రాష్ట్రంలో దసరా అమ్మకాల జోష్‌ | Market bustle in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో దసరా అమ్మకాల జోష్‌

Published Sun, Oct 22 2023 5:59 AM | Last Updated on Sun, Oct 22 2023 5:59 AM

Market bustle in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: దసరా పండుగ వచ్చేసింది. రాష్ట్రవ్యాప్తంగా శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. మరో ఇరవై రోజుల్లో దీపావళి పండుగ ఉంది. దీంతో రాష్ట్రమంతా పండగ వాతావరణం నెలకొంది. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనతో అన్ని రంగాలూ అభివృద్ధి చెందుతున్నాయి.  దీంతో ప్రజల్లో కొనుగోలు శక్తి కూడా పెరిగింది. ప్రజలు జోరుగా పండగ షాపింగ్‌ చేస్తున్నారు.

ముఖ్యంగా వ్రస్తాలు, బంగారం, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్‌ దుకాణాలు, వాహ­నాల షోరూమ్‌లు కిటకిటలాడుతున్నాయి. పలు వ్యాపార సంస్థలు వివిధ రకాల ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. ప్రజల్లో కొనుగోళ్ల శక్తి పెరిగిందనడానికి ఈ అమ్మకాలే నిదర్శనమని వ్యాపారులు చెబుతున్నారు. దసరాకు తోడు పెళ్లిళ్ల సీజన్‌ జత కావడంతో ఊహించిన దానికంటే అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయని నెల్లూరుకు చెందిన రుక్మిణి సిల్‌్క్స ప్రతినిధి మురళి ‘సాక్షి’కి తెలిపారు. 

‘బంగార’మైనా కొనాల్సిందే.. 
పండుగలకు తోడు పెళ్లిళ్లు కూడా ఉండటంతో బంగారం విక్రయాలు కూడా జోరుగా సాగుతున్నాయి. పలు జ్యూవెలరీ సంస్థలు భారీ ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. సెప్టెంబర్‌ నెలలో బంగారం ధరలు తగ్గిపోవడంతో ప్రజలు పండుగ, పెళ్లిళ్ల కొనుగోళ్లు ముందుగానే చేసినట్లు బంగారం వ్యాపారులు చెబుతున్నారు. సెప్టెంబర్‌ నెలలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,000 నుంచి రూ.53,000కు పడిపోయిందని, అందువల్ల అప్పు­డు ఎక్కువగా నగలు కొన్నారని బంగారం వ్యాపారి మోహన్‌ రెడ్డి తెలిపారు. మళ్లీ ధర పెరగడంతో అమ్మకాలు కొంత తగ్గాయి. ప్రపంచ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు ఇప్పట్లో తగ్గవన్న సంకేతాలు వెలువడుతుండటంతో తిరిగి అమ్మకాలు పెరుగుతున్నాయని మోహన్‌ రెడ్డి చెప్పారు. 

రిటైల్‌ సంస్థల భారీ ఆఫర్లు 
రిటైల్‌ సంస్థలు వినియోగదారులను ఆకర్షించడానికి పలు ఆఫర్లను ప్రకటించడమే కాకుండా భారీగా ప్రచారం చేపట్టాయి. గతేడాదికంటే ఈ ఏడాది అమ్మకాలు బాగున్నాయని ఏసీలు, టీవీలు, వాషింగ్‌ మెషీన్లు, రిఫ్రిజరేటర్లు వంటి వస్తువులకు భారీగా డిమాండ్‌ ఉందని సోనోవిజన్‌ ప్రతినిధి తెలిపారు. సాధారణంగా ఈ సమయంలో ఏసీల అమ్మకాలు తక్కువగా ఉంటాయని, కానీ ఈ ఏడాది మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వీటికి డిమాండ్‌ ఉందని తెలిపారు. 

ఇదే సమయంలో అమెజాన్, ఫ్లిఫ్‌కార్ట్‌ వంటి ఆన్‌లైన్‌ రిటైల్‌ సంస్థలు కూడా భారీ ఆఫర్లు ప్రకటించడంతో ఆన్‌లైన్‌ అమ్మకాలు కూడా జోరుమీద కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆరి్థక వ్యవస్థను పరుగులు పెట్టించే విధంగా తీసుకుంటున్న చర్యలకు తోడు ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగేలా పలు పథకాలను ప్రవేశపెట్టడంతో అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయని, దీనికి రాష్ట్ర జీఎస్టీలో నమోదవుతున్న రెండంకెల వృద్ధి రేటే నిదర్శనమని రాష్ట్ర పన్నుల ప్రధాన అధికారి గిరిజా శంకర్‌ చెప్పారు. 

దూసుకుపోతున్న ఆటోమొబైల్‌ మార్కెట్‌  
 దసరా–దీపావళి పండుగల సీజన్‌లో ఆటోమొబైల్‌ మార్కెట్‌ దూసుకుపోతోందని డీలర్లు చెబుతున్నారు. గతేడాది దసరా–దీపావళి సీజన్‌లో 73,240 ద్విచక్ర, 7,772 కార్ల అమ్మకాలు జరిగాయని, ప్రస్తుత మార్కెట్‌ ట్రెండ్‌ చూస్తుంటే ఈ సీజన్‌లో అమ్మకాలు భారీగా జరిగే అవకాశాలున్నాయని   విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 33,094 బైక్‌లు, 4,212 కార్ల అమ్మకాలు జరిగాయని చెప్పారు. ఈ రెండు పండుగల సమయంలో బైక్‌ల అమ్మకాలు లక్షకు పైగా పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. కోవిడ్‌ తర్వాత  దెబ్బతిన్న మార్కెట్‌ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోందంటున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement