నగరి: చిత్తూరు జిల్లా నగరి పర్యటనకు వచ్చిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుగు ప్రయాణంలో నగరి డిగ్రీ కళాశాల హెలిపాడ్ వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సత్వరమే ప్రభుత్వం తరఫున న్యాయం చేయాలని కలెక్టర్ ఎస్.షణ్మోహన్‌కు ఆదేశాలిచ్చారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు యంత్రాంగం గంటల వ్యవధిలోనే ఆయా సమస్యలను పరిష్కరించింది.
మానవత్వంతో ఆదుకున్నారు
నగరి మండలం మిట్టపాలెంకు చెందిన ఎ.నాగరాజు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తన కిడ్నీలు పని చేయడం లేదని.. డయాలసిస్ చేయించుకోవడానికి ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీకాళహస్తికి చెందిన ముస్లిం మహిళ తన ఆరేళ్ల కుమారుడు రెహమాన్‌తో సీఎం జగన్‌ను కలిసింది. తన కుమారుడు బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని.. వైద్యం కోసం ఖర్చయిన బిల్లులను మంజూరు చేయాలని వేడుకుంది.
కార్వేటినగరం గొల్లకండ్రిగకు చెందిన చందు అనే బాలిక తన తండ్రితో వచ్చి సీఎం జగన్‌ను కలిసింది. తాను బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నానని.. వైద్యం కోసం వెచ్చించిన బిల్లులను మంజూరు వేడుకుంది. శ్రీకాళహస్తి మండలం తూకివాకం గ్రామానికి చెందిన ఐశ్వర్య సీఎం వైఎస్ జగన్‌ను కలిసి తన ఇద్దరు బిడ్డల ఆరోగ్య సమస్యను వివరించి ఆదుకోవాలని కోరింది.
వీరందరికీ మెరుగైన వైద్యం అందించాలని.. వైద్య ఖర్చుల కోసం వెచ్చించిన మొత్తాలను తిరిగి చెల్లించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. తక్షణం స్పందించిన కలెక్టర్ ఎస్.షణ్మోహన్ ఎ.నాగరాజుకు రూ.లక్ష, రెహమాన్‌కు రూ.లక్ష, ఎం.చందుకు రూ.50 వేలు, ఐశ్వర్యకు రూ.లక్ష చొప్పున చెక్కులు అందజేశారు.
ఉపాధి నిమిత్తం ఆర్థిక సాయం
విజయపురం మండలం పన్నూరుకు చెందిన కె.షణ్ముగం, నగరి మండలం నెత్తం కండ్రిగకు చెందిన గజేంద్ర, మత్తయ్య అనే దివ్యాంగులతోపాటు ఎస్‌ఆర్ పురం మండలం పుల్లూరు హరిజనవాడకు చెందిన ఎన్.సుమిత్ర సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. స్వయం ఉపాధి నిమిత్తం ఆర్థిక సాయం అందించాలని వేడుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో షణ్ముగంకు రూ.లక్ష, ఎం.గజేంద్ర రూ.50 వేలు, జి.మత్తయ్య రూ.50 వేలు, ఎన్.సుమిత్ర రూ.లక్ష చొప్పున చెక్కు రూపంలో ఆర్థిక సాయం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment