డ్రగ్స్ కలకలంపై స్పందించిన సినీ పెద్దలు
హైదరాబాద్లో పట్టుబడ్డ డ్రగ్స్ రాకెట్ విషయంలో పలువురు సినీ ప్రముఖుల ప్రమేయం ఉన్నట్టుగా వచ్చిన వార్తలపై తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు స్పందించారు. కొంత మంది డ్రగ్స్ వాడటం వల్ల మొత్తం ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మా అధ్యక్షుడు శివాజీ రాజాతో పాటు నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, హీరో శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. 'మేం కేవలం పది మంది గురించే మాట్లాడుతున్నాం..ఆ పది మంది వల్లే ఇండస్ట్రీకి నష్టం జరుగుతుంది. ఇప్పటికైనా వారు తమ పద్ధతిని మార్చుకోవాల'ని హెచ్చరించారు. ఈ డ్రగ్స్ వాడకం వల్ల హైదరాబాద్తో పాటు తెలుగు సినీ పరిశ్రమ కూడా తన ఇమేజ్ను కోల్పోతుందన్నారు సురేష్ బాబు. పోలీస్ డిపార్ట్మెంట్ ఈ సమస్య పట్ల చాలా బాధ్యతగా వ్యవహరిస్తుందని.. ఇండస్ట్రీ నుంచి వారికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.