జిల్లాను ఆదర్శంగా నిలపాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మెతుకు సీమను దేశంలోనే ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దాలని సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్లో భాగంగా శనివారం సమీకృత కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆవిష్కరించారు.
అనంతరం ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్మితా సబర్వాల్ మాట్లాడుతూ, మెదక్ జిల్లాలో కేవలం 8 నెలలే కలెక్టర్‌గా పనిచేసినా, ఈ ప్రాంత ప్రజలిచ్చిన సహకారం తనకు ఎల్లప్పుడు గుర్తుంటుందన్నారు. ఇదే స్ఫూర్తితో నవ తెలంగాణ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. ఎంతో పుణ్యం చేస్తేకాని కలెక్టర్‌గా ప్రజలకు సేవ చేసే అవకాశం రాదని, అంతటి భాగ్యం తనకు లభించినందుకు ఎప్పుడూ గర్వంగా ఉంటుందన్నారు. కలెక్టర్‌గా ఉన్న వ్యక్తి బాధ్యతతో పనిచేస్తేనే ప్రజలకు మేలు జరిగి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు.
అర్హులందరికీ ప్రభుత్వ సేవలందినప్పుడే బంగారు తెలంగాణ కల సాకారమవుతుందన్నారు. అందుకు ప్రభుత్వ ఉద్యోగులంతా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. తాను జిల్లాలో ప్రవేశపెట్టిన పథకాలను ఇన్‌చార్జి కలెక్టర్ హోదాలో శరత్ సమర్ధవంతంగా నిర్వహిస్తారన్న నమ్మకం తనకుందన్నారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల నిర్వహణలో, ప్రజాభివృద్ధి కార్యక్రమాల అమలులోనూ జిల్లా యంత్రాంగం అందించిన సహకారానికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఇన్‌చార్జి కలెక్టర్ శరత్ మాట్లాడుతూ, పేదలకు సేవ చేయాలన్న తపన కల్గిన అధికారుల జాబితాలో స్మితా సబర్వాల్ ముందుంటారన్నారు. ప్రజలకోసం పనిచేసే అధికారి దగ్గర పనిచేయడం తనకు గర్వకారణంగా ఉందన్నారు. స్మితా సబర్వాల్ జిల్లాలో అమలు చేస్తున్న ‘మార్పు’, ‘సన్నిహిత’ కార్యక్రమాలు అనతి కాలంలోనే ప్రజలకు చేరువయ్యాయన్నారు. మెదక్ ఆర్డీఓ వనజాదేవి మాట్లాడుతూ, భారతీయ మహిళకు ప్రతిరూపంగా నిలిచిన స్మితా సబర్వాల్ యువతకు మార్గదర్శకంగా ఉన్నారన్నారు. కేవలం జిల్లాకు మాత్రమే పరిమితమైన సబర్వాల్ సేవలను రాష్ట్రంలోని ప్రజలకు అందిచాలన్న ప్రభుత్వ నిర్ణయం చాలా మంచిదన్నారు. ఆమె రాష్ట్రస్థాయిలో పనిచేయడం వల్ల సన్నిహిత, మార్పు లాంటి కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా అమలవుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు, ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పదోన్నతి పొందిన స్మితా సబర్వాల్‌కు పూర్ణకుంభం, బోనాలు, బతుకమ్మలతో స్వాగతం పలికారు.