నిజామాబాద్‌అర్బన్ : జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రస్తుతం కంటికి సంబంధించిన మందుల కొరత ఏర్పడింది. దీంతో రోగులకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. బయట కొనుక్కోవాల్సిందిగా సూచిస్తూ వైద్యులు రోగులకు మందులను రాసిస్తున్నారు. అయితే పేదలైన రోగులు మందులను బయట మెడికల్ షాపుల్లో కొనుక్కోలేక ఇబ్బందులు పడుతున్నారు. కంటి ఆపరేషన్‌ల అనంతరం రోగులకు ఇచ్చే యాంటీ బయాటిక్ మందులు దాదాపు 20 రోజులుగా అందుబాటులో లేవు. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను సంప్రదించగా, తన దృష్టికి రాలేదన్నారు.
కంటి చుక్కలమందు కరువు..
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రతిరోజు 10 నుంచి 15 వరకు కంటి ఆపరేషన్లు జరుగుతాయి. కంటి ఆపరేషన్ అనంతరం రోగులకు కంటిలో ఇన్‌ఫెక్షన్ సోకకుండా ఉండేందుకు యాంటీబయాటిక్ మందులు అయిన గేటిక్విన్, గేట్–పిలను 30 రోజుల పాటు తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఈ మందులు అందుబాటులో లేవు. దీంతో ఆపరేషన్ చేయించుకున్నవారు మందులను బయటనే మెడికల్ షాపుల్లో కొనుగోలు చేస్తున్నారు.
కాగా ఆపరేషన్ చేయించుకున్న నాయికీబాయికి, మరికొందరికి సంబంధిత కంటి వైద్యుడు రెండు యాంటిబయాటిక్ చుక్కల మందులను రాసి ఇచ్చాడు. వీటిని బయట మెడికల్ షాపుల్లో మందులు కొనలేని పేదలు ఇబ్బందులు పడుతున్నారు. కొంతకాలంగా ఆస్పత్రికి మందుల సరఫరా లేదని వైద్య సిబ్బంది ద్వారా తెలిసింది.
నా దృష్టికి రాలేదు
కంటి ఆపరేషన్ చేయించుకున్నవారికి అందించే మందులు కొరతగా ఉందని నా దృష్టికి రాలేదు. సమస్య ఉంటే తక్షణమే మందులను అందుబాటులో ఉంచుతాం. బయట కొనుక్కోవాల్సిందిగా రాయడం సరైంది కాదు. అవసరమైన మందులను మేమే కొనుగోలు చేసి ఉచితంగా అందిస్తాం. రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తాం.
– రాములు, ఆసుపత్రి సూపరింటెండెంట్
Comments
Please login to add a commentAdd a comment