాను, మహమ్మద్‌ యూసుఫ్, ఆయన భార్య నసీమా బీబీ రెండేళ్ల వయస్సులో దత్తతకు తీసు కున్నారు. మహమ్మద్‌ యూసుఫ్‌ గొర్రెలను, మేకలను మేపుతూ బతుకుతు న్నాడు. పదేళ్ల నుంచి తువా జిల్లా రసనగ్రామంలో స్థిరపడ్డాడు. అయితే జమ్మూలో హిందువులదే మెజారిటీ. మహమ్మద్‌ యూసఫ్‌ లాంటి వాళ్ళు ఇక్కడ స్థిరపడితే, శ్రీనగర్‌లాగా జమ్మూలో కూడా ముస్లింల సంఖ్య పెరుగు తుందనే అనుమానం ఇక్కడి హిందువులలో ఉన్నది. అందుకుగాను మేకలు, గొర్రెలు మేపుకొని బతికే వారిలో భయాందోళనలు సృష్టించడానికి ఇటువంటి ఘాతుకానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. కామవాంఛ కాదు. నిజానికి ఒక సామూహిక విద్వేషం ఈ ఘాతుకానికి పురికొల్పింది. 

అలాగే ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ ఘటన. పద్దెనిమిదేళ్ల దళిత యువతి ఉద్యోగం అడగడానికి స్థానిక ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సెనేగర్‌ ఇంటికి వెళితే, అతను తనపై అత్యాచారం చేసినట్టు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు పట్టించుకోలేదు. మెజిస్ట్రేట్‌ ముందు ఆ విషయం చెప్ప కుండా పోలీసులు అడ్డుకున్న వాస్తవాన్ని కూడా ఆ యువతి బయటపెట్టింది. చివరకు న్యాయం చేయాలని అడగడానికి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్ళిన ఆమె తండ్రిని ఎమ్మెల్యే సోదరుడు మరికొంత మంది తీవ్రంగా కొట్టి గాయపరిస్తే ఆయన ఆసుపత్రిలోనే మరణించారు. అత్యాచారానికి గురైన ఆ యువతి ముఖ్యమంత్రి ఇంటి ముందర ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో పోలీ సుల్లో కదలిక వచ్చింది, దీంతో కేసు విచారణకు ఆదేశించారు. అనేక నిరస నలు, దేశవ్యాప్తంగా దళితుల ఆందోళనల వల్ల ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. అత్యాచారానికి పాల్పడిన వాళ్ళు ఆధిపత్య కులానికి చెందినవారు కాబట్టే ఇటు పోలీసులూ, అటు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయారు.

కుల, మతాధిపత్యమే ప్రధాన భూమిక
మహారాష్ట్రలోని భండార జిల్లాలో జరిగిన ఖైర్లాంజి ఘటన కూడా అదే కోవ లోకి వస్తుంది. ఇక్కడ కూడా దళితులపైనే అఘాయిత్యం జరిగింది. ఆ గ్రామంలోని భయ్యాలాల్‌ బూత్‌ మాంగే కుటుంబాన్ని ఆ ఊరి పెత్తందార్లు నిర్మూలించారు. డోమబిమ్తే భార్య సురేఖ బూత్‌ మాంగే, కూతురు ప్రియాం కలపై సామూహిక అత్యాచారం జరిపి చంపేశారు. భయ్యాలాల్‌ తన భూమిని ఊరు పెత్తందారులు ఆక్రమించుకోవడాన్ని వ్యతిరేకించినందుకు అహం దెబ్బతిని అత్యంత దారుణంగా ఆ కుటుంబాన్ని చంపేశారు. ఇక్కడ కూడా కులాధిపత్యం వల్లే అత్యాచారం జరిగిందనేది వాస్తవం. 
యుద్ధంలో కూడా స్త్రీల శరీరాలపైనే శత్రువు ప్రథమ దాడి. 

అనేక యుద్ధాల్లో శత్రువు చేతికి చిక్కిన స్త్రీలను చెరచకుండా వదిలిపెట్టిన దాఖ లాలుండవు. చివరకు శ్రీలంక తమిళులపై అక్కడి సైన్యం పాల్పడిన అకృ త్యాలు మనం చూశాం. మగాళ్ళనైతే అతి క్రూరంగా చంపేయడం, ఆడవా ళ్ళంటేనే పురుషుడి ప్రతాపం చూపించుకొనే ఒక అవకాశంగా మారుతున్న స్థితి. నిజానికి అది భౌతిక వాంఛ కాదు. ప్రతీకారేచ్ఛ. ఆ వ్యక్తుల్ని పట్టుకొని చంపినా తీరని ప్రతీకారం వారి స్త్రీలపై అత్యాచారాలకు పాల్పడడంతో కసి తీరుతుంది. విశాఖ జిల్లా వాకపల్లిలో ఆగస్టు 20, 2007న గ్రేహౌండ్స్‌ పోలీ సులు పదకొండుమంది ఆదివాసీ మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. 

2007న జరిగిన ఘటనపై ఇంకా విచారణ పూర్తికాలేదు. దోషులపై చర్యలు తీసుకున్నదీ లేదు. ఈ ఉదంతం కూడా ప్రతీకారంతో జరిగిందే తప్ప మరొకటి కాదు. నక్సలైట్ల కోసం గాలింపు జరుపుతున్న సమయంలో పోలీసులు ఈ దారుణానికి ఒడి గట్టారు.. నక్సలైట్లకు ఎటువంటి సాయం అందకుండా చేయడంలో భాగంగా ఈ ఘటన జరిగింది. గతంలో కూడా నైజాంకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాట సమయంలో సైతం ఎంతో మంది మహిళలపై సైన్యమే సామూహిక అత్యాచారాలకు పాల్పడినట్టు అనేక నివేదికలున్నాయి. ఈ అత్యాచారాలు కేవలం పగ, ప్రతీకారంతో జరుగుతున్నవే.

కఠిన శిక్షలే సమస్యకు పరిష్కారమా?
ఇటీవల ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్‌లాంటిచోట్ల ఈశాన్య రాష్ట్రాల అమ్మాయిలపైన జరి గిన సామూహిక అత్యాచారాలే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. నవంబర్‌ 24, 2010న ఢిల్లీ ఔటర్‌ రింగ్‌రోడ్డు దగ్గర ఈశాన్య రాష్ట్రాలకు చెందిన అమ్మాయిని కిడ్నాప్‌ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మే 8, 2005న రోడ్డు పక్కన నడచివెళ్తుండగా మిజోరాంకు చెందిన ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన అమ్మాయిని అపహరించి, కారులోనే అతిక్రూరంగా సామూహిక అత్యాచారం చేసారు. బెంగుళూరులో కూడా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థులపై దాడులు జరిగాయి. సిక్కింకు చెందిన 22 ఏళ్ళ యువతిపై ఢిల్లీ నుంచి గుర్‌గావ్‌ వెళ్తుండగా కారులో అత్యాచారం జరిపి ఢిల్లీలో పడేశారు. ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులపై విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా నేటికీ ప్రచారం జరుగుతున్నది. రెచ్చగొడుతోన్న విద్వేషం ఫలితమే ఇటువంటి ఘటనలు.

గత డెబ్భై ఏళ్ల భారత స్వాతంత్య్ర చరిత్రలో మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు వచ్చాయి. 2012 నిర్భయ చట్టం అందులో చాలా కఠినమైనది. తాజాగా కేంద్రం జారీచేసిన ఆర్డినెన్స్‌ మరింత శక్తివంతమైందని చెబుతు న్నారు. పన్నెండేళ్ళలోపు అమ్మాయిలపై అత్యాచారం జరిపిన వారికి మరణ దండన విధించేలా చట్టాలలో సవరణలు చేశారు. మరణశిక్ష ఇవ్వాళ భార త్‌లో కొత్తేమీకాదు. హత్యానేరాల్లో దానిని అమలు చేస్తున్నారు. కానీ హత్యలు ఏమేరకు తగ్గాయనేది ఆలోచించాలి. మరణశిక్షని చూసి మారిన వాళ్లెందరు? ప్రతి సంవత్సరం హత్యలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. మరణ శిక్షలు లేని దేశంలో ఇంతకన్నా ఎక్కువగా హత్యలు జరుగుతున్నదీ లేదు. ఒకరకంగా చెప్పాలంటే ఈ రకమైన శిక్షలు వేస్తామని చట్టాలు చేయడం అసలు విషయాలపైన దృష్టిపోకుండా చూడటానికే. 

నిజానికి మన దేశంలో ఉన్న సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను, ఆలోచనలను మార్చకుండా ఏ చట్టాలూ ఫలితాలను ఇవ్వవు. రాజకీయంగా విమర్శల నుంచి బయటపడేందుకు ప్రభుత్వాలు చేస్తున్న విన్యాసాలు మాత్రమే ఇవి. కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు, రాజకీయ సిద్ధాం తాల విద్వేషాలను రెచ్చగొడుతున్న మనమే చట్టాలను పరిష్కారంగా చూపు తున్నాం. అందుకే ఈ దేశానికి కావాల్సింది శిక్షలు వేసే చట్టాలు మాత్రమే కాదు, మానవీయ భావాలను పెంచగలిగే శిక్షణ.

తాము ఎక్కువ కులం మిగతావాళ్లు మాకన్నా తక్కువ, వాళ్లను ఏం చేసినా ఎవ్వరూ ఏమీ అనరనే అహంకారం, తాము మెజారిటీ ఇతరులు మైనారిటీలు అనే ఆధిపత్య భావన, తాము మగవాళ్లం ఆడవాళ్ల మీద మాకు సర్వాధికారాలూ ఉన్నాయనే ధోరణి అన్నిరకాల క్రూరత్వాలకు కారణం. అందుకే అత్యాచారాలు కేవలం వ్యక్తుల చేష్టలు మాత్రమే కావు. ఆ దుర్మార్గా లకు సమాజం నిండా ఆవరించి ఉన్న అహంకారం, పెత్తనం, ఆధిపత్యం లాంటి భావాలు అటువంటి వాటిని పెంచి పోషిస్తున్న సంస్థలు బాధ్యులు. ఇది గ్రహించినప్పుడే అత్యాచారాలకు వ్యక్తులే కారణం కాదనీ, వాటిని ప్రేరే పిస్తున్న భావజాలానిదీ, రాజకీయాలదే ప్రధాన బాధ్యత అని గ్రహించగలు గుతాం. అది అర్థం చేసుకుంటే అత్యాచారాలకు కారణమైన భావజాలాన్ని పెంచి పోషించే వ్యవస్థపైనే మన యుద్ధం ప్రకటించగలుగుతాం.

- మల్లెపల్లి లక్ష్మయ్య 
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 97055 66213  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement