సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని మహిళా ప్రాంగణం పక్కన గల కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఆ భూమిలో కొందరు వ్యక్తులు వెంచర్ వేసి విక్రయాలు జరిపారు. అది ప్రభుత్వ భూమి అని తెలియడంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు గగ్గోలు పెడుతున్నారు.
సంగారెడ్డి పట్టణంలోని సర్వే నంబర్ 203లోగల 11 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం 1982లో ఆల్విన్ పరిశ్రమకు అప్పగించింది. అనంతరం పరిశ్రమ మూతపడటంతో గత కొన్నేళ్లుగా నిరుపయోగంగా ఉంది. పట్టణం వేగంగా విస్తరించడంతో కొందరు వ్యక్తులు ఈ స్థలాన్ని స్వాధీనంలోకి తీసుకొని వెంచర్ వేశారు. అంతర్గత రోడ్లు, విద్యుత్ స్తంభాలు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి పలువురికి ప్లాట్లు విక్రయించారు. స్మితా సబర్వాల్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ వెంచర్‌పై ఫిర్యాదులు అందడంతో సంగారెడ్డి ఆర్డీఓ ధర్మారావును విచారణకు ఆదేశించారు. ఆర్డీఓతోపాటు తహశీల్దార్ గోవర్ధన్ ఈ భూములను సర్వే చేయగా ఆల్విన్ పరిశ్రమకు చెందినట్టుగా రికార్డులున్నట్టు కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. ఇందుకు స్పందించిన ఆమె సర్వే నంబర్ 203లోగల 11 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వ భూమిగా నిర్ధారించారు.
ఇక్కడ ఎలాంటి కట్టడాలు జరపరాదని ఆదేశించారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు బుధవారం అక్కడ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఇది ప్రభుత్వ స్థలమని, క్రయవిక్రయాలు జరపకూడదని అందులో పేర్కొన్నారు. ఈ స్థలం విలువ సుమారు రూ.11 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తమకు నోటీసులు ఇవ్వకుండానే హెచ్చరిక బోర్డు ఎలా ఏర్పాటు చేస్తారంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి రెవెన్యూ సిబ్బందిని నిలదీశాడు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశామని, ఇందులో తమ ప్రమేయం లేదని వారు పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ స్థలం కాదని, తమ వద్ద అన్ని పత్రాలు ఉన్నాయని సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారి చెబుతున్నాడు.
రూ. కోట్లాది విలువైన ప్రభుత్వ భూమి స్వాధీనం
Published Thu, Jan 9 2014 2:48 AM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM
Advertisement