హరిత రిసార్ట్‌ల స్థానంలో వీటిని నిర్మించాం
ఈ ప్రపంచ స్థాయి నిర్మాణాలు విశాఖకే తలమానికం
ఇందులో సీఎం క్యాంపు కార్యాలయం ఉంటే మంచిదని త్రిమెన్ కమిటీ సూచించింది
మంత్రులు ఆర్‌కే రోజా, గుడివాడ అమర్‌నాథ్
రుషికొండ రీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుని ప్రారంభించిన మంత్రులు
హాజరైన శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలోని రుషికొండపై నిర్మించిన భవనాలను ఏ విధంగా వినియోగించాలన్న అంశంపై త్వరలోనే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకుంటారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా వెల్లడించారు. రుషికొండపై నిర్మించిన ఆ భవనాలను విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతితో కలిసి మంత్రులు అమర్‌నాథ్, రోజా, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు అమర్‌నాథ్, రోజా మీడియాతో మాట్లాడుతూ.. రుషికొండపై 9.88 ఎకరాల్లో టూరిజం ప్రాజెక్టు నిర్మించామని, గతంలో ఈ ప్రాంతంలో ఉన్న హరిత రిసార్టుల స్థానంలో ఈ నిర్మాణాలు జరిగాయన్నారు.
అత్యంత సుందరమైన విశాఖ నగరానికి తగ్గట్లుగా పూర్తి అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ భవన నిర్మాణాలు సాగాయని తెలిపారు. పర్యాటకంగా విశాఖను తీర్చిదిద్దడంలో భాగంగా రూపుదిద్దుకున్న ఈ భవనాలు నగరానికే తలమానికమన్నారు. ఈ భవన నిర్మాణాలకు అనేక అడ్డంకులు కల్పించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ అనేక కుట్రలు పన్నాయని, వాటన్నింటినీ దాటుకుంటూ ప్రాజెక్టును పూర్తిస్థాయి అనుమతులతో పూర్తిచేశామని వారు వివరించారు.
విశాఖపట్నం రాజధానిగా చేయాలని సంకల్పించిన సీఎం వైఎస్ జగన్ ఈ విషయంపై ఇప్పటికే ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో త్రీమెన్ కమిటీని ఏర్పాటుచేశారన్నారు. ఇందులో సీఎం క్యాంపు కార్యాలయం ఉంటే మంచిదని ఆ కమిటీ సూచించిందని మంత్రి రోజా అన్నారు. అయితే, ఈ భవనాల్ని పూర్తిగా పర్యాటకం కోసం వినియోగించాలా? లేదా ముఖ్యమంత్రి కార్యాలయంగా ఉపయోగించాలా? అన్న అంశంపై త్వరలోనే స్పష్టత వస్తుందని మంత్రి అమర్‌నాథ్ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఏపీటీడీసీ చైర్మన్ డా.ఎ. వరప్రసాదరెడ్డి, జెడ్పీ చైర్మన్ సుభద్ర, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, కె.రవిబాబు, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి డా.రజత్‌భార్గవ, మేనేజింగ్ డైరెక్టర్ కె.కన్నబాబు, జేసీ కె.మయూర్ అశోక్, పర్యాటక శాఖ ఆర్.డి. శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్ లొడగల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
ప్రాజెక్టు వివరాలివీ..
♦ నూతన రిసార్ట్స్‌ని 9.88 ఎకరాల విస్తీర్ణంలో 1,48,413 చ.అడుగుల విస్తీర్ణంలో ఏడు బ్లాకులుగా నిర్మించారు.
♦ అంతర్జాతీయ ప్రమాణాలతో పచ్చదనం, ల్యాండ్ స్కేపింగ్ పనులతో వీటిని అభివృద్ధి చేశారు. రహదారులు, డ్రైనేజీ, నీటిసరఫరా, వీధిదీపాలు, పార్కింగ్, ఇతర మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేశారు.
♦ 2021లో సీఆర్‌జెడ్ ఆమోదం, 2022లో స్థానిక సంస్థల ఆమోదం, 2023లో అగ్నిమాపక శాఖ ఎన్‌ఓసీ కూడా తీసుకోవడంతో పాటు సంబంధిత చట్టబద్ధమైన ఆమోదాలు తీసుకున్నారు.
♦ వేంగి–ఏ, బీ, కళింగ, గజపతి, విజయనగర ఏ, బీ, సీ బ్లాకులుగా మొత్తం ఏడు బ్లాక్‌లు నిర్మించారు. వీటిల్లో రిసెప్షన్, రెస్టారెంట్లు, బ్యాంక్వెట్ హాల్స్, గెస్ట్‌రూమ్‌లు, ప్రీమియం విల్లా సూట్స్, స్పా, ఇండోర్ గేమ్స్, ఫిట్‌నెస్ సెంటర్, బ్యాక్‌ఆఫీస్, సర్వీస్ ఏరియాలు అభివృద్ధి చేశారు.
♦ నీటి సరఫరా సౌకర్యం కోసం 150 కేఎల్, ఫైర్ సంప్, పైప్ నెట్‌వర్క్‌తో పాటు 100 కేఎల్ డొమెస్టిక్ సంప్ ఏర్పాటుచేశారు.
♦ వ్యర్థ జలాల శుద్ధి, పునర్వినియోగం కోసం 100 కేఎల్‌డీ మురుగునీటి శుద్ధి ప్లాంట్ కూడా నిర్మించారు.
♦ 1,000 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లు 2, 1010 కేవీఏ జనరేటర్లు 3, ఎలక్ట్రికల్ కాంపోనెంట్ పనులు, వీధిదీపాలు ఏర్పాటుచేశారు.
♦ రిసార్ట్ అభివృద్ధికి స్థలం చదును చేయడం, నిర్మాణం, మౌలిక సదుపాయాలు.. ఇలా మొత్తం ప్రాజెక్టుకు రూ.365.24 కోట్లు ఖర్చుచేశారు.
♦ వేంగి–ఏ బ్లాక్‌లో సెక్యూరిటీ, బ్యాక్ ఆఫీస్, సూట్ రూమ్‌లు, రెస్టారెంట్స్ ఉన్నాయి.
♦ వేంగి–బీ బ్లాక్‌లో అతిథి గదులు, సమావేశ మందిరాలు, రెస్టారెంట్‌తో కూడిన బిజినెస్ హోటల్ ఉంది.
♦ కళింగ బ్లాక్‌లో రిసెప్షన్, వెయిటింగ్ ఏరియా, లగ్జరీ సూట్ రూమ్‌లు, కాన్ఫరెన్స్ హాల్స్, బ్యాంక్వెట్ హాల్స్ ఉన్నాయి.
♦ గజపతి బ్లాక్‌లో హౌస్ కీపింగ్, కేఫ్టేరియా, వ్యాపార కేంద్రాలున్నాయి.
♦ విజయనగరం–ఏ, బీ, సీ బ్లాక్‌లలో ప్రెసిడెన్షియల్ సూట్, విల్లా సూట్స్, స్పా, ఫిట్‌నెస్ సెంటర్, బ్యాంక్వెట్ హాల్స్ ఏర్పాటుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment