![Identification of buildings in Visakhapatnam - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/1/ys%20jagan.jpg.webp?itok=EqJyTD38)
సాక్షి, అమరావతి: విశాఖలో సీఎం క్యాంపు ఆఫీసు కోసం గుర్తించిన వివిధ భవనాల వివరాలను అధికారుల కమిటీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తెలిపింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగంగా ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి పర్యవేక్షణ, సమీక్ష సమావేశాల నిర్వహణకు విశాఖలో క్యాంపు కార్యాలయం చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో విశాఖలో గుర్తించిన భవనాల వివరాలను సీఎం వైఎస్ జగన్‌కు కమిటీ వివరించింది.
రాష్ట్ర ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు సహా, ఇతర అధికారులు తమ కార్యకలాపాలు నిర్వహించడానికి అవసరమైన భవనాలను కూడా గుర్తించామని అధికారుల కమిటీ సీఎంకు తెలిపింది. విశాఖలో ఇప్పటికే వివిధ ప్రభుత్వ విభాగాలు, వాటి కార్యాలయాలు 2,27,287 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయని కమిటీ గుర్తించింది. వీటిలో సీనియర్ అధికారులకు అవసరమైన క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. వారి వసతికి కూడా ఆయా విభాగాల పరిధిలో ఉన్నవాటిని వినియోగించుకోవచ్చని వెల్లడించింది.
ఐటీ హిల్‌పై ఉన్న మిలీనియం టవర్‌లో అందుబాటులో ఉన్న 1,75,516 అడుగుల విస్తీర్ణంలో మిగిలిన సీనియర్ అధికారులు క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొంది. ఇంకా కొంతమంది అధికారుల కోసం, వారి కార్యాలయాల కోసం మరికొన్ని ప్రైవేటు భవనాలను గుర్తించామని సీఎం వైఎస్ జగన్‌కు వివరించింది. ఈ మేరకు 3,98,600 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని గుర్తించామని తెలిపింది. ప్రభుత్వంలోని సీనియర్ అధికారుల కార్యకలాపాలు, వారి వసతి కోసం ప్రభుత్వ భవనాలు, ప్రైవేటు భవనాల్లో మొత్తం 8,01,403 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని గుర్తించామని చెప్పింది.
ముఖ్యమంత్రి కోసం ఐదు రకాల భవనాలు..
కాగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, వసతి కోసం ఐదు రకాల భవనాలను గుర్తించినట్టు కమిటీ వెల్లడించింది. ఆంధ్రా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఓపెన్ వర్సిటీ బ్లాకులు, సిరిపురంలోని వీఎంఆర్‌డీఏ భవనాలు, మిలీనియం ఎ–టవర్, మిలీనియం బి–టవర్, రుషికొండలోని టూరిజం రిసార్టులను గుర్తించామని వివరించింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, వసతి, అధికారులతో సమావేశాల కోసం సరిపడా గదులు, భద్రతా సిబ్బంది ఉండేందుకు సదుపాయాలు, ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని కమిటీ తెలిపింది.
ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా, పౌరులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా, ముఖ్యమంత్రికి భద్రత తదితర అంశాలను పరిగణన లోకి తీసుకుంటున్నామని స్పష్టం చేసింది. అంతేకాకుండా ముఖ్యమంత్రి రాకపోకల సమయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ట్రాఫిక్ సమస్య లేకుండా చూశామని తెలిపింది. అదే సమయంలో సౌలభ్యతను కూడా దృష్టిలో ఉంచుకున్నామని చెప్పింది.
రుషికొండ రిసార్టులు అనుకూలం..
ట్రాఫిక్ దృష్ట్యా, యూనివర్సిటీ అకడమిక్ కార్యకలాపాలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో యూనివర్సిటీ భవనాలను పరిగణనలోకి తీసుకోలేదని కమిటీ వెల్లడించింది. అలాగే వీఎంఆర్‌డీఏ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున రద్దీ ఉంటుందని, చుట్టూ పెద్ద ఎత్తున వ్యాపార సంస్థలు ఉన్నందున భద్రతాపరంగా ఇబ్బంది ఉందని తెలిపింది. సీఎం క్యాంపు కార్యాలయం ఇక్కడ పెడితే వారందరికీ ఇబ్బందులు వస్తాయని, అధికారులకు సరైన వసతి కూడా దీనికి సమీపంలో లేదని వెల్లడించింది.
అలాగే మిలీనియం టవర్‌లో ఒక దాంట్లో ఇప్పటికే కొన్ని కంపెనీలు నడుస్తున్నాయని, రెండో టవర్ కూడా ఆఫీసుకు సరిపోయినా, సీఎం వసతికి సరిపోదని, భద్రతా కారణాల వల్ల కూడా అంత అనుకూలత లేదని తేల్చింది. రుషికొండ వద్ద నిర్మించిన రిసార్టుల కోసం నిర్మించిన భవనాలు సీఎం క్యాంపు కార్యాలయం కోసం అత్యంత అనుకూలంగా ఉన్నాయని అధికారుల కమిటీ నిర్ధారించింది. వీఐపీల రాకపోకల వల్ల పౌరులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా, నగరంలో ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఈ భవనాలు ఉన్నాయని, పార్కింగ్, ఆఫీసు, వసతి, భద్రతా సిబ్బందికి, సీఎం సెక్రటరీల కార్యకలాపాలకు, ఈ భవనాలు సరిపోతాయని సూచించింది.
అలాగే హెలిప్యాడ్ కూడా సమీపంలోనే ఉందని, దీనివల్ల నగరంలో ట్రాఫిక్‌కు, పౌరులకు కూడా ఎలాంటి ఇబ్బందిలేకుండా ఉంటుందని వెల్లడించింది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని నివేదికను ఖరారుచేస్తున్నామని అధికారుల కమిటీ తెలిపింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు శ్రీలక్ష్మి, షంషేర్‌సింగ్ రావత్, జీఏడీ సర్విసులు, హెచ్‌ఆర్ సెక్రటరీ పోలా భాస్కర్, సీఎంఓ అధికారులు.. పూనం మాలకొండయ్య, ధనుంజయరెడ్డి, ముత్యాలరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment