ఇందూరు: జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ బాబు ఎలాంటి వాడో అని ఎవరినీ అడిగినా అమ్మో... ఆయనా... ఎలాంటి అక్రమాలను ప్రోత్సహించడు... అక్రమాలకు పాల్పడిన వారిని విడిచిపెట్టడు.. విధుల్లో, పాలనలో నిక్కచ్చిగా వ్యహరిస్తాడు అని టక్కున చెప్పేస్తారు. జిల్లాలో ఇలాంటి పేరును సంపాదించున్న డీపీఓ ప్రస్తుతం నిజామాబాద్ డీఎల్‌పీఓ శ్రీకాంత్ అక్రమాలకు పాల్పడ్డాడని, నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్‌మెంట్ నిర్మాణాల అనుమతులకు భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డట్టు సాక్ష్యాలున్నా, ఫిర్యాదులు వచ్చినా ఆయనపై ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఎందుకు మౌనంగా ఉన్నారో తెలియడం లేదు.
నిజామాబాద్ మండలం గూపన్‌పల్లి గ్రామ పంచాయతీ ఫేస్-2 లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నా అపార్ట్‌మెంట్‌ను కూల్చి వేయాలని డీపీఓనే గతంలో డీఎల్‌పీఓ ద్వారా సంబంధిత గ్రామ కార్యదర్శికి, అపార్ట్‌మెంట్ నిర్మాణ యజమానికి నోటీసులు జారీ చేయించారు. కాని డీఎల్‌పీఓ వారితో కుమ్మక్కై అపార్ట్‌మెంట్ నిర్మాణానికి ప్రోత్సాహం ఇచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
ఎందుకంటే అపార్ట్‌మెంట్ నిర్మాణం ప్రారంభ దశలో ఉన్న సమయంలో అక్రమ కట్టడాలపై గ్రామస్తుడు ఫిర్యాదు చేయడంతో నోటీసు జారీ చేయగా పని నిలిపివేసినట్లు రికార్డుల్లో రాసినట్లుగా తెలిసింది. కానీ ప్రస్తుతం ఆ అపార్ట్‌మెంట్ నిర్మాణం చివరి దశలో ఉందంటే డీఎల్‌పీఓ, పంచాయతీ కార్యదర్శులిద్దరూ యజమానికి లొంగిపోయారనే విమర్శలు వస్తున్నాయి.
ఇటు అక్రమ కట్టడమేనని తెలిసిన డీపీఓ కూడా ఈ విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోకపోవడంతో డీఎల్‌పీఓ అపార్ట్‌మెంట్‌ల నిర్మాణాలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతిలిచ్చి అందినకాడికి దండుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. డీఎల్‌పీఓపై వచ్చిన ఆరోపణలపై తనకు మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని మూడు రోజుల క్రితం జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌బాబును కలెక్టర్ ఆదేశించారు. కాని నేటి వరకు డీఎల్‌పీఓపై నివేదిక తయారు చేసి కలెక్టర్‌కు అందజేయలేదు.
అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకునే డీపీఓ వెనకగుడు వేయడం వెనుక ఆంతర్యమేముందోనని పంచాయతీ అధికారులు, ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులు సర్వత్రా చర్చించుకుంటున్నారు. అక్రమార్కుడికి అండగా నిలబడటం సరికాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ విషయంపై డీపీఓ సురేశ్‌బాబును వివరణ కోరగా అసలు కలెక్టర్ తమను డీఎల్‌పీఓపై నివేదిక ఇవ్వమని ఆదేశాలిచ్చిన విషయం తెలియదని చెప్పారు. గూపన్‌పల్లిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్‌ను నిలిపివేయాలని నోటీసు ద్వారా తెలిపామని, ప్రస్తుతం పనులు నిలిచిపోయానని తెలిపారు. కానీ నిజానికి అక్కడ పనులు కొనసాగుతున్నాయి.
తెరపైకి మరో అక్రమాల కథ!
నిజామాబాద్ డీఎల్‌పీఓ అక్రమాల్లో మరో విషయం బయటకు పొక్కింది. రెండు నెలల క్రితం బాల్కొండ మండలం ముప్కాల్ గ్రామంలో ఓ ప్రజా ప్రతినిధి షాపింగ్ కాంప్లెక్స్, కల్యాణ మండపం నిర్మించడానికి గ్రామ పంచాయతీ నుంచి అనుమతి తీసుకోవాలి. అయితే అనుమతి రావాలంటే ముందుగా జిల్లా టౌన్ ప్లానింగ్ అధికారి నుంచి, అలాగే ఫైర్ శాఖ అధికారుల నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్( ఎన్‌ఓసీ) ఇవ్వాలి.
కానీ పై రెండు శాఖల అధికారుల నుంచి అనుమతి లేకుండానే పంచాయతీ కార్యదర్శి లక్‌పతి పంచాయతీ నుంచి అనుమతినిచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న పలువురు గ్రామస్తులు డీపీఓకు ఫిర్యాదు చేయగా ముప్కాల్ కార్యదర్శిపై విచారణ చేసి నివేదిక అందజేయాలని డీఎల్‌పీఓను ఆదేశించాడు. విచారణకు వెళ్లిన డీఎల్‌పీఓ కార్యదర్శితో, నిర్మించే ప్రజా ప్రతినిధితో కుమ్మక్కై సరైన అధారాలు లేవని తప్పుడు నివేదికను డీపీఓకు ఇచ్చాడు. ఆధారాలు లేవనే ఉద్దేశంతో డీపీఓ కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ప్రస్తుతం గ్రామస్తులు డీపీఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పరిష్కారం లభించడం లేదు.
సాక్ష్యాలున్నా.. మౌనమేల ?
Published Fri, Nov 14 2014 4:12 AM | Last Updated on Sat, Sep 2 2017 4:24 PM
Advertisement