సాక్షి, హైదరాబాద్: నకిలీ మందుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విజ్ఞప్తి చేసింది. నకిలీ మందులు ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారాయని, ఈ నేపథ్యంలో వీటిని అరికట్టడంలో భాగంగా పలు సూచనలు చేసింది.
► ప్రజలను మోసం చేయడానికి కొన్ని ప్రముఖ బ్రాండ్‌లను పోలి ఉండేలా నకిలీ మందులు తయారు చేస్తున్నారు. వీటిలో అవసరమైన పదార్థాలేవీ ఉండవు. సుద్ద, మొక్కజొన్న పిండి లేదా బంగాళాదుంప పిండి మొదలైనవి కలిగి ఉన్నట్టు తమ పరిశీలనలో వెల్లడైనట్టు తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది.
► నకిలీ మందులు రోగి ఆరోగ్యాన్ని తీవ్ర ప్రమాదంలో పడేస్తాయి. ఇవి వ్యాధిని నయం చేయడంలో విఫలం కావడమే కాకుండా, కాలక్రమేణా రోగికి వినాశకరమైన పరిణామాలు సృష్టిస్తాయి.
► కొన్ని నకిలీ మందులు చూడటానికి అసలు ఉత్పత్తికి దాదాపు సమానంగా ఉంటాయి. వాటిని గుర్తించడం కష్టం. అనుమానిత నకిలీ ఔషధం, అసలైన ఔషధం మధ్య తేడాలను గుర్తించడానికి అనుమానాస్పద ఉత్పత్తిని అదే కంపెనీకి ముందు ఉపయోగించిన ఉత్పత్తితో సరిపోల్చండి. మునుపటి ప్యాకేజింగ్‌తో సరిపోల్చడానికి ప్రయత్నించండి. అనుమానం వస్తే భవిష్యత్‌లో పోలిక కోసం మీరు ఉత్పత్తిని తరచుగా ఉపయోగిస్తుంటే దయచేసి దాని ఫొటోగ్రాఫ్ తీసుకోండి. మందులు కచ్చితత్వంతో తయారు చేస్తారు. కాబట్టి పరిమాణం, బరువు, రంగు, నాణ్యతలో ఏదైనా వైవిధ్యం నకి లీని సూచిస్తుంది. స్పెల్లింగ్ తప్పులు లేదా వ్యాకరణ దోషాలు ఉంటాయి. త యారీ తేదీ, గడువు తేదీని తనిఖీ చేయండి. టాబ్లెట్‌లు బాటిల్‌లో ఉంటే అన్ని టాబ్లెట్‌లు ఒకేలా కనిపించాలి. మాత్రలు చిప్ లేదా పగుళ్లు లేదా తప్పు పూత కలిగి ఉంటే, ఆ ఉత్పత్తులను కూడా అనుమానాస్పదంగా పరిగణించాలి.
► పేరున్న కంపెనీలతో ఉత్పత్తి ధరను తనిఖీ చేయండి. ఇది మరింత చౌకగా లేదా భారీ తగ్గింపుతో అందిస్తే అది నకిలీ ఉత్పత్తి కావొచ్చని అనుమానించాలి. కేంద్ర ప్రభుత్వం 300 ప్రముఖ బ్రాండ్ పేర్లను గత ఆగస్టు తర్వాత తయారు చేసింది. దాని ప్రాథమిక ప్యాకేజింగ్ లేబుల్‌పై బార్కోడ్ లేదా క్విక్ రెస్పాన్స్ కోడ్ ఉంటుంది. ప్యాకేజింగ్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి.
► మెడికల్ షాపులో కొనుగోలు చేసిన మందుల బిల్లులను పట్టుబట్టి తీసుకోవాలి. వెబ్‌సైట్‌లు లేదా ఇతర ఇంటర్నెట్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి మందులు కొనుగోలు చేయవద్దు. లైసెన్సు ఉన్న మెడికల్ షాపుల నుంచి మాత్రమే మందులను కొనుగోలు చేయాలి. నకిలీ మందుల వివరాలను టోల్ ఫ్రీ నంబర్ 18005996969కు ఫోన్ చేసి చెప్పవచ్చు.
నకిలీ డ్రగ్స్ లేని రాష్ట్రంగా మార్చేందుకు....
మార్కెట్‌లో నకిలీ డ్రగ్స్ తరలింపును గుర్తించేందుకు పలుచోట్ల తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. నకిలీ డ్రగ్స్ లేని రాష్ట్రంగా మార్చడానికి అధికారులు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. డిసెంబర్‌లో బొల్లారంలోని ఒక గోడౌన్‌లో కేన్సర్ నిరోధక మందులు( నకిలీవి) స్వాధీనం చేసుకున్నారు. కొరియర్ ద్వారా ఉత్తరప్రదేశ్‌లోని కాశీపూర్, ఉత్తరాఖండ్, ఘజియాబాద్ నుంచి రాష్ట్రంలోకి నకిలీ డ్రగ్స్ ప్రవేశానికి సంబంధించిన నకిలీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు. అధికారులు జరిపిన దాడుల్లో నకిలీ డ్రగ్స్‌ని గుర్తించి, స్వాధీనం చేసుకున్న నకిలీ మందుల్లో సన్ ఫార్మా (అధిక కొలెస్ట్రాల్ చికిత్సలో ఉపయోగించే రోసువాస్ 10 టాబ్లెట్లు) వంటి ప్రముఖ కంపెనీల పేర్లతో తప్పుడు లేబుల్‌లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment