గ్రోత్ కారిడార్‌గానూ వృద్ధి
పుష్కలంగా వనరులు, వసతులు
సీఎం వైఎస్ జగన్ పాలనలో వైజాగ్‌కు మహర్దశ
‘విజన్ విశాఖ కాంక్లేవ్’లో నిపుణులు
సాక్షి, విశాఖపట్నం: ‘అమెరికాలోని సిలికాన్ వ్యాలీకి దీటుగా విశాఖ రూపుదిద్దుకుంటోంది. ఆ దిశగా అభివృద్ధిలో శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రపంచస్థాయి ప్రఖ్యాత నగరాలతో పోటీపడేందుకు అవసరమైన అన్ని వనరులు, మౌలిక వసతులు, హంగులు, సదుపాయాలు ఈ నగరానికి ఉన్నాయి. ఈ నాలుగేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో వైజాగ్‌కు మహర్దశ పట్టింది. గ్రోత్ కారిడార్‌గానూ వృద్ధి చెందుతోంది. పరిపాలనా రాజధాని అయ్యాక అభివృద్ధిలో మరింత వేగం పుంజుకుంటుంది. రూ.వేల కోట్ల పెట్టుబడులతో విశాఖ మహానగరం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది.
రానున్న పదేళ్లలో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలతో పోటీ పడేలా ఎదుగుతుంది’ అని ‘విజన్ విశాఖ కాంక్లేవ్’లో విద్యారంగ నిపుణులు, పారిశ్రామికవేత్తలు, మేధావులు పేర్కొన్నారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆంధ్రా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ.. అమెరికా సిలికాన్ వ్యాలీ జీడీపీ వృద్ధిలో అగ్రగామిగా ఉందని, విశాఖపట్నం కూడా అందుకు తీసికట్టు కాదని చెప్పారు. అక్కడ అభివృద్ధిలో స్టాన్‌ఫోర్డు యూనివర్సిటీ మాదిరిగానే ఇక్కడ ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) కూడా దోహదపడుతోందని, సీఎం వైఎస్ జగన్ సహకారంతో ఏయూలో గొప్ప మార్పులు తీసుకొచ్చామని పేర్కొన్నారు.
‘విశాఖలో భారీ పరిశ్రమలు, స్టీల్‌ప్లాంట్, షిప్‌యార్డు, తూర్పు నావికదళ ప్రధాన కేంద్రం, బీహెచ్‌ఈఎల్, పోర్టులతోపాటు రోడ్డు, రవాణా సదుపాయాలు మెండుగా ఉన్నాయి. వేలాది ఎంఎస్‌ఎంఈలు ఉన్నాయి. భోగాపురం ఎయిర్‌పోర్టు, అదానీ డేటా సెంటర్, బీచ్ కారిడార్‌లు వస్తున్నాయి. విశాఖ–హైదరాబాద్, విజయవాడ–కడప–బెంగళూరులకు హైస్పీడ్ రైల్ కారిడార్ కోసం ప్రధానితో చర్చిస్తానని సీఎం చెప్పారు. అడగకుండానే విశాఖ అభివృద్ధికి తపించే ముఖ్యమంత్రి మనకున్నారు. ఆయనకు మనమంతా సహకరిద్దాం. రూ.వేల కోట్ల పెట్టుబడులతో విశాఖ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది.
గ్రోత్ కారిడార్‌గా మారుతుంది. వచ్చే పదేళ్లలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలతో విశాఖ పోటీ పడుతుంది’ అని ప్రసాదరెడ్డి వివరించారు. కాంక్లేవ్‌లో ఏయూ రిజిస్ట్రార్ ఎం.జేమ్స్ స్టీఫెన్, ఇన్ఫినిటం మీడియా సీఈవో రాహుల్ రాఘవేంద్ర, స్టూడెంట్ ట్రైబ్ సీఈవో సాయిచరణ్, విశాఖ ఆటోనగర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పాండురంగ ప్రసాద్, ఐఐఎం విశాఖ ఫీల్డ్ సీఈవో గుహేష్ రామనాథన్, ఏయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు.
విశాఖకు ప్రచారం అక్కర్లేదు
విశాఖకు ప్రచారం అక్కర్లేదు. ఇక్కడి వారంతా వైజాగ్‌కు బ్రాండ్ అంబాసిడర్లే. ఇక్కడ ప్రఖ్యాత పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈలు, కేంద్ర ప్రభుత్వ, రక్షణరంగ సంస్థలు, విద్యా సంస్థలు ఎన్నో ఉన్నాయి. విశాఖ ఎందరికో మంచి అవకాశాలు కల్పిస్తోంది. అందుకే ఈ నగరం వేగంగా అభివృద్ధి చెందుతోంది. – బీకే సాహు, చైర్మన్, నేషనల్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
ఆకర్షణీయ నగరం
విశాఖ పెట్టుబడులను ఆకర్షించే నగరం. ఇక్కడ ఉన్నన్ని వనరులు రాష్ట్రంలో మరెక్కడా లేవు. అన్ని రవాణా సదుపాయాలూ ఉన్నాయి. ఇన్ని అవకాశాలు ఉండటంతో పరిశ్రమలు పెద్దసంఖ్యలో ఏర్పాటవుతున్నాయి. వ్యాపార ఉన్నతికి విశాఖ భాగ్యనగరం. – ఆంజనేయవర్మ, వైస్ ప్రెసిడెంట్, ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్
విశాఖ అభివృద్ధికి జగన్ కృషి
పుష్కలమైన వనరులతో ఇప్పటికే విశాఖ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందింది. మంచి కనెక్టివిటీ ఉంది. ఇప్పటివరకు రాష్ట్రాన్ని మంచిగా ఐదారుగురు ముఖ్యమంత్రులు పాలించారు. వీరిలో ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ స్ట్రాంగ్ లీడర్. రాష్ట్రంతోపాటు విశాఖ అభివృద్ధికిపాటు పడుతున్నారు. – డి.సూర్యప్రకాశరావు, వీసీ, డీఎస్‌ఎన్ లా విశ్వవిద్యాలయం
Comments
Please login to add a commentAdd a comment