pationts
-
మందుల కొరత
నిజామాబాద్‌అర్బన్ : జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రస్తుతం కంటికి సంబంధించిన మందుల కొరత ఏర్పడింది. దీంతో రోగులకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. బయట కొనుక్కోవాల్సిందిగా సూచిస్తూ వైద్యులు రోగులకు మందులను రాసిస్తున్నారు. అయితే పేదలైన రోగులు మందులను బయట మెడికల్ షాపుల్లో కొనుక్కోలేక ఇబ్బందులు పడుతున్నారు. కంటి ఆపరేషన్ల అనంతరం రోగులకు ఇచ్చే యాంటీ బయాటిక్ మందులు దాదాపు 20 రోజులుగా అందుబాటులో లేవు. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను సంప్రదించగా, తన దృష్టికి రాలేదన్నారు. కంటి చుక్కలమందు కరువు.. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రతిరోజు 10 నుంచి 15 వరకు కంటి ఆపరేషన్లు జరుగుతాయి. కంటి ఆపరేషన్ అనంతరం రోగులకు కంటిలో ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండేందుకు యాంటీబయాటిక్ మందులు అయిన గేటిక్విన్, గేట్–పిలను 30 రోజుల పాటు తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఈ మందులు అందుబాటులో లేవు. దీంతో ఆపరేషన్ చేయించుకున్నవారు మందులను బయటనే మెడికల్ షాపుల్లో కొనుగోలు చేస్తున్నారు. కాగా ఆపరేషన్ చేయించుకున్న నాయికీబాయికి, మరికొందరికి సంబంధిత కంటి వైద్యుడు రెండు యాంటిబయాటిక్ చుక్కల మందులను రాసి ఇచ్చాడు. వీటిని బయట మెడికల్ షాపుల్లో మందులు కొనలేని పేదలు ఇబ్బందులు పడుతున్నారు. కొంతకాలంగా ఆస్పత్రికి మందుల సరఫరా లేదని వైద్య సిబ్బంది ద్వారా తెలిసింది. నా దృష్టికి రాలేదు కంటి ఆపరేషన్ చేయించుకున్నవారికి అందించే మందులు కొరతగా ఉందని నా దృష్టికి రాలేదు. సమస్య ఉంటే తక్షణమే మందులను అందుబాటులో ఉంచుతాం. బయట కొనుక్కోవాల్సిందిగా రాయడం సరైంది కాదు. అవసరమైన మందులను మేమే కొనుగోలు చేసి ఉచితంగా అందిస్తాం. రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తాం. – రాములు, ఆసుపత్రి సూపరింటెండెంట్ -
30వేల మందికి ఒకే ఒక్కడు!
7.91 లక్షల మందికి 26 మంది డాక్టర్లే దిక్కు అక్షరాస్యతలో రాష్ట్ర సగటుకంటే వెనుకడుగు ప్రతి వంద మందిలో 40 మంది నిరక్షరాస్యులే వృద్ధి రేటులో అట్టడుగుస్థాయి నూటికి 90 శాతం సన్న, చిన్నకారు రైతులే ప్రతిపాదిత పెద్దపల్లి జిల్లాలోని గణాంకాలివి సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : 30వేల మందికి ఒక్క డాక్టర్... సగటున వంద మందిలో 40 మంది నిరక్షరాస్యులే. 195 గ్రామాలకే పరిమితమైన జిల్లా. జనాభాలో సగం మంది కూలీ పని చేసుకుని బతికేవాళ్లే... ఒక్క మెడికల్ కాలేజీ లేదు... ప్రతిపాదిత కొత్త జిల్లా పెద్దపల్లి స్వరూపమిది. ప్రతిపాదిత కొత్త జిల్లాల్లో జనాభా, కుటుంబాల సంఖ్య, విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో పరిస్థితిపై జిల్లా ప్రణాళిక విభాగం ప్రభుత్వానికి నివేదిక పంపింది. 2011 గణాంకాల ప్రకారం ఈ వివరాలను కొత్త జిల్లాల వారీగా విభజించింది. అందులో పెద్దపల్లి ప్రతిపాదిత జిల్లా విషయానికొస్తే... 7.91 లక్షల జనాభాతో ఏర్పడిన ఈ జిల్లాలో ప్రభుత్వ, ఆల్లోపతి, ఆయుర్వేద, హోమియో, ప్రకృతి డిస్పెన్సరీ సహా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రులు 27 ఉండగా... అందులో 26 మంది మాత్రమే ప్రభుత్వ, కాంట్రాక్టు డాక్టర్లు పనిచేస్తుండటం గమనార్హం. అంటే ఈ ప్రతిపాదిత జిల్లాలో సగటున 30 వేల మందికి ఒకే ఒక్క సర్కారీ డాక్టర్ సేవలందిస్తున్నాడన్నమాట. ఆయా ఆసుపత్రుల్లో అన్ని కలిపితే కేవలం 102 పడకలు మాత్రమే ఉండటం విశేషం. ఇక అక్షరాస్యతలోనూ ఈ జిల్లాలో రాష్ట్ర సగటు కంటే బాగా వెనుకబడింది. రాష్ట్రవ్యాప్తంగా అక్షరాస్యత సగటు 66.54 శాతం ఉండగా... ఈ జిల్లాలో 60.07 శాతానికే పరిమితమైంది. అంటే పెద్దపల్లి జిల్లాలో సగటున ప్రతి వంద మందిలో 40 మంది చదువురానివాళ్లే ఉన్నారు. ఈ జిల్లాలో 2.08 లక్షల కుటుంబాలుండగా... అందులో 1,53,917 మంది దళితులు, 14,945 మంది మాత్రమే గిరిజన జనాభా ఉండటం విశేషం. జిల్లాలో 1,27,851 భూకమతాలుండగా.... అందులో 1.15 లక్షల మందికి పైగా సన్న, చిన్నకారు రైతులే ఉండటం గమనార్హం. వృద్ధి రేటులో ఈ జిల్లా రాష్ట్ర సగటుతో పోలిస్తే చాలా వెనుకబడి ఉంది. 2011 గణాంకాల ప్రకారం తెలంగాణ సగటు వృద్ధి రేటు 13.58 శాతం నమోదు కాగా.. ప్రతిపాదిత పెద్దపల్లి జిల్లాలో మాత్రం 5.3 శాతం మాత్రమే నమోదైనట్లు ప్రణాళిక విభాగ గణాంకాలు చెబుతున్నాయి. పెద్దపల్లితో పోలిస్తే ప్రస్తుత కరీంనగర్ జిల్లా అంతటా కలిపి నమోదైన వృద్ధిరేటు 8.15 శాతం. ఇక మండలాలు, గ్రామాల విషయానికొస్తే... కొత్త మండలం అంతర్గాంతో కలిపి కేవలం 12 మండలాలతోనే ఏర్పడుతున్న ఈ జిల్లా పరిధిలోకి 195 రెవెన్యూ గ్రామాలు మాత్రమే వస్తుండటం గమనార్హం. -
జిల్లాపై జ్వరాల పంజా
కిటకిటలాడుతున్న ఆస్పత్రులు జ్వరపీడితులతో నిండిన వార్డులు గంట గంటకు పెరుగుతున్న రోగుల సంఖ్య మంకమ్మతోట : జ్వరాలతో జిల్లా వణుకుతోంది. బాధితులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఎక్కడ చూసినా యువకులు, పిల్లలు, వృద్ధులు అని తేడాలేకుండా జ్వరపీడితులే కనిపిస్తున్నారు. రోజురోజుకు ఓపీతోపాటు ఇన్ పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే 600లకు పైగా ఇన్ పేషెంట్లుగా ఉండగా ఓపీ 800లకు దాటుతోంది. ఇవేకాకుండా ఎమర్జెన్సీ సేవలు రోజుకు ఓపీ 100, ఇన్‌పేషెంట్లు మరో 50వరకు చేరుతున్నారు. వీరంతా విషజ్వరాలతో బాధపడుతున్న వారే. ఆస్పత్రిలోని మేల్, ఫిమేల్ వార్డుతోపాటు పిల్లల వార్డు కూడా రోగులతో నిండిపోయి కనిపిస్తున్నాయి. వార్డుల్లోని బెడ్లు నిండిపోవడంతో వరండాల్లో వందకు పైగా అదనగా తాత్కాలిక బెడ్లు ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారు. ఇవి కూడా చాలక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బెడ్లు లేకపోవడంతో ఖాళీ అయ్యే వరకు పడిగాపులు కాస్తున్నారు. గంగాధర మండలం ఉప్పరిమల్యాలకు చెందిన జవ రాజిరెడ్డి(55) 12రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. తీవ్ర జ్వరం కారణంగా శ్వాసతీసుకోవడం కష్టంగా మారి నిలుబడటానికి ఒంట్లో శక్తి లేదు. స్థానికంగా వైద్యం చేయించుకున్నా ఫలితం లేకపోవడంతో పరీక్షలు చేయించారు. విషజ్వరం కారణంగా ప్లేట్లేట్ తగ్గిపోయాయని పరిస్థితి ప్రమాదకరంగా ఉందని అక్కడి వైద్యుల సూచించారు. అక్కడి నుంచి 108లో ఆస్పత్రికి వచ్చాడు. రిపోర్టు పరిశీలించిన డాక్టర్ బెడ్‌పై ఉండాలని రాశాడు. అక్కడ నుండి పై అంతస్తులోని మేల్ వార్డుకువచ్చాడు. అక్కడ బెడ్లు ఖాళీ లేవని సిబ్బంది తెలుపడంతో రెండుగంటలు వరండాలో వేచిఉన్నాడు. ప్లేట్లేట్స్ తగ్గిపోయాయి – పతంగి శివకృష్ణ నేను పది రోజులుగా విషజ్వరంతో బాధపడుతున్నా. వ్యాధి నిర్ధారణలో డెంగీ అని చెప్పారు. బెడ్లు ఖాళీ లేవని వరండాల్లో వేశారు. మూడు రోజులు అవుతున్నా వరండా నుంచి వార్డులోకి మార్చడం లేదు. దోమలతో ఇబ్బంది పడుతున్న. ఆస్పత్రి దుర్భరంగా ఉంది – సాగర్ల మహేందర్, బెగులూరు ప్రభుత్వ ఆస్పత్రి వాతావరణం దుర్భరంగా ఉంది. మ ఊరంతా జ్వరాలే. అందరూ ఆస్పత్రుల్లో చేరారు. డబ్బులున్న వారు ప్రైవేటు ఆస్పత్రులో వైద్యం చేయించుకుంటున్నరు. మా బంధువులను ఇక్కడ చేర్పించిన ఐదు రోజులు అవుతున్నా పరిస్థితిలో మార్పులేదు. ప్లేట్లేట్ 17వేలు మాత్రమే ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. -
పేరుకే పెద్దాసుపత్రి
ఇబ్బందులు పడుతున్న రోగులు జగిత్యాల ఆస్పత్రి దుస్థితి జగిత్యాల అర్బన్ : జగిత్యాల ప్రాంతంలో వర్షాకాల సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రజలు చికిత్సల కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. పట్టణాలతో పాటు గ్రామాల్లో డెంగ్యూ, డయేరియా, విరేచనాలు, విష జ్వరాలు వస్తున్నాయి. రోగాలతో బాధపడుతూ ప్రభుత్వాసుపత్రికి వచ్చిన వారికి మందులు సరిగా అందడం లేదు. దీంతో పేదలకు సర్కారు వైద్యం అందని ద్రాక్షగానే మిగులుతోంది. జగిత్యాల ప్రాంతంలో ప్రజలకు వైద్యసేవలు అందించడానికి 100 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. సర్కారు వైద్యం కోసం 14 మండలాల ప్రజలతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి కూడా పేదలు ఏరియా అస్పత్రికి వస్తుంటారు. నిత్యం సుమారు 600 మంది ఔట్ పేషెంట్లుగా 100 నుంచి 150 మంది వరకు ఇన్ పేషెంట్లు గా చికిత్స పొందుతారు. వ్యాధుల సీజన్ కావడంతో ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చికిత్సకోసం ఇక్కడికి వచ్చే వారికి మందులతో పాటు ప్లూయిడ్స్ లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యాధులు నయం కాకపోవడంతో ప్రైవేటు అస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. కరీంనగర్ సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ నుంచి మూడు నెలలకొకసారి రూ. 7.20 లక్షల మందులను సరఫరా చేస్తారు. సీజనల్ వ్యాధులతో రోగుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ మందులు సరిపోవడం లేదు. యాంటిబయాటిక్స్, జెంటామైసిన్, ఫ్లూయిడ్స్ సరిగా పంపిణీ కాకపోవడంతో వ్యాధులు నయం కావడం లేదు. ప్లూయిడ్స్ కరువు : వర్షాకాలంలో డయేరియా, వైరల్ ఫీవర్ ఎక్కువగా వస్తుంటాయి. చికిత్సలో భాగంగా రోగికి ముందుగా ఫ్లూయిడ్స్ పెడుతారు. విరేచనాలైనప్పుడు వాడే రింగర్ లక్టేట్ (ఆర్ఎల్) ఫ్లూయిడ్ అవసరంకాగా ఇవి ఆస్పత్రిలో లేవు. దీంతో రోగులు బయట కొనుగోలు చేయాల్సి వస్తుంది.