
సాక్షి, అమరావతి: నకిలీ ఔషధాలపై కొరడా ఝుళిపించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా నిర్మాణాత్మక చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఔషధ నియంత్రణపై సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. నకిలీ మందులపై కట్టడి కోసం డ్రగ్ కంట్రోల్‌లో విజిలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ విభాగం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. చర్చించిన అంశాలకు సంబంధించి నెలరోజుల్లో కార్యాచరణ, ప్రణాళిక తీసుకురావాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ సందర్భంగా మార్కెట్లో నకిలీ మందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఆదేశాలు, సూచనలిలా ఉన్నాయి..
► ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే నకిలీ ఔషధాలను అరికట్టాల్సిందే. డ్రగ్ కంట్రోల్ కార్యకలాపాలు బలోపేతం చేయాలి.
► ఇందుకోసం కఠినమైన నిబంధనలు తీసుకురావాలి.
► డ్రగ్ తయారీ యూనిట్లలోనూ నాణ్యతపై కూడా దృష్టిపెట్టాలి.
► జరిమానాలు విధించేందుకు వీలుగా చట్టంలో నిబంధనలు తీసుకురావాలి.
► మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో గొప్ప విధానాలు ఉండేలా చూడాలి. థర్డ్ పార్టీ తనిఖీలు జరగాలి.
► మందుల దుకాణాల వద్దే ఫిర్యాదు ఎవరికి.. ఏ నంబర్‌కు చేయాలన్న సమాచారం ఉంచాలి.
► ప్రభుత్వాస్పత్రుల్లో కూడా క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలి.
► నకిలీ మందుల తయారీ, విక్రయంపై సమాచారమిచ్చే వారికి రివార్డులు ఇవ్వాలి.
► అలాగే, ప్రజల నుంచి, ఇతరత్రా వ్యక్తుల నుంచి నిరంతరం ఫిర్యాదులు స్వీకరించాలి.
► విజయవాడలో ఉన్న ల్యాబ్‌తోపాటు నిర్మాణంలో ఉన్న కర్నూలు, విశాఖపట్నం ల్యాబ్‌ల్లో సామర్థ్యం పెంచాలి. దీంతో.. ఏడాదికి 2వేల నుంచి 13వేల శాంపిళ్లకు సామర్థ్యం పెంచుతున్నట్లు అధికారుల వివరణ.
కాగా, ఈ సమీక్షలో డ్రగ్స్ అండ్ కాపీరైట్ డైరెక్టర్ జనరల్ రవిశంకర్ నారాయణ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment