30వేల మందికి ఒకే ఒక్కడు!
-
7.91 లక్షల మందికి 26 మంది డాక్టర్లే దిక్కు
-
అక్షరాస్యతలో రాష్ట్ర సగటుకంటే వెనుకడుగు
-
ప్రతి వంద మందిలో 40 మంది నిరక్షరాస్యులే
-
వృద్ధి రేటులో అట్టడుగుస్థాయి
-
నూటికి 90 శాతం సన్న, చిన్నకారు రైతులే
-
ప్రతిపాదిత పెద్దపల్లి జిల్లాలోని గణాంకాలివి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : 30వేల మందికి ఒక్క డాక్టర్... సగటున వంద మందిలో 40 మంది నిరక్షరాస్యులే. 195 గ్రామాలకే పరిమితమైన జిల్లా. జనాభాలో సగం మంది కూలీ పని చేసుకుని బతికేవాళ్లే... ఒక్క మెడికల్ కాలేజీ లేదు... ప్రతిపాదిత కొత్త జిల్లా పెద్దపల్లి స్వరూపమిది. ప్రతిపాదిత కొత్త జిల్లాల్లో జనాభా, కుటుంబాల సంఖ్య, విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో పరిస్థితిపై జిల్లా ప్రణాళిక విభాగం ప్రభుత్వానికి నివేదిక పంపింది. 2011 గణాంకాల ప్రకారం ఈ వివరాలను కొత్త జిల్లాల వారీగా విభజించింది. అందులో పెద్దపల్లి ప్రతిపాదిత జిల్లా విషయానికొస్తే... 7.91 లక్షల జనాభాతో ఏర్పడిన ఈ జిల్లాలో ప్రభుత్వ, ఆల్లోపతి, ఆయుర్వేద, హోమియో, ప్రకృతి డిస్పెన్సరీ సహా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రులు 27 ఉండగా... అందులో 26 మంది మాత్రమే ప్రభుత్వ, కాంట్రాక్టు డాక్టర్లు పనిచేస్తుండటం గమనార్హం. అంటే ఈ ప్రతిపాదిత జిల్లాలో సగటున 30 వేల మందికి ఒకే ఒక్క సర్కారీ డాక్టర్ సేవలందిస్తున్నాడన్నమాట. ఆయా ఆసుపత్రుల్లో అన్ని కలిపితే కేవలం 102 పడకలు మాత్రమే ఉండటం విశేషం. ఇక అక్షరాస్యతలోనూ ఈ జిల్లాలో రాష్ట్ర సగటు కంటే బాగా వెనుకబడింది. రాష్ట్రవ్యాప్తంగా అక్షరాస్యత సగటు 66.54 శాతం ఉండగా... ఈ జిల్లాలో 60.07 శాతానికే పరిమితమైంది. అంటే పెద్దపల్లి జిల్లాలో సగటున ప్రతి వంద మందిలో 40 మంది చదువురానివాళ్లే ఉన్నారు. ఈ జిల్లాలో 2.08 లక్షల కుటుంబాలుండగా... అందులో 1,53,917 మంది దళితులు, 14,945 మంది మాత్రమే గిరిజన జనాభా ఉండటం విశేషం. జిల్లాలో 1,27,851 భూకమతాలుండగా.... అందులో 1.15 లక్షల మందికి పైగా సన్న, చిన్నకారు రైతులే ఉండటం గమనార్హం. వృద్ధి రేటులో ఈ జిల్లా రాష్ట్ర సగటుతో పోలిస్తే చాలా వెనుకబడి ఉంది. 2011 గణాంకాల ప్రకారం తెలంగాణ సగటు వృద్ధి రేటు 13.58 శాతం నమోదు కాగా.. ప్రతిపాదిత పెద్దపల్లి జిల్లాలో మాత్రం 5.3 శాతం మాత్రమే నమోదైనట్లు ప్రణాళిక విభాగ గణాంకాలు చెబుతున్నాయి. పెద్దపల్లితో పోలిస్తే ప్రస్తుత కరీంనగర్ జిల్లా అంతటా కలిపి నమోదైన వృద్ధిరేటు 8.15 శాతం. ఇక మండలాలు, గ్రామాల విషయానికొస్తే... కొత్త మండలం అంతర్గాంతో కలిపి కేవలం 12 మండలాలతోనే ఏర్పడుతున్న ఈ జిల్లా పరిధిలోకి 195 రెవెన్యూ గ్రామాలు మాత్రమే వస్తుండటం గమనార్హం.