రెండు మూడు రోజుల్లో తేదీ ప్రకటిస్తాం
రాష్ట్రంలో ఫ్యాన్ గాలి బలంగా వీచింది
ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమమే విజయం వైపు తీసుకెళుతోంది
మహిళలంతా వైఎస్సార్‌సీపీ వైపే
చంద్రబాబు కుయుక్తులు పనిచేయలేదు
మంత్రి బొత్స సత్యనారాయణ
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో పోలింగ్ సరళి చూస్తుంటే ఫ్యాన్ గాలి బలంగా వీచిందని, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. రెండు మూడు రోజుల్లో ప్రమాణ స్వీకారానికి తేదీ కూడా ప్రకటిస్తామని చెప్పారు. ఆయన మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే నెల 4వ తేదీన ఊహించని ఫలితాలు రానున్నాయని చెప్పారు. రాజకీయాల్లో నిజాయితీ, హామీల అమలు ముఖ్యమని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఇలాంటి ప్రమాణాలు పాటిస్తూ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు.
ఈ ఐదేళ్ల పాలనలో సీఎం జగన్ చేసిన సంక్షేమం, అభివృద్ధి వైఎస్సార్‌సీపీని విజయం వైపు తీసుకెళ్తోందని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరి మద్దతు సీఎం వైఎస్ జగన్‌కే ఉందని, వారంతా వైఎస్సార్‌సీపీకే ఓటు వేశారని తెలిపారు. లబ్ధి పొందిన ప్రతి మహిళా మళీ సీఎంగా వైఎస్ జగన్ కావాలని కోరుకుంటున్నారన్నారు. మళ్లీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, వృద్ధులకు ఇంటికే పింఛన్ అందుతుందని, అవినీతి లేకుండా నేరుగా బ్యాంకు ఖాతాల్లో సంక్షేమ పథకాల ఆర్థిక సహాయం అందుతుందని భావించి ఓట్లు వేశారన్నారు.
చంద్రబాబు అధికార దాహంతో అనేక రకాల కుయుక్తులకు పాల్పడ్డాడని, స్థాయికి తగని తప్పుడు భాష వాడారని తెలిపారు. వ్యక్తిగతంగా కుటుంబంపై దూషణలు చేశాడన్నారు. పోలింగ్‌కు ఒక రోజు ముందు తాను వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసినట్లు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టించిన దౌర్భగ్యుడు చంద్రబాబు అని మండిపడ్డారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై ప్రజల్లో ఆందోళన కలిగించేందుకు కుటిల యత్నాలు చేశాడని తెలిపారు. చివరికి పోలింగ్ రోజు కూడా వైఎస్సార్‌సీపీ వారిపై దాడులు చేయించాడన్నారు.
ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా చంద్రబాబు ఓటమి ఖాయమైందని, ఆయనకు ఓటమి భయం పట్టుకుందని చెప్పారు. ఫలితాలు వచ్చే వరకూ చాలా విధాలుగా వైఎస్సార్‌సీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా టీడీపీ వారితో మాట్లాడిస్తాడని, ఎవరూ ఉద్రిక్తతకు లోనుకాకుండా సంయమనం పాటించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగితేనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాల అభివృద్ధి గురించి ఆలోచించాలన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తే సహించబోహని కరాఖండిగా చెప్పారు.
ఓటర్లలో చైతన్యం చూశాం: బొత్స ఝాన్సీ
వైఎస్సార్‌సీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మి మాట్లాడుతూ గత 35 రోజులుగా ప్రచారంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు, జగనన్న అభిమానులు, విశాఖ ప్రజలు, వైఎస్సార్‌సీపీకి ఓటు వేసిన ప్రతి ఓటరుకూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సోమవారం జరిగిన పోలింగ్‌లో మహిళా ఓటర్లలో చైతన్యం చూశామని, ఉదయం నుంచే మహిళలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారని చెప్పారు.
గత ఎన్నికలకంటే ఎక్కువగా పోలింగ్ జరిగిందన్నారు. జగనన్న ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందనడానికి ఇది సూచిక అని తెలిపారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు కూడా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment