![YS Jagan provided financial assistance to all three - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/03/6/aid.jpg.webp?itok=tCtCzuU0)
అనారోగ్యంతో బాధపడుతున్న ముగ్గురికి సాయం చేయాలని సీఎం ఆదేశం
వెంటనే సాయం అందించిన రెవెన్యూ అధికారులు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): విజన్ విశాఖ, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంగళవారం విశాఖ వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని జిల్లాకు చెందిన ముగ్గురు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆ ముగ్గురికీ తక్షణమే ఆర్థిక సాయం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. వెంటనే జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున చెక్కులను సమకూర్చగా.. రెవెన్యూ అధికారులు బాధితుల ఇళ్లకు వెళ్లి ఆర్థిక సాయం అందజేశారు.
వివరాల్లోకి వెళితే.. ఎండాడకు చెందిన మద్దాల జ్యోతి సీఎంను కలిసి తన భర్త మద్దాల రాంబాబు బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నారని.. వైద్యం కోసం ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేసింది. పీఎం పాలెంకు చెందిన యు.ఉమాదేవి తన 15 ఏళ్ల కుమారుడు ప్రసన్నకుమార్ రెండేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడని.. సాయం చేయాలని సీఎంకు విన్నవించుకుంది. ఎండాడ సుభాష్ నగర్‌కు చెందిన బాసిత్తు వసంతకుమారి తన భర్త పెంటారావు బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతున్నారని మొరపెట్టుకుంది.
అలాగే తన కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించాలని ఆమె అభ్యర్థించింది. బాధితులందరికీ ఆర్థిక సాయం అందించటంతో పాటు మెరుగైన వైద్య చికిత్స చేయించాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. దీంతో కలెక్టర్ మల్లికార్జున తక్షణ చర్యలు చేపట్టారు. విశాఖ రూరల్ తహసీల్దార్, ఇతర అధికారులను బాధితుల ఇళ్ల వద్దకే పంపించి ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున చెక్కులను అందజేయించారు.
Comments
Please login to add a commentAdd a comment