Visakha: నేటి నుంచి ‘మిలాన్‌’ మెరుపులు  | All set for international naval maneuvers | Sakshi
Sakshi News home page

విశాఖపట్నం: నేటి నుంచి ‘మిలాన్‌’ మెరుపులు 

Published Mon, Feb 19 2024 4:48 AM | Last Updated on Mon, Feb 19 2024 8:44 AM

All set for international naval maneuvers - Sakshi

సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ విన్యాసాలకు వేదికగా నిలిచేందుకు విశాఖ మహానగరం సిద్ధమైంది. 2022లో ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ, మిలాన్‌–2022ని వరుసగా నిర్వహించి ప్రపంచ దేశాలకు సత్తాచాటిన విశాఖ మహా నగరం... తాజాగా ప్రతిష్టాత్మక మిలాన్‌–2024 విన్యాసాలకు ఆతిథ్యం ఇవ్వనుంది. సోమవారం నుంచి ఈ నెల 27వ తేదీ వరకు జరిగే మిలాన్‌ విన్యాసాల్లో 50కి పైగా దేశాలు పాల్గొననున్నాయి.

మిలాన్‌ విన్యాసాల్లో కీలకమైన సిటీ పరేడ్‌ను ఈ నెల 22వ తేదీన ఆర్కే బీచ్‌లో నిర్వహించనున్నారు. ఈ పరేడ్‌కు ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. మిలాన్‌–2024 విన్యాసాలను ‘కమరడెరీ(స్నేహం)–కొహెషన్‌ (ఐక్యత)–కొలాబరేషన్‌(సహకారం)’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. 

ఇప్పటి వరకు 11 ‘మిలాన్‌’లు.. 
వివిధ దేశాల మధ్య సహృద్భావ వాతావరణం, స్నేహ పూర్వక సత్సంబంధాలను మెరుగుపరుచుకోవడంతోపాటు శత్రు సైన్యాలకు తమ బలం, బలగం గురించి తెలియజేసేందుకు ‘మిలాన్‌’ పేరుతో 1955 నుంచి విన్యాసాలు నిర్వహిస్తున్నారు. తొలిసారి జరిగిన విన్యాసాల్లో భారత్, ఇండొనేషియా, సింగపూర్, శ్రీలంక, థాయ్‌లాండ్‌ దేశాలు మాత్రమే పాల్గొన్నాయి.

ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహించే ‘మిలాన్‌’లో ఏటా దేశాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2005లో సునామీ రావడం వల్ల మిలాన్‌ విన్యాసాలు రద్దు చేయగా.. 2001, 2016 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూలు నిర్వహించడం వల్ల ఈ విన్యాసాలు జరగలేదు.

ఈ విన్యాసాల్లో 2010 వరకు 8 దేశాలు మాత్రమే పాల్గొనగా.. 2012లో అనూహ్యంగా 16 దేశాలు పాల్గొన్నాయి. 2022లో విశాఖలో నిర్వహించిన విన్యాసాల్లో 35 దేశాలు పాల్గొనగా, 2023లో అండమాన్‌లో జరిగిన విన్యాసాల్లో 30 దేశాలు పాల్గొన్నాయి. ఈసారి ఏకంగా 50కి పైగా దేశాలు పాల్గొంటున్నాయి.
 
సాగర తీరంలో వివిధ దేశాల నౌకాదళాల సందడి
భారత నౌకాదళ ఆహ్వానం మేరకు మిలాన్‌–2024లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాల నౌకాదళాలతో విశాఖ సాగర జలాలు కిటకిటలాడుతున్నాయి.

భారత్‌తో­పాటు యూఎస్‌ఏ, రష్యా, జపాన్, యూకే, ఆ్రస్టేలియా, సింగపూర్, దక్షిణాఫ్రికా, ఇండొనేషియా, ఫ్రాన్స్, ఈజిప్‌్ట, శ్రీలంక, వియత్నాం, మొజాంబిక్, సూడాన్, ఇజ్రాయిల్, ఖతర్, థాయ్‌లాండ్, మలేషియా, సోమాలియా, కెన్యా, మయన్మార్, న్యూజిలాండ్, టాంజానియా, కొమరోస్, మాల్దీవులు, బ్రూనే, ఫిలిప్పీన్స్, సౌదీ అరేబియా, ఒమన్, కాంబోడియా, దక్షిణ కొరియా, కువైట్, ఇరాన్, మడగాస్కర్, బంగ్లాదేశ్, బహ్రెయిన్, యూఏఈ, జిబౌటీ, ఎరిత్రియా, మారిషస్, సీషెల్స్, ఫిజీ, టోంగా, టోగో, పెరూ తదితర 50దేశాలకు చెందిన యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్‌లు, హెలికాఫ్టర్లు, యుద్ధ విమానాలు విశాఖ చేరుకుంటున్నాయి.

ఈ చరిత్రాత్మకమైన ఈవెంట్‌ను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విశాఖ నగర ప్రజలకు తూర్పు నౌకాదళాధికారులు విజ్ఞప్తి చేశారు.  

మిలాన్‌–2024 కార్యక్రమాలు ఇలా...  
♦ మొదటగా ఈ నెల 19 నుంచి 23 వరకు హార్బర్‌ ఫేజ్‌ విన్యాసాలు నిర్వహిస్తారు. 
♦ 19న తొలి రోజు ప్రీ సెయిల్‌ డిస్కషన్స్, టేబుల్‌ టాప్‌ ఎక్సర్‌సైజ్‌ బ్రీఫింగ్స్, అతిథులకు ఐస్‌ బ్రేకర్‌ డిన్నర్‌ ఉంటాయి. 
♦   20న హెల్త్‌ ట్రెక్, ఆగ్రా, తాజ్‌మహాల్‌ సందర్శన, యంగ్‌ ఆఫీసర్ల ఆత్మీయ కలయిక ఉంటాయి. ఆర్‌కే బీచ్‌లో సిటీ పరేడ్‌ రిహార్సల్స్‌ నిర్వహిస్తారు.  
♦  21న క్రీడాపోటీలు, మేరీటైమ్‌ టెక్నికల్‌ ఎక్స్‌పో–2024 ప్రారం¿ోత్సవం, భారత యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ విజిట్, ద్వైపాక్షిక విన్యాసాలు, వివిధ దేశాల ప్రతినిధుల సిటీ టూర్, మిలాన్‌ విన్యాసాలు ప్రారం¿ోత్సవం, మిలాన్‌ విలేజ్‌ ప్రారంభ కార్యక్రమాలు ఉంటాయి. 
♦ 22న అంతర్జాతీయ మేరీటైమ్‌ సెమినార్‌ ప్రారంభం, ప్రీసెయిల్‌ డిస్కషన్స్, సిటీ టూర్, ఆర్‌కే బీచ్‌లో ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ నిర్వహించనున్నారు. 
♦  23న బుద్ధగయ పర్యటన, సిటీ టూర్‌తో హార్బర్‌ ఫేజ్‌ విన్యాసాలు ముగుస్తాయి.  
♦  24 నుంచి 27 వరకు వివిధ దేశాలకు చెందిన యుద్ధ నౌకలు, హెలికాప్టర్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, సబ్‌మెరైన్స్‌తో సీఫేజ్‌ విన్యాసాలు నిర్వహిస్తారు.  
♦   28న వివిధ దేశాల యుద్ధ నౌకల నిష్క్రమణ 
♦ ఈసారి విన్యాసాల్లో భారత నౌకాదళానికి చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌ షిప్స్‌ ఐఎన్‌ఎస్‌ విక్రాంత్, ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement