లెక్క తప్పింది!
* వికటించిన ‘ఔషధ’నగరి
* తగ్గిన ఫార్మాసిటీ విస్తీర్ణం
* భూ సర్వే ముచ్చర్లకే పరిమితం
* అందులోనూ ప్రైవే టు, అసైన్డ్ భూములు
* సర్కారుకు నికరంగా 1,623 ఎకరాలు మాత్రమే
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఔషధ నగరిపై ప్రభుత్వ అంచనాలు తలకిందులయ్యాయి. 13వేల ఎకరాల విస్తీర్ణంలో ప్రతిపాదించిన ఫార్మాసిటీకి భూ లభ్యత ప్రతిబంధకంగా మారింది. కేవలం 1,623 ఎకరాలు మాత్రమే ఔషధనగరికి అనుకూలంగా ఉందని జిల్లా యంత్రాంగం తేల్చింది. కందుకూరు మండ లం ముచ్చర్ల ప్రాంతంలో రసాయన, ఔషధనగరి ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఫార్మా దిగ్గజాలతో కలిసి విహంగ వీక్షణం చేశారు.
ఔషధ సంస్థల అధినేతలు అడిగిందే తడ వు.. 13వేల ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫార్మాసిటీని నిర్మిస్తామని ప్రకటించారు. తక్షణమే గుర్తించిన భూములను టీఐఐసీకి బదలాయించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆగమేఘాల మీద భూముల సర్వే నిర్వహించిన రెవెన్యూ అధికారులకు చావు కబురు చల్లగా తెలిసింది. ముందు అనుకున్నట్లు గుర్తించిన భూములుకాకుండా.. సర్వేను ముచ్చర్లలోని సర్వే నంబర్ 288కే పరిమితం చేయాలని సూచింది.
దీంతో ఈ సర్వేనంబర్ పరిధిలోని భూములను సర్వే చేసిన యంత్రాం గం తేలిన లెక్కతో బిత్తరపోయింది. ఈ సర్వే నంబర్ పరిధిలో రెవెన్యూ రికార్డుల ప్రకారం 2,746 ఎకరాలు ఉండాల్సివుండగా, అందులో 460 ఎకరాలు గల్లంతైంది. (ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్) ఈటీఎస్ సర్వేలో కేవలం 2,286 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు తేలింది. సంప్రదాయ సర్వేకు ఈటీఎస్ సర్వేకు కొంతమేర వ్యత్యా సం రావడం సహజమేనని అధికారయంత్రాంగం సమర్థించుకుం టోంది.
అసలే భూ లభ్యత లెక్క తప్పిందని జుట్టుపీక్కుంటున్న రెవెన్యూ గణానికి అందులోనూ పట్టా భూములు ఉండడం మరిం త చికాకు తెప్పిస్తోంది. 381 ఎకరాల మేర ప్రైవేటు వ్యక్తుల సాగుబడిలో ఉండగా, 282 ఎకరాలను ప్రభుత్వం గతంలో పేదలకు పంపిణీ చేసింది. ఇవన్నీ పోగా ప్రభుత్వానికి నికరంగా మిగిలేది 1,623 ఎకరాలు మాత్రమే. పట్టా, ప్రభుత్వ అసైన్డ్ భూములు కూడా గుర్తించిన సర్వే నంబర్ అంతర్భాగంలో ఉండడంతో భూ సేకరణ తప్పనిసరి.
ఈ క్రమంలో అసైన్డ్ భూములను సేకరించాలంటే 1307 కింద ఎక్స్‌గ్రేషియా చెల్లించాల్సివుంటుంది. ప్రైవేటు పట్టాదారులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాల్సివుంటుంది. ఈ పరిణామాల నేపథ్యంలో యంత్రాంగం భూ లభ్యతపై తర్జనభర్జనలు పడుతోంది. పక్కనే ఉన్న సాయిరెడ్డినగర్‌లోని సర్వే నం.155లోని భూమినీ పరిశీలించినప్పటికీ, అందులోనూ ఇవే సమస్యలు ఇమిడి ఉండడంతో పక్కనపెట్టింది.
ఊపు తగ్గించిన సర్కారు..
ఫార్మాసిటీపై దూకుడుగా వెళ్లిన సర్కారు.. ప్రస్తుతం ఊపు తగ్గించినట్లు కనిపిస్తోంది. ప్రతిపాదిత విస్తీర్ణాన్ని కుదించడం, నెలరోజులైనా భూముల సర్వేపై లెక్క తేల్చకపోవడం పరిశీలిస్తే.. ఔషధనగరిపై ప్రభుత్వం వైపు నుంచి మునుపటి స్పందన రావడంలేదని జిల్లా యంత్రాంగం అంటోంది.
ఫార్మారంగ అధినేతల తో ఏరియల్ సర్వే నిర్వహించిన తర్వాత వరుసగా మూడు రోజులు ఈ ప్రాజెక్టు పురోగతిపై సీఎం సమీక్షా సమావేశాలు నిర్వహించారు. అంతర్జాతీయ కన్సల్టెన్సీకి ఈ సిటీ డిజైన్‌చేసే బాధ్యత అప్పగించనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ, ఫార్మాసిటీ నిర్మాణం మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి అన్న చందంగా మారింది.