ఇందూరు : జిల్లాకు మంజూరైన నిర్భయ కేంద్రం (వన్ స్టెప్ క్రైసిస్ సెం టర్) భవన నిర్మాణానికి స్థలం కరువైంది. రెన్నెళ్లుగా స్థలం చూపకుండా రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో జిల్లాకు వచ్చిన నిర్భయ కేంద్రం ఇప్పట్లో ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. ఇటు ఈ కేంద్రాన్ని డిసెంబర్‌కల్లా పూర్తిచేసి ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఐసీడీఎస్ అధికారులకు ఆదేశాలు అందాయి.
దీంతో నిర్భయ కేం ద్రాన్ని ఎలా? ఎక్కడ? ప్రారంభించాలోనని సమాలోచనలు చేస్తున్నారు. ప్రస్తుతానికి అద్దె భవనంలో ప్రారంభించాలని యోచిస్తూ భవనం కోసం వెతుకుతున్నారు. మహిళలపై వేధింపులు, అత్యాచారాలు, దాడులు జరిగిన వెంటనే తక్షణ సహాయం, వైద్యం అందజేయడానికి దేశవ్యాప్తంగా 660 నిర్భయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మన జిల్లాకు కూడా నిర్భయ కేంద్రాన్ని మంజురు చేస్తూ ఆగస్టు 13న ఐసీడీఎస్ కార్యాలయానికి ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కేంద్రాన్ని జిల్లా కేంద్రంలో రెండు కిలోమీటర్ల పరిధిలో లేదా, ప్రభుత్వ ఆస్పత్రికి దగ్గర 300 చదరపు మీటర్ల స్థలంలో నిర్మించాలని ఆదేశిస్తూ రూ. 36 లక్షలను కేటాయించింది. ఇందుకు ఐసీడీఎస్ అధికారులు నిర్భయ కేంద్ర నిర్మాణం కోసం జిల్లాకేంద్రంలో ప్రభుత్వ స్థలం చూపించాలని నిజామాబాద్ ఆర్‌డీఓ యాదిరెడ్డికి ఫైలు పెట్టారు. ఆయన నిజామాబాద్ తహశీల్దార్‌కు సిఫార్సు చేశారు. వెంటనే తహశీల్దార్ జిల్లాకేంద్రంలో జాయింట్ విజిట్ చేసి పలు స్థలాలను గుర్తిం చారు. అయితే అవి కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి.
జిల్లా కేంద్రానికి రెండు కిటోమీటర్ల పరిధిలో కాకుండా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగారాం, సారంగపూర్ ప్రాంతాల్లో స్థలాలను చూపించారు. అంత దూరంలో కేంద్రాన్ని ఏర్పాటు చేయడం కుదరదని, మహిళలకు తక్షణ సహాయం, వైద్యం అందించడానికి వీలుపడదని ఐసీడీఎస్ అధికారులు స్పష్టం చేశారు. అంత దూరంలో నిర్మిస్తే ప్రయోజనం ఉండదని, చూపిన పై రెండు స్థలాలను తిరస్కరించారు. దీంతో నిర్భయ కేంద్రం నిర్మాణానికి బ్రేక్ పడింది.
ఎంతో ఉపయోగకరమైన నిర్భయ కేంద్రం అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిర్మాణానికి నోచుకోవడం లేదు. ఇందులో మరో విషయమేమంటే స్థలం చూపిన వెంటనే జిల్లాకు మంజూ రు చేసిన నిధులును ఖాతాలో వేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. మహిళల రక్షణ కోసం జిల్లాకు మంజురైన ఈ కేంద్రాన్ని త్వరగా నిర్మించి అందుబాటులోకి తేలవాలని పలు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.
కలెక్టర్ చొరవ తీసుకుంటే..
నిర్భయ కేంద్రం నిర్మాణం కోసం జిల్లా కేంద్రంలో లేదా రెండు కిలోమీటర్ల పరిధిలో నిర్మించాలన్న ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లా కేంద్రంలో అనువైన స్థలాలు లేవని రెవెన్యూ అధికారులు అంటున్నారు. కాగా కేవలం 300 చదరపు మీటర్ల ప్రభుత్వ స్థలం లేదంటే ఆశ్చర్యకరంగా ఉందని మహిళా సంఘాలు పేర్కొంటున్నాయి.
రైల్వే స్టేషన్ సమీపంలో పాత జిల్లా పంచాయతీ కార్యాలయం ఆవరణ, ఇటు నాల్గవ పోలీసు స్టేషన్ వద్ద, సుభాష్‌నగర్‌లోని ఎస్‌ఎఫ్‌ఎస్ పాఠశాల వద్ద అర్టికల్చర్ కార్యాలయం పక్కన, ఆర్మూర్ రోడ్డులో లక్ష్మి కళ్యాణ మండపం పక్కన డి-54 కెనాల్ ప్రాంతం, ఆర్మూర్ బైపాస్ రోడ్డు ప్రాంతం, ఇంకా నగరంలో అక్కడక్కడా ప్రభుత్వ స్థలాలున్నాయి. ఈ విషయంలో నిర్భయ కమిటీ చైర్మన్‌గా ఉన్న జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ ప్రత్యేక చొరవ తీసుకుంటే తప్ప సమస్యకు పరిష్కార మార్గం కనిపించడం కష్టమని పలువురు అంటున్నారు. లేదంటే భవన నిర్మాణం కోసం కేటాయించిన నిధులు తిరిగి వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది.
రెండు కిలోమీటర్ల పరిధిలో స్థలం చూపాలని కోరాం -రాములు, ఐసీడీఎస్
జిల్లాకు మంజూరైన నిర్భయ కేంద్రాన్ని వీలైనంత తొందరగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. అయితే స్థలం చూపాలని ఆర్‌డీఓ, ఎమ్మార్వోలను కోరాము. వారు జాయింట్ సర్వే జరిపి నాగారాం, సారంగపూర్ ప్రాంతాల్లో స్థలాలను చూపుతున్నారు. అవి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. రెండు కిలో మీటర్ల పరిధిలో చూపాలని కోరాం.
నిధులు మంజూరైనా స్థలం కరువు
Published Mon, Oct 6 2014 2:06 AM | Last Updated on Sat, Sep 2 2017 2:23 PM
Advertisement