అప్‌డేట్స్:
► సీఎం వైఎస్ జగన్ విశాఖపట్నం పర్యటన ముగించుకుని సాయంత్రం 8 గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడ బయల్దేరారు.
► ఐఎన్‌ఎస్ విశాఖపట్నం మీద డాల్ఫిన్ లైట్‌హౌస్, డాల్ఫిన్ నోస్, కృష్ణజింకను ముద్రించినందుకు సీఎం వైఎస్ జగన్ ధన్యవాదాలు తెలిపారు. విశాఖ ది సిటీ ఆఫ్ డెస్టినీ అని అన్నారు.
► సిటీ పరేడ్‌లో 39 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారని సీఎం జగన్ తెలిపారు. ఇది అరుదైన వేడుక, విన్యాసాల పండగ అని అన్నారు. ఇటీవల తూర్పు నౌకాదళ స్థావరంలో ఐఎన్‌ఎస్ విశాఖ చేరిందని తెలిపారు. ఈ విన్యాసాల్లో పాల్గొన్న అందరికీ సీఎం జగన్ అభినందనలు తెలియజేశారు.
► మిలాన్-2022 ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. విశాఖపట్నంలో మిలాన్-2022 నిర్వహించడం గర్వకారణమని తెలిపారు. విశాఖ చరిత్రలో ఇవాళ గర్వించదగ్గ రోజు అని అన్నారు.
► మిలాన్-2022 ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌ను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 39 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆర్కే బీచ్‌లో నేవీ ఆధ్వర్యంలో పరేడ్ ప్రారంభమైంది. సముద్ర యుద్ధ విన్యాసాలు, గగనతల వాయుసేన విన్యాసాలను ప్రదర్శించారు.
సముద్రతీరంలో నావికా దళం అబ్బురపరిచే విన్యాసాలు:
6000 అడుగుల ఎత్తులో 6 మంది ఆకాశంలో త్రివర్ణ పతకంతో విన్యాసాలు చేశారు. యుద్ధ విమానాలు గర్జనల, నావికా సిబ్బంది యుద్ధ విన్యాసాలు, నావికదళ సిబ్బంది రీస్క్యు ఆపరేషన్, ప్రమాదంలో ఉన్నవారిని రక్షించే సాహసాలు, యుద్ద విమానాలు చక్కర్లు, సముద్రంలో బాంబుల మోతా, ఆపదలో ఉన్నవారిని కాపాడే సాహసం, సముద్రం తీరంలో వాహనాలతో శత్రువులపై ఛేజింగ్, మిషన్ గన్స్‌తో శత్రువులను వెంటాడే విధానం, శత్రువులు వెన్నులో వణుకు పుట్టించె విధంగా ధైర్యసాహసాల ప్రదర్శన, మిత్ర దేశాలతో పరస్పరం సహకరించుకొనే విధంగా విన్యాసాలు, యుద్ద నౌకల నుంచి గురి తప్పని టార్గెట్, సముద్ర తీరంలో హెలికాప్టర్ల గస్తీ విన్యాసాలును ప్రదర్శించారు.
► ఆర్కే బీచ్‌లో నేవీ ఆధ్వర్యంలో సాయంత్రం పరేడ్ జరగనుంది. మిలాన్-2022 ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. గంటన్నరపాటు జరిగే సముద్ర యుద్ధ విన్యాసాలు, గగనతల వాయుసేన విన్యాసాలను సీఎం జగన్ వీక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో 39 దేశాల ప్రతినిధులు, 13 దేశాల యుద్ధనౌకల సిబ్బంది పాల్గొంటారు.
► ఐఎన్‌ఎస్ విశాఖ యుద్ధ నౌకను సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేశారు.
► నేవల్ డాక్‌యార్డ్‌లో ఐఎన్‌ఎస్ వేలా జలాంతర్గామిని సీఎం వైఎస్ జగన్ సందర్శించారు.
► విశాఖపట్నంలోని తూర్పు నావికాదళ కేంద్రానికి సీఎం వైఎస్ జగన్ దంపతులు చేరుకున్నారు. సీఎం వైఎస్ జగన్‌కు తూర్పు నావికా దళం గౌరవ వందనం చేసింది.
► ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం చేరుకున్నారు. మిలాన్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు.
సాక్షి, విశాఖపట్నం: అలలతో పోటీపడుతూ భారత నావికా దళ సామర్థ్యాల్ని ప్రదర్శించే వేడుకకు విశాఖ నగరం సిద్ధమైంది. అంతర్జాతీయ విన్యాసాల వేదిక మిలాన్–2022లో కీలకమైన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌ను బీచ్ రోడ్డులో ఘనంగా నిర్వహించేందుకు నౌకాదళం, జిల్లా యంత్రాంగం పూర్తి ఏర్పాట్లుచేశాయి. కార్యనిర్వాహక రాజధాని నగరం పేరుతో రూపుదిద్దుకున్న ఐఎన్‌ఎస్ విశాఖపట్నం యుద్ధనౌకను జాతికి అంకితం చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఈ సిటీ పరేడ్‌ను ప్రారంభించనున్నారు.
నౌకాదళ విభాగంలో కీలకమైన మిలాన్‌లో ఇండియన్ నేవీ సహా 39 దేశాలు పాల్గొంటున్నాయి. ఇందులో ముఖ్యఘట్టమైన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ జరగనుంది. వివిధ దేశాల నౌకాదళాలు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించనున్నాయి. ఈ యుద్ధవిన్యాసాల సంరంభాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment