
సాక్షి, అమరావతి: విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన ఎప్పుడు మొదలవుతుందనే అంశంపై కొంత కాలంగా సాగుతున్న చర్చకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెరదించారు. విశాఖపట్నంలోనూ సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసి, దసరా నుంచి పరిపాలన ప్రారంభిద్దామని మంత్రులకు స్పష్టం చేశారు. సీఎం కార్యాలయం మొదలు వివిధ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలను గుర్తించేందుకు అధికారులతో ఒక కమిటీ వేస్తామని చెప్పారు. ఇక్కడి నుంచి విశాఖపట్నంకు కార్యాలయాల తరలింపునకు అధికారులతో మరో కమిటీ వేస్తామన్నారు.
దసరాలోగా కార్యాలయాలను తరలించి.. పండుగ రోజునే విశాఖ కేంద్రంగా పరిపాలన మొదలు పెడతామని చెప్పారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో బుధవారం సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. అజెండాలోని అంశాలపై చర్చ ముగిశాక సమావేశం నుంచి అధికారులు నిష్క్రమించారు.
ఆ తర్వాత మంత్రులతో సీఎం వైఎస్ జగన్ సమకాలీన రాజకీయ పరిస్థితులపై చర్చించారు. దసరా పండుగను విశాఖపట్నంలోనే జరుపుకుందామని మంత్రులతో సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఆ రోజు నుంచి విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన మొదలు పెడతామనడంతో మంత్రులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
చంద్రబాబు అక్రమాలను సాక్ష్యాధారాలతో వివరిద్దాం
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్టు చేయడంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. గురువారం నుంచి నిర్వహిస్తున్న శాసనసభ సమావేశాలను సీరియస్‌గా తీసుకోవాలని మంత్రులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. శాసనసభ వేదికగా అవసరమైతే టీడీపీ సర్కార్ హయాంలో చంద్రబాబు పాల్పడిన అక్రమాలపై.. స్కిల్ స్కామ్ నుంచి ఫైబర్ గ్రిడ్ కుంభకోణం వరకు అన్నింటిపై చర్చిద్దామన్నారు.
టీడీపీ సభ్యులు శాసనసభ సమావేశాలకు హాజరవుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వ అక్రమాలను సాక్ష్యాధారాలతోసహా ప్రజలకు వివరించడానికి సమావేశాలను ఉపయోగించుకుందామని ఉద్భోదించారు. కేంద్ర ప్రభుత్వం కొంత కాలంగా ప్రతిపాదిస్తున్న వన్ నేషన్.. వన్ ఎలక్షన్ విధానాన్ని సీఎం వైఎస్ జగన్ దృష్టికి మంత్రులు తీసుకెళ్లగా.. జమిలి ఎన్నికలపై కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దామన్నారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చిన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందామని పిలుపునిచ్చారు. ఎన్నికలకు మరో ఐదు నెలలు మాత్రమే సమయం ఉందనే అంశాన్ని మంత్రులకు సీఎం గుర్తు చేస్తూ.. ప్రజల్లో విస్తృతంగా తిరగాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ 52 నెలలుగా మనం చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించాలని.. అదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు పాల్పడిన అక్రమాలను కళ్లకు కట్టినట్లు వివరించి.. ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలన్నారు.
సీఎం ఎక్కడి నుంచి పాలిస్తే అదే రాజధాని
దసరా నుంచి విశాఖపట్నం నుంచి పరిపాలన మొదలు పెడదామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. సీఎం ఎక్కడి నుంచి పరిపాలిస్తే అదే రాజధాని. వికేంద్రీకరణతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమన్నది మా విధానం. విశాఖపట్నంలో సీఎం కార్యాలయం నుంచి వివిధ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు తగిన భవనాలను గుర్తించేందుకు అధికారులతో కమిటీ వేస్తామని సీఎం చెప్పారు. దసరా నుంచి విశాఖే పరిపాలన రాజధాని.
– గుడివాడ అమర్‌నాథ్, పరిశ్రమల శాఖ మంత్రి.
Comments
Please login to add a commentAdd a comment