Fake drugs
-
సరైన ‘నియంత్రణ’తోనే దివ్యౌషధం
భారత్‌లో తయారైన మందులు తీసుకోవడం వల్ల గాంబియా, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాల్లో కొంతమంది మరణించినట్లు గత ఏడాది వార్తలొచ్చాయి.ఈ నేపథ్యంలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ దేశ ఫార్మా రంగంలో నాణ్యతా ప్రమాణాలపై సర్వే ప్రారంభించింది. విమర్శకులు చాలాకాలం నుంచి చేస్తున్న ఆరోపణలు కఠిన వాస్తవమని ఈ సర్వే ద్వారా ప్రభుత్వానికీ స్పష్టంగా తెలిసింది. దీనివల్ల వాస్తవ పరిస్థితులపై ప్రభుత్వ సంస్థల కళ్లు విచ్చుకున్నాయని చెప్పాలి. లేదా చాలాకాలంగా తెలిసిన విషయాలను వీరు అసలు పట్టించుకోలేదని అయినా అనుకోవాలి. సర్వే చెప్పిన అంశాల్లో ఒకటి – దేశంలో నాణ్యత ప్రమాణాలను పాటించడంపై అస్సలు శ్రద్ధ లేదు అన్నది. నిబద్ధత, తగిన శిక్షణ లేకపోవడం అన్నవి సరేసరి. నాణ్యతా ప్రమాణాల లోపాల ఫలితంగానే నాసిరకం ఔషధాలు భారత్‌లో పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతున్నాయి. మందులు చౌకగా లభిస్తాయన్న ఢంకా బజా యింపునకూ ఇవే కారణాలయ్యాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు ఇంకా మొదలు కావాల్సి ఉన్నా, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సర్వే జరపడమే కొంత ప్రభావం చూపుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ సంస్థలు ఇప్పుడు ఒక్కతీరుగా ఆలోచించడం మొదలుపెట్టాయి. చేయాల్సిన పనులు, చేపట్టాల్సిన చర్యలపై స్పష్టతా ఏర్పడింది. మితిమీరిన జోక్యం... దేశ ఫార్మా రంగాన్ని పట్టిపీడిస్తున్న అంశం ఏదైనా ఉందీ అంటే అది మితిమీరిన ప్రభుత్వ జోక్యమనే చెప్పాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలకు చెందిన పలు సంస్థలు ఫార్మా రంగంలో జోక్యం చేసుకుంటూంటాయి. ఈ క్రమంలో ఎవరికి వారు తమ ప్రయోజనాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తూంటారు. తద్వారా అసలు ప్రయోజనం దెబ్బతింటూ ఉంటుంది. స్థానికంగా తయారయ్యే మందులకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు లైసెన్సులు జారీ చేస్తూంటాయి. దీనివల్ల చాలా మందుల నాణ్యత అనేది రాష్ట్రాన్ని బట్టి మారిపోతూంటుంది. ఫార్మా రంగంపై నియంత్రణ సుస్పష్టంగా ఉన్నప్పుడే నాణ్యతను కాపాడేందుకు అవకాశం ఉంటుంది. నాణ్యమైన మందులు లేకపోతే ఈ ఆధునిక యుగంలో మరింత ఎక్కువ కాలం జీవించడం అసాధ్యం. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలోనూ ఫార్మా రంగం ప్రాముఖ్యత ఏమిటన్నది కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరమూ లేదు. భారత్‌కు ప్రపంచ ఫార్మా రాజధాని అనే పేరుంది. జెనెరిక్ మందులతో అన్ని దేశాల్లోనూ అవస రార్థులకు మందులు (పేటెంట్ హక్కులు లేనివి) అందుబాటులో ఉండేందుకు కారణమైంది భారత్! ప్రాణాంతక హెచ్ఐవీ నియంత్రణలో ఈ జెనెరిక్ ఔషధాలది చారిత్రాత్మక పాత్ర. భారతీయ ఫార్మా కంపెనీల జెనెరిక్ ఉత్పత్తుల్లేకపోతే ఈ రోజు అమెరికా సహా పలు దేశాల్లో పరిస్థితులు భిన్నంగా ఉండేవి. చరిత్రను తరచి చూస్తే... భారతీయ ఫార్మా రంగం సాధించిన ఘన విజయాలకు ఇందిరా గాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుంది. 1970లలో ప్రాసెస్ పేటెంట్లకు కట్టుబడుతూనే... ప్రాడక్ట్ పేటెంట్లకు భారత్ ‘నో’ చెప్పిన విషయం తెలిసిందే. ఈ ఏర్పాటు వల్ల పశ్చిమ దేశాల్లో పేటెంట్ హక్కులున్న ఖరీదైన మందులను కూడా ప్రత్యా మ్నాయ మార్గాల ద్వారా చౌకగా తయారు చేసే వీలేర్పడింది. ఫలితంగానే భారత్ మోతాదుల పరంగా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఫార్మా పరిశ్రమగా అవతరించగలిగింది. విలువ ఆధారంగా చూస్తే మాత్రం మనది 14వ స్థానం. భారత ఫార్మా రంగం మార్కెట్ విలువ 5,000 కోట్ల డాలర్లు కాగా ఇందులో సగం ఎగుమతుల ద్వారా లభిస్తోంది. ప్రపంచ టీకా డిమాండ్‌లో 60 శాతాన్ని భారత్ పూరిస్తోందంటే పరిస్థితి ఏమిటన్నది తెలుస్తుంది. అమెరికా జెనెరిక్ మందుల డిమాండ్‌లో 40 శాతం భారత్ ద్వారా తీరుతోంది. యూకే ఔషధా లన్నింటిలో 25 శాతం ఇక్కడి నుంచే వెళుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్‌లో తయారయ్యే మందుల నాణ్యతపై ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నం కారాదు. ఈ రకమైన నమ్మకం ఉన్నందునే గాంబియాలో మన మందుల వాడకం వల్ల పిల్లలు కొందరు మరణించారన్న వార్త కలకలం రేపింది. ఆ వెంటనే ఉజ్బెకిస్తాన్,శ్రీలంక... చివరకు అమెరికా నుంచి కూడా ఇదే రకమైన ఆరోపణలు రావడం పరిస్థితిని మరింత దిగజారేలా చేసింది. మనకు మాత్రం నష్టం లేదా? మందుల కంపెనీల్లో చాలా సందర్భాల్లో కల్తీలను గుర్తించేందుకు అవసరమైన పరికరాలు, తగిన అర్హతలున్న సిబ్బంది కొరత ఉంటుంది. డైఎథిలీన్ గ్లైకాల్ వంటివి అంధత్వానికి కారణమవుతాయి. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఎగుమతుల కోసం ఉద్దే శించిన అన్ని దగ్గుముందులను ప్రభుత్వ పరిశోధన శాలల్లో పరీక్షించాలని ఒక ఆదేశం జారీ చేసింది. కానీ ఇదేమంత సత్ఫలితాలు చూపలేదు. ఎందుకంటే ఫార్మా విషయాలను వాణిజ్య శాఖ పర్యవేక్షించే పరిధి లేకపోవడం. అంతేకాకుండా... వాణిజ్య శాఖ ఇంకో ప్రశ్న కూడా లేవనెత్తింది. అదేమిటంటే, ఇలాంటి కల్తీ దగ్గు మందుల కారణంగా భారతీయ రోగులకు హాని జరగడం లేదా అని! జమ్మూలో అదే జరిగింది. 2019 డిసెంబరు 2020 జనవరి మధ్య కాలంలో కల్తీ దగ్గుమందు వేసుకోవడం వల్ల దాదాపు 12 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది ఇంకో చిత్రమైన ఘటన జరిగింది. 1940 నాటి డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ స్థానంలో డ్రగ్స్, మెడికల్ డివైజెస్ అండ్ కాస్మోటిక్స్ బిల్ 2023ను ప్రవేశపెట్టాలని ప్రయత్నించారు. ఇప్పు డున్న వివాదాస్పద అంశాలు వేటికీ ఇందులో చోటు లేకుండా పోయింది. ఫార్మా రంగం సంస్కరణలు లక్ష్యంగా తీసుకొచ్చే ఏ కొత్త చట్టమైనా లైసెన్సింగ్ ప్రక్రియను కేంద్రీకృతం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే దేశవ్యాప్తంగా ఔషధ నియంత్రణ ఏకరీతిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం 28 రాష్ట్రాల్లో డ్రగ్ రెగ్యులేటర్స్ ఉన్నారు. జాతీయ స్థాయిలో ఒకే ఒక్క డ్రగ్ రెగ్యులేటింగ్ వ్యవస్థ... ఈ వ్యవస్థకు సలహా సూచనలు అందించేందుకు రెండు స్టాట్యుటరీ వ్యవస్థలు ఉంటే సరిపోతుంది. డ్రగ్ కంట్రోలర్ కార్యాలయం కూడా స్వతంత్ర సంస్థగా ఉండాలి. దీనివల్ల మంత్రుల ఆమోదం లేకుండానే డ్రగ్ కంట్రోలర్ అవసర మైనప్పుడు నిపుణులను నియమించుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటికే వ్యతిరేక పవనాలు... ఫార్మా రంగానికి సంబంధించి ఇప్పటికే కొన్ని వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఫార్మా దిగుమతుల విషయంలో అమెరికా కొన్ని కఠిన మైన చర్యలకు సిద్ధమవుతోంది. భారతీయ ఫార్మా కంపెనీలకు నాణ్యత విషయంలో ఇప్పటికే అగ్రరాజ్యం బోలెడన్ని సార్లు హెచ్చ రికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ పరిణామం కీలకం కానుంది. ఆఫ్రికా దేశాలు కొన్ని కూడా అమెరికా మాదిరిగానే ఆలోచిస్తూండటం గమనార్హం. ఇంకో ముఖ్య విషయం... ఫార్మా రంగ పరీక్షలకు సంబంధించి అందరికీ అందుబాటులో ఉండేలా ఒక ఐటీ వేదిక సృష్టి వెంటనే జరగాలి. గత సమాచారం, ప్రస్తుత పరిణామాలన్నింటికీ ఈ వేదిక ఒక రెఫరెన్ ్స పాయింట్లా ఉండాలి. పరిశ్రమ వర్గాలతోపాటు నియంత్రణ సంస్థలు, ఈ అంశంపై పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు ఈ వేదికను ఉపయోగించుకుని తమ సామర్థ్యాన్ని మెరుగుపరచు కోవచ్చు. ఆన్ లైన్ ప్రభుత్వ సేవల రంగంలో భారత్‌కు ఉన్న అను భవాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇదేమంత పెద్ద సంగతి కానేకాదు. ఫార్మా రంగ సంస్కరణల విషయంలో వాంఛనీయమైన పరిణామం ఏదైనా ఉందంటే అది ఇటీవలి కాలంలో సంబంధిత మంత్రి చేసిన ఒక ప్రకటన. ‘‘ఫార్మా రంగ నియంత్రణ అనేది సహ కార సమాఖ్య తీరులో సాగాలి’’ అన్న ఆయన మాటలు ఆచరణలోకి వస్తే వ్యవస్థలోని లోపాలను సరిదిద్దుకోవడమే కాకుండా... ఒకరికి ఒకరు ఆసరాగా నిలవడం ద్వారా మరింత బలోపేతం కావచ్చు కూడా. పార్టీల మధ్య తీవ్రమైన వైరం నెలకొన్న... త్వరలోనే పార్లమెంటరీ ఎన్నికలు ఇంకో ఆరు నెలల్లో జరగబోతున్న నేపథ్యంలో ఈ మాత్రం మార్పు ఆహ్వానించదగ్గదే! సుబీర్ రాయ్ వ్యాసకర్త సీనియర్ ఆర్థిక విశ్లేషకులు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఔషధ నియంత్రణపై రెండు నాలుకలు
దేశీ మార్కెట్లో చాలా నకిలీ మందులు చలామణీలో ఉన్నాయన్న కేంద్ర ఆరోగ్య మంత్రి వ్యాఖ్యలు బయటికి పొక్కడం కలకలం రేపింది. మళ్లీ ఆయనే అధికారిక సమావేశాల్లో నాణ్యమైన ఔషధాలు తయారవుతున్నాయని నొక్కిచెప్పారు. ప్రజలందరికీ చౌకగా, చక్కగా పనిచేసే మందులు అందివ్వాల న్నదే ప్రభుత్వ లక్ష్యమైతే అందుకు ఒక సమగ్రమైన పద్ధతిని అనుసరించాలి. ప్రస్తుతం మార్కెట్లో ఒకే రసాయనానికి సంబంధించి వందలాది బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కోదాని ధర, సామర్థ్యాల్లో అంతరమూ కనిపిస్తోంది. అహేతుకమైన మిశ్రమాలున్న మందులూ దొరుకుతున్నాయి. జన ఔషధి కేంద్రాలు కొన్ని వేలు తెరచినంత మాత్రాన సమస్యకు పరిష్కారం లభించదు. వీటికి దన్నుగా నిలిచే సరఫరా వ్యవస్థ కూడా అత్యవసరం. ఉజ్బెకిస్తాన్, గాంబియా... రెండు వేర్వేరు దేశాల్లో సుమారు 70 మంది పిల్లలు కల్తీ దగ్గుమందు కారణంగా మరణించారు. ఇటీవలి కాలంలో సంభవించిన ఈ దుర్ఘటనకు కారణమైన దగ్గు మందు సరఫరా అయ్యింది మన దేశం నుంచే. కొన్ని వారాల క్రితం నోయిడా పోలీసులు ఉజ్బెకిస్తాన్ మరణాలకు సంబంధించి ముగ్గురు ఫార్మా కంపెనీ ఉద్యోగులను అరెస్ట్ చేయగా... కొన్ని నెలల క్రితం గాంబియా ఘటనకు సంబంధించి దేశంలో పెద్ద దుమారమే చెలరేగింది. ఈ రెండు కేసుల్లోనూ దగ్గుమందులో విషపూరిత రసాయనాలు కలిసి ఉండటం గమనార్హం. గాంబియా ఘటనలను ముందుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచం దృష్టికి తెచ్చింది. భారత్ నుంచి ఎగుమతి అయిన దగ్గు ముందులో గుర్తించిన డైఎథిలీన్ గ్లైకోల్ (డీఈజీ) కారణంగా మూత్ర పిండాలు పనిచేయకుండా పోయి పిల్లలు మరణించినట్లు అమెరికాకు చెందిన ‘సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్’ కూడా ఈ వారమే ధ్రువీకరించింది. ఈ ఘటనలకు కేంద్ర ఆరోగ్య శాఖ, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ), రాష్ట్రాల డ్రగ్ కంట్రోలర్లు, ఫార్మా స్యూటికల్ డిపార్ట్మెంట్ల స్పందన అంతంత మాత్రమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ, గాంబియా ప్రభుత్వం చేసిన ప్రకటనల్లో లోపాలపై దృష్టి పెట్టాయి కానీ... ఆయా సంస్థలు గుర్తించిన అంశాల జోలికి ఇవి పోలేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాచారం ఇవ్వకపోవడాన్ని విమర్శించి ఉరకున్నాయి. ఆరోగ్య శాఖ నెపం మొత్తాన్ని గాంబియాపై నెట్టేసింది. దిగుమతి చేసుకునేటప్పుడు పరీక్షించుకోవాల్సిన బాధ్యత ఆ దేశానిదేనని తేల్చేసింది. అంతటితో ఆగకుండా... ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక్కో కేసులో మరణానికీ, ఔషధానికీ ఉన్న సంబంధాన్ని వివరించలేదని వ్యాఖ్యానించింది. ఆ తరువాత తెలిసిందేమిటంటే... గాంబియా కొన్ని కేసుల్లో శవపరీక్షలు కూడా నిర్వహించి డీఈజీ అవశేషాలను గుర్తించిందని! అన్నింటి కంటే ముఖ్యంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవియా ఈ ఘటనలన్నింటినీ భారత ఔషధ పరిశ్రమను దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రగానే పరిగణించడం! గత నెల 24న వంద భాగస్వామ్య దేశాల భారత దౌత్యవేత్తలు పాల్గొన్న సమావేశంలోనూ మాండవియా దేశంలో నాణ్యమైన మందులు తయారవుతున్నాయని నొక్కి చెప్పడం ఇక్కడ ప్రస్తావించ దగ్గ అంశం. కేంద్ర ఆర్యోగ శాఖ మంత్రి ప్రకటనల్లో ద్వంద్వ ప్రమాణాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో జరిగిన ఓ రహస్య సమావేశంలో దేశంలో మందుల నియంత్రణ దుఃస్థితిని ఆయన నేరుగా అంగీకరించారు. ‘‘దేశీ మార్కెట్లో చాలా నకిలీ మందులు చలామణిలో ఉన్నాయి. కల్తీ మందులు ఎగుమతి అవుతున్నాయి కూడా. దీనివల్ల ఫార్మా రంగం విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి’’ అని ఒప్పు కొన్నారు. ఈ దుఃస్థితికి అధికారులే కారణమని కూడా ఆయన కుండబద్దలు కొట్టారు. ‘‘ఫార్మా రంగానిదే బాధ్యత. కానీ అంతకంటే ముందు ఇది మన బాధ్యత’’ అని ఆయన అధికారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నియంత్రణ వ్యవస్థల గురించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ‘‘ఇది చురుకుగా లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వ యమూ కొరవడుతోంది’’ అని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి అంచనా ప్రకారం, ప్రస్తుత నియంత్రణ వ్యవస్థ కేంద్ర, రాష్ట్రాల సంస్థలు, ఫార్మాస్యూటికల్ విభాగాల పేరుతో ముక్కలు ముక్కలుగా ఉంది. మాండవియా ప్రసంగం యూట్యూబ్ ఛానల్లో ఎనిమిది నిమిషాల పాటు ప్రత్యక్ష ప్రసారమైంది. ఆ తరువాత ఆగిపోవడమే కాకుండా... అప్పటివరకూ రికార్డయిన వీడియోను కూడా ఛానల్ నుంచి తొలగించారు. అయితే వీడియో తొలగించినంత మాత్రాన విషయం బయ టకు పొక్కకుండా ఉంటుందా? నిపుణులు ఎంతో కాలంగా చెబుతున్న విధంగానే నియంత్రణ సంస్థల నిర్లక్ష్యం కారణంగా నాణ్యత లేని, కల్తీ, నకిలీ మందులు భారతీయ మార్కెట్లో చలామణి అవుతున్నట్లు అందరికీ అధికారికంగా తెలిసిపోయింది. ఇలాంటి మందులు విదేశాలకూ ఎగుమతి అవుతున్నట్లు... దుష్ఫలితాలూ వాటివల్లనే అన్న విషయమూ స్పష్టమైంది. మంత్రి ప్రకటనను బట్టి చూస్తే దేశ ఫార్మా రంగం దుఃస్థితికి కారణాలు ఆయనకూ తెలుసన్నమాట. మరి ఇదే నిజమైతే ఆయన, కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ ఏం చేస్తున్నట్లు? గాంబియా, ఉజ్బె కిస్తాన్ ఘటనలపై వ్యతిరేక నివేదికలు వచ్చినప్పుడు బహిరంగంగా ఫార్మా రంగాన్ని, నియంత్రణ వ్యవస్థలకు మద్దతుగా మాట్లాడటం ఎందుకు? ఈ రెండు నాల్కల ధోరణిని వదిలిపెట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. ఎందుకంటే ఇది ప్రజల జీవితాలతో కూడిన వ్యవహారం. దేశ ఫార్మా రంగ నియంత్రణ సంస్థల్లోని అకృత్యాలు ఇప్పుడు కొత్తగా తెలిసినవి ఏమీ కాదు. 2012లోనే ఒక పార్లమెంటరీ కమిటీ సీడీఎస్సీఓ పనితీరుపై విచారణ జరిపి, కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ఉన్న అక్రమాలను బయటపెట్టింది. దురదృష్టవశాత్తూ అప్పటినుంచి ఇప్పటివరకూ జరిగిన మార్పు స్వల్పమే. పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫారసులు కాగితానికే పరిమితమైపోయాయి. ప్రభుత్వాలు కూడా ఈ రంగాన్ని సంస్కరించేందుకు చిత్తశుద్ధితో పనిచేయలేకపోయాయి. ఇంకోవైపు ఫార్మా పరిశ్రమ ఎదుగుదలకు నియంత్రణ వ్యవస్థలు ప్రతిబంధకంగా మారుతున్నాయన్న ఆరోపణలు పెరిగిపోతున్నాయి. దేశ ఫార్మా మార్కెట్ సుమారు నాలుగు లక్షల కోట్ల రూపాయల విలువైందని ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. ఈ మొత్తం పది లక్షల కోట్ల రూపాయలకు చేరవచ్చునని కూడా ఆయన అంచనా కట్టారు. ఇది కచ్చితంగా మంచి లక్ష్యం. కానీ భద్రత, సామర్థ్యం, మందుల ప్రమాణాలతో రాజీపడి సాధించడం ఎంతమాత్రమూ సరికాదు. స్థానిక మార్కెట్ అయినా, విదేశీ మార్కెట్ అయినా వీటిని పాటించడం అవసరం. ప్రజలందరికీ చౌకగా, చక్కగా పనిచేసే మందులు అందివ్వా లన్నదే ప్రభుత్వ లక్ష్యమైతే అందుకు ఒక సమగ్రమైన పద్ధతిని అనుసరించాలి. ప్రస్తుతం మార్కెట్లో ఒకే రసాయనానికి సంబంధించి వందలాది బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో దాని ధర, సామర్థ్యాల్లో అంతరమూ కనిపిస్తోంది. అహేతుకమైన మిశ్రమా లున్న మందులూ దొరుకుతున్నాయి. వేర్వేరు బ్రాండ్లు ఉండటంతో వైద్యులను ఆకర్షించేందుకు కంపెనీలు అనైతిక మార్కెటింగ్ కార్య కలాపాలకూ దిగుతున్నాయి. జన ఔషధి కేంద్రాలు కొన్ని వేలు తెరచి నంతమాత్రాన సమస్యకు పరిష్కారం లభించదు. వీటికి దన్నుగా నిలిచే సరఫరా వ్యవస్థ కూడా అత్యవసరం. నిజానికి జన ఔషధి కేంద్రాల స్థాపన ఆలోచన మాజీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్‌ది. 2005లోనే ఆయన యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ కేంద్రాల ఏర్పాటును ప్రస్తావించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఔషధ కంపెనీల నుంచి జెనెరిక్ మందులను ఈ కేంద్రాల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆయన సంకల్పించారు. ఈ ప్రభుత్వ రంగ ఫార్మా కంపెనీల్లో అత్యధికం ఇప్పుడు పనిచేయడం లేదు. లేదా అస్తవ్యస్త పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి, సమస్య పరిష్కా రానికి బహుముఖ వ్యూహం అవసరం. దేశంలోని నియంత్రణ వ్యవస్థ లను గాడిలో పెట్టడంతో మొదలుపెడితే సరైన దిశలో ముందడుగు వేసినట్లు అవుతుంది! వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
నకిలీ మందుల ఊసే ఉండకూడదు
సాక్షి, అమరావతి: ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, వారి ప్రాణాల కంటే ఏదీ ఎక్కువకాదని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని చెప్పారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారన్నారు. ఆమె గురువారం సచివాలయంలో రాష్ట్ర ఔషధ నియంత్రణ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో నకిలీ మందుల ఊసే ఉండకూడదని, కాలం చెల్లిన మందులు ఎక్కడా కనిపించకూడదని చెప్పారు. అన్ని మందుల షాపులను నిరంతరం తనిఖీ చేయాలని ఆదేశించారు. ప్రతి డ్రగ్ ఇన్స్పెక్టర్ నెలలో 50కి పైగా మెడికల్ షాపులను తనిఖీ చేయడం లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. నిబంధనలు పాటించని వారి లైసెన్సులు రద్దు చేయాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని బ్లడ్ బ్యాంకులను గుర్తించాలన్నారు. ఇష్టానుసారంగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించే వారిపై కన్నేసి ఉంచాలన్నారు. లైసెన్సుల జారీ, రెన్యువల్స్‌లో పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. నిజాయితీగా పనిచేసే అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. రీజనల్ టెస్టింగ్ ల్యాబ్‌ల ఏర్పాటు, డ్రగ్ ఇన్స్పెక్టర్లకు వాహనాల కేటాయింపు వంటి కొన్ని సమస్యలను అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఆ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని చెప్పారు. ఔషధ నియంత్రణ విభాగం డీజీ ఎస్.రవిశంకర్ నారాయణన్, డైరెక్టర్ ఎం.బి.ఆర్.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ మందులకు కళ్లెం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నకిలీ లేదా నాసిరకం మందులకు అడ్డుకట్ట వేసేందుకు ఔషధ నియంత్రణ శాఖ సరికొత్త పద్ధతులకు శ్రీకారం చుట్టింది. ఇన్నాళ్లూ ఎక్కడో ఓ చోట మందుల నమూనాలను సేకరించడం, వాటిని పరీక్షించడం ఆ ఫలితాలను బట్టి చర్యలు తీసుకోవడం జరిగేది. కానీ, దీనివల్ల సరైన ఫలితాలు వచ్చేవి కావు. దీంతో నాసిరకం మందులు మార్కెట్లో యథేచ్ఛగా చెలామణి అయ్యేవి. ఈ నేపథ్యంలో.. దేశంలో ఎక్కడా లేనివిధంగా ‘ఇంటెలిజెన్స్ శాంపిలింగ్ సిస్టం’ను రాష్ట్రంలో అమల్లోకి తెచ్చారు. ఈ విధానం ఇప్పుడిప్పుడే సత్ఫలితాలిస్తోంది. ఇదే ఇప్పుడు భీమవరంలో నకిలీ మందులను కనిపెట్టేలా చేసింది. దీంతో మార్కెట్లోకి పుట్టగొడుగుల్లా పుట్టుకువచ్చే మందులపై నిఘా పెరిగింది. ఈ విధానం అమల్లోకి రావడంతో హోల్‌సేలర్లు, రిటైలర్లు కూడా మందుల సేకరణలో జాగ్రత్తపడుతున్నట్లు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ శాంపిలింగ్ విధానం అంటే.. ► ఏ ఉత్పత్తిదారుడైనా తన ట్యాబ్లెట్లు రెండు బ్యాచ్‌లు.. రెండు దఫాలు ఎన్ఎస్క్యూ (నాట్ స్టాండర్డ్ క్వాలిటీ–నాణ్యత లేదని) అని తేలితే సదరు కంపెనీ మందులను ఔషధ నియంత్రణ శాఖ సేకరిస్తుంది. ► ఉత్పత్తిదారుడి హోల్‌సేల్ లైసెన్సు సస్పెండైనా లేదా రద్దయినా, జీఎంపీ (గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీసెస్) ఉల్లంఘించినా అలాంటి సంస్థల మందులను సేకరిస్తుంది. ► కొత్తగా మార్కెట్లోకి వచ్చిన మందులు లేదా ఎక్కువ ధర ఉన్నా, అలాగని తక్కువ ధరకు అమ్ముతున్నా అలాంటి వాటినీ పరిశీలిస్తారు. ► మందుల లేబుల్ లేదా ప్రింట్ వంటివి అనుమానం కలిగించేలా ఉన్నా.. మందుల పేర్లలో తప్పులున్నా అలాంటి వాటిపైనా ఔషధ నియంత్రణ శాఖ కన్నేస్తుంది. ► అంతేకాక.. ప్యాకింగ్‌లో నాసిరకం మెటీరియల్ వాడినా, అక్షరాలు కనిపించకుండా ఉన్నా వాటిపై నిఘా వేసి వేస్తుంది. ► సాధారణంగా సూపర్ స్టాకిస్ట్–స్టాకిస్ట్–హోల్‌సేలర్–రిటైలర్ క్రమ పద్ధతిలో సరఫరా కావాలి. ఇలా కాకుండా మార్కెట్లోకి వచ్చిన వాటిపైనా కన్నేస్తారు. ► ఏవైనా మందులకు స్కీములు ఇచ్చినా, ఇన్సెంటివ్‌లు ఇచ్చినా వాటినీ నియంత్రిస్తారు. ► ఇవన్నీ కాకుండా మందుల ప్రభావం గురించి డాక్టర్లు, మెడికల్ రిప్రెజెంటేటివ్‌లు, కెమిస్ట్‌ల నుంచి ఫిర్యాదులు వచ్చినా ఆ మందులను పరిశీలిస్తారు. నకిలీలను అరికట్టేందుకే ఈ విధానం గతంలో ఎక్కడంటే అక్కడ నమూనాలను సేకరించే వారు. దీనివల్ల ఫలితాలు ఆశించినంతగా ఉండేవి కావు. ఇప్పుడు ఇంటెలిజెన్స్ శాంపిలింగ్ విధానం అమలుచేయాలని డ్రగ్ ఇన్స్పెక్టర్లకు ఆదేశాలిచ్చాం. దీనివల్ల మంచి మందులు మాత్రమే వినియోగదారులకు చేరే అవకాశం ఉంటుంది. హోల్‌సేలర్లు, రిటైలర్లకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ విధానం మరింత పకడ్బందీగా అమలుచేస్తాం. – రవిశంకర్ నారాయణ్, డైరెక్టర్ జనరల్, ఔషధ నియంత్రణ శాఖ -
నకిలీ ఔషధాలపై కొరడా
సాక్షి, అమరావతి: నకిలీ ఔషధాలపై కొరడా ఝుళిపించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా నిర్మాణాత్మక చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఔషధ నియంత్రణపై సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. నకిలీ మందులపై కట్టడి కోసం డ్రగ్ కంట్రోల్లో విజిలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ విభాగం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. చర్చించిన అంశాలకు సంబంధించి నెలరోజుల్లో కార్యాచరణ, ప్రణాళిక తీసుకురావాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ సందర్భంగా మార్కెట్లో నకిలీ మందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఆదేశాలు, సూచనలిలా ఉన్నాయి.. ► ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే నకిలీ ఔషధాలను అరికట్టాల్సిందే. డ్రగ్ కంట్రోల్ కార్యకలాపాలు బలోపేతం చేయాలి. ► ఇందుకోసం కఠినమైన నిబంధనలు తీసుకురావాలి. ► డ్రగ్ తయారీ యూనిట్లలోనూ నాణ్యతపై కూడా దృష్టిపెట్టాలి. ► జరిమానాలు విధించేందుకు వీలుగా చట్టంలో నిబంధనలు తీసుకురావాలి. ► మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో గొప్ప విధానాలు ఉండేలా చూడాలి. థర్డ్ పార్టీ తనిఖీలు జరగాలి. ► మందుల దుకాణాల వద్దే ఫిర్యాదు ఎవరికి.. ఏ నంబర్‌కు చేయాలన్న సమాచారం ఉంచాలి. ► ప్రభుత్వాస్పత్రుల్లో కూడా క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలి. ► నకిలీ మందుల తయారీ, విక్రయంపై సమాచారమిచ్చే వారికి రివార్డులు ఇవ్వాలి. ► అలాగే, ప్రజల నుంచి, ఇతరత్రా వ్యక్తుల నుంచి నిరంతరం ఫిర్యాదులు స్వీకరించాలి. ► విజయవాడలో ఉన్న ల్యాబ్‌తోపాటు నిర్మాణంలో ఉన్న కర్నూలు, విశాఖపట్నం ల్యాబ్‌ల్లో సామర్థ్యం పెంచాలి. దీంతో.. ఏడాదికి 2వేల నుంచి 13వేల శాంపిళ్లకు సామర్థ్యం పెంచుతున్నట్లు అధికారుల వివరణ. కాగా, ఈ సమీక్షలో డ్రగ్స్ అండ్ కాపీరైట్ డైరెక్టర్ జనరల్ రవిశంకర్ నారాయణ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
భారత సంతతి డ్రగ్స్ ముఠా అరెస్ట్
న్యూయార్క్: నకిలీ బ్రాండింగ్‌తో భారీ ఎత్తున డ్రగ్స్ ఆధారిత మందుల వ్యాపారం సాగిస్తున్న ఓ ముఠా కుట్రను అమెరికా పోలీసులు భగ్నం చేశారు. న్యూయార్క్ పరిధిలోని క్వీన్స్ కేంద్రంగా ఈ ముఠా సాగిస్తున్న కార్యకలాపాలపై నిఘా పెట్టిన పోలీస్ అధికారులు, 8 మంది భారత సంతతి అమెరికన్లను అరెస్ట్ చేశారు. అమెరికాలోని కొరియర్, పోస్టల్ సర్వీసుల ద్వారా వీరు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్లు తెలుసుకున్న అధికారులు విస్తుపోయారు. ఈ విషయమై న్యూయార్క్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ..‘సెషిజాన్ కమల్ దాస్(46), ముకుల్(24), గులాబ్ (45), దీపక్ (43), నారాయణ స్వామి(58), బల్జీత్ సింగ్(29), హర్‌ప్రీత్ సింగ్(28) వికాస్ వర్మ (45)లు భారత్ నుంచి నకిలీ బ్రాండింగ్‌తో నల్ల మందు ఆధారిత మందుల్ని అమెరికాలోకి భారీగా దిగుమతి చేసుకున్నారు. ఈ మందుల్లో హెరా యిన్, ఆక్సికొంటిన్, వికోడిన్, ట్రమడాల్, ఫెంటానేల్ వంటి సింథటిక్ డ్రగ్స్ ఉంటాయి’ అని తెలిపారు. రీ–ప్యాకింగ్‌తో కోట్ల ఆదాయం.. నిందితులు తమ డ్రగ్స్ వ్యాపారానికి న్యూయార్క్ పరిధిలో క్వీన్స్ పట్టణాన్ని కేంద్రంగా చేసుకున్నారని పోలీసులు గుర్తించారు. ఈ పట్టణంలోని ఓ గోదామును అద్దెకు తీసుకున్న 8 మంది నిందితులు.. భారత్ నుంచి దిగుమతి చేసుకున్న సరుకులను తమ వినియోగదారులకు పంపేవారు. ఇందుకోసం ప్రభుత్వ పోస్టల్ సర్వీసుతో పాటు ప్రైవేటు కొరియర్ సంస్థల సేవలను హాయిగా వాడుకున్నారు. మందులను రీప్యాక్ చేసి తమ వినియోగదారులకు, కొన్ని సంస్థలకు అందించడం మొదలుపెట్టారు. ఇలా 2018–19 మధ్యకాలంలో వీరు కోట్ల రూపాయలు ఆర్జించారు. అయితే 2018 జనవరి నుంచి దేశంలోకి భారీగా నల్లమందు ఆధారిత డ్రగ్స్ దిగుమతి కావడంపై అమెరికా విచారణ సంస్థలు దృష్టి సారించగా ఈ అక్రమ అమ్మకాలు వెలుగులోకి వచ్చాయి. డోస్ ఎక్కువైతే మరణమే.. సింథటిక్ డ్రగ్స్ ఉన్న మందులను వైద్యుల పర్యవేక్షణ లేకుండా వాడటం ప్రమాదకరం. డోస్ ఎక్కువైతే కోమాలోకి వెళ్లిపోతారు. కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవిస్తుంది. ఈ నేపథ్యంలో 8 మంది నిందితులను బ్రూక్లిన్‌లోని ఫెడరల్ కోర్టులో హాజరుపర్చిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నేరం రుజువైతే కమల్దాస్కు 25 ఏళ్లు, మిగతా నిందితులకు ఐదేళ్లు జైలు శిక్ష పడే అవకాశముంది. -
హైదరాబాద్ లో నకిలీ డ్రగ్స్ కలకలం..
సాక్షి, హైదరాబాద్: నగరంలో భారీ స్థాయి నకిలీ డ్రగ్స్తయారీ గుట్టు రట్టైంది. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ డ్రగ్స్ తయారవుతున్నాయన్న సమాచారం అందుకున్న రాచకండో పోలీసులు సోమవారం తయారీ కేంద్రంపై దాడి చేశారు. గర్భిణీలు ఎక్కువగా ఉపయోగించే ప్రోటీన్ పౌడర్, టానిక్స్, పిల్లలు తాగే మిల్క్ పౌడర్లను నకిలీగా గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు ఐదు వందల కోట్ల రూపాయలుంటుందని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చివరకు చిన్న పిల్లలు తాగే పాల పౌడర్, గర్బిణీలు ఉపయోగించే మందులను కల్తీ చేస్తుండటం నగరవాసులను కలవర పెడుతుంది. ఈ తయారీ కేంద్రం సహయజమానిగా గుర్తించిన రాజేందర్ రెడ్డి కోసం పోలీసులు వేట మొదల పెట్టారు. -
బాబోయ్.. నకిలీ మందులు!
⇒ పనిచేయని కలుపు నివారణ మందులు ⇒ రూ.వేలు ఖర్చుచేసినా నష్టపోతున్న రైతన్నలు ⇒ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఫర్టిలైజర్ షాపుల యజమానులు ⇒ రైతులకు బిల్లులు ఇవ్వని వ్యాపారులు ⇒ వ్యవసాయ అధికారుల పర్యవేక్షణ శూన్యం యాలాల: రెండేళ్లుగా ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు.. కరువుతో అల్లాడుతున్న రైతన్నలకు ఈ సారి కురుస్తున్న వర్షాలతో ఆశలు చిగురించాయి. అయితే, వారి ఆశలను నకిలీ పురుగు మందులు అడియాశలు చేస్తున్నాయి. తాము సాగుచేస్తున్న పంట పొలాల్లో పెరుగుతున్న కలుపు నివారణ మందులు నకిలీవి కావడంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. యాలాల మండలంలోని తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన భీమప్ప గ్రామ శివారులో ఆరెకరాలు కౌలుకు తీసుకొని కందిని సాగు చేస్తున్నాడు. కంది పంటలో కలుపు మందు పెరగుతుండడంతో ఈ నెల 14న తాండూరులోని అన్నదాత ఫర్టిలైజర్ షాపు నుంచి రూ.3,200 పెట్టి నాలుగు లీటర్ల కలుపు నివారణ మందును కొనుగోలు చేశాడు. దానిని పొలంలో చల్లాడు. అయినప్పటికీ పొలంలో కలుపు శాతం తగ్గకపోగా మరింత పెరగడంతో బాధిత రైతు ఆందోళన వ్యక్తం చేశాడు. దీనికితోడు పొలాల్లో కలుపు నివారణకు కూలీలు లభించక, వేసిన పంట కళ్ల ముందే నష్టపోతుండడంతో రైతన్న లబోదిబోమంటున్నాడు. ఇదే విషయమై ఫర్టిలైజర్ షాపు నిర్వాహకులను బాధిత రైతు ప్రశ్నిస్తే నిర్లక్ష్య సమాధానం ఇచ్చాడని వాపోయాడు. ఫర్టిలైజర్ షాపు నిర్వాహకులు మందులు ఇచ్చిన అనంతరం బిల్లులు ఇవ్వకపోగా, కనీసం మందు ఎలా పిచికారి చేయాలి, ఎంత మోతాదులో వాడాలి? ఎలా వాడాలి? తదితర వివరాలు తెలియజేయాల్సి ఉన్నా ఇవన్నీ పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. దీనికి తోడు ఫర్టిలైజర్ షాపుల పట్ల వ్యవసాయ శాఖ అధికారులు ‘చూసీచూడనట్లు’ వ్యవహరిస్తుండడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రైతుల వాదన. ఇది ఒక్క భీమప్ప పరిస్థితే కాదు. మండలంలో వివిధ పంటలు సాగుచేస్తున్న రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. మందులు కొనుగోలు చేసిన అనంతరం షాపు నిర్వాహకులు తెల్ల కాగితంపై ధర మాత్రమే రాసి ఇస్తున్నారు. ఇదేంటని అడిగిన రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. బిల్లులు ఇవ్వని దుకాణాలపై కఠిన చర్యలు! మందులు కొనుగోలు చేసిన రైతులు బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఏ ఫర్టిలైజర్ షాపు నిర్వాహకుడైనా బిల్లు ఇవ్వకపోతే అడిగి మరీ తీసుకోండి. బిల్లులు ఇవ్వని దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. లైసెన్సులు రద్దు చేస్తాం. తిమ్మాయిపల్లి రైతు భీమప్ప విషయంలో విచారణ జరిపి చర్య తీసుకుంటాం. - గిరిబాబు, మండల వ్యవసాయాధికారి -
నకిలీ మందులు విక్రయ ముఠాకు జైలు
నిజామాబాద్ లీగల్ : నకిలీ మందులు విక్రయించిన వ్యక్తులకు జైలు శిక్ష, జరిమానాలు విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిందని జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని గుర్బాబాది రోడ్డులో గల ఓం శ్రీ కాలభైరవ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్, నిజామాబాద్ మండలం బోర్గాం(పీ) గ్రామంలోని అను మెడికల్ స్టోర్‌సలో 2009 ఫిబ్రవరి 10న డ్రగ్ ఇన్స్పెక్టర్ ఫ్లోసిన్ అనే ట్యాబ్లెట్ శాంపిల్ తీశారు. దీనిని హైదరాబాద్‌లోని ప్రభుత్వ ల్యాబొరేటర్‌కు పరిశీలన నిమిత్తం పంపారు. ట్యాబ్లెట్లో ఓఫెక్సెస్ 200 ఎంజీ నిల్‌గా ఉందని నివేదిక వచ్చింది. దీనిని వింకో ఫార్మా, భరత్ ల్యాబొరేటర్స్ కంపెనీలు ఉత్పత్తి చేసినట్లుగా గుర్తించారు. పై రెండు కంపెనీలు ప్రస్తుతం మూతపడ్డాయి. ఈ మేరకు డ్రగ్ ఇన్స్పెక్టర్ నకిలీ మందులు విక్రయిస్తున్న ఓం శ్రీ కాలభైరవ, అను మెడికల్ స్టోర్‌సపై కేసు నమోదు చేశారు. ఈ కేసు ట్రయల్ నడిచి శుక్రవారం బెంచ్‌పైకి వచ్చింది. కేసు పూర్వపరాలను మొదటి అదనపు జిల్లా జడ్జి కిరణ్‌కుమార్ పరిశీలించారు. నకిలీ మందులు విక్రయిస్తున్న వి.శ్రీనివాస్, ఫార్మసిస్టు మంజుల, రాజేష్, అనురాధకు సంవత్సరం కఠిన కారగార శిక్ష, రూ. 10 వేల చొప్పున జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో రెండు నెలల పాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పు చెప్పారు. డ్రగ్ శాఖ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.రామకృష్ణ వాదించారని డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ తెలిపారు. -
మార్కెట్ ‘నకిలీ’మయం
బాన్సువాడ, న్యూస్‌లైన్ : నకిలీ మందులు.. నకిలీ నిత్యావసరాలు.. నాసిరకం బియ్యం.. కల్తీ నూనెలు.. ఇలా అన్ని రకాల వస్తువులకు నకిలీ బెడద ఇప్పటికే ఉంది. తాజాగా సెల్‌ఫోన్ రంగాన్ని నకిలీ మకిలీ అంటుకుంది. సెల్ఫోన్లు, వాటి విడిభాగాలు మార్కెట్‌ను శాసిస్తున్నాయి. నకిలీ వస్తువులను పసిగట్టి, చర్యలు తీసుకునేందుకు అధికారులకు వీలున్నప్పుడల్లా దాడులు చేస్తున్నా, సెల్‌ఫోన్ మార్కెట్లో మాత్రం నకిలీలను సీజ్ చేసేందుకు సాహసించడం లేదు. దీంతో జిల్లా మార్కెట్లో నకిలీల అమ్మకాలు జోరందుకున్నాయి. బ్రాండెడ్‌తో పాటు... ఈ రోజుల్లో సెల్‌ఫోన్ మనిషికి ప్రాథమిక వనరైంది. చేతిలో సెల్ లేని వ్యక్తి కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదు. ఇదే వ్యాపారులకు వరంగా మారింది. నకిలీలతో వినియోగదారుల జేబుకు చిల్లు పెడుతున్నారు. సెల్ కంపెనీల అంచనా ప్రకారం జిల్లాలో సుమారు 10 లక్షల ఫోన్లు ప్రజల చేతుల్లో ఉన్నాయి. ఇందులో నోకియా, సాంసంగ్, సోనీ, ఎల్జీ, ఆపిల్, బ్లాక్ బెర్రీ, సెల్కాన్, కార్బన్ కంపెనీల ఫోన్లు వాడుతున్నారు. అయితే చైనా ఫోన్లు వాడేవారి సంఖ్య సైతం అధికంగానే ఉంది. బ్రాండెడ్ కంపెనీల ధరలకంటే నాన్‌బ్రాండెడ్, మరీ ముఖ్యంగా చైనా ఫోన్ల ధరలు చాలా తక్కువగా ఉంటున్నాయి. దీంతో ప్రజలు వాటినే కొంటున్నారు. వీటిలో తక్కువ ధరకే ఆడియో, వీడియో, నెట్, చాటింగ్ తదితర అన్ని రకాల సౌకర్యాలు ఉండటం కూడా వినియోగదారులు వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు. అవి ఎక్కువ రోజులు పని చేయవని తెలిసినామోడల్ నచ్చడంతో తరచూ రిపేర్లు చేయించుకొంటూనే వాడుతున్నారు. దీంతో విడి భాగాల అమ్మకాలు సైతం ఊపందుకున్నాయి. నకిలీలను తెచ్చి సొమ్ము చేసుకొంటున్నారు. వీటిని గుర్తించడం వినియోగదారులకు ఇబ్బందికరమే. జిల్లాలోని నిజామాబాద్, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, ఆర్మూర్, బోధన్ తదితర ప్రాంతాల్లో హోల్‌సెల్ విడిభాగాల దుకాణాలు ఉన్నాయి. వాటిలో 60 శాతం విడిభాగాలు నకిలీవేనని ‘న్యూస్‌లైన్’ పరిశీలనలో తేలింది. ఈ నకిలీలతోనే వ్యాపారులు అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. నకిలీ విడిభాగాలు ఇవీ... సెల్ఫోన్లలో పాటలు వినడం ఫ్యాషన్‌గా మారింది. ప్రతి సెల్లో మెమొరీ కార్డులుంటున్నాయి. వాటి విడి భాగాల షాపుల్లోనే మెమొరీ కార్డుల అమ్మకాలు సాగుతుంటాయి. వీటిలో అధికంగా రెండు, మూడో క్వాలిటీవే ఉంటున్నాయి. సామర్థ్యం ఆధారంగా *150 నుంచి *800ల వరకు మెమొరీ కార్డులను అమ్ముతున్నారు. వీటికి బిల్లు, గ్యారెంటీ, వారెంటీ ఏదీ ఇవ్వరు. కొద్ది రోజులకే పాడవుతుంటాయి. ఇవేకాక స్పీకర్లు, స్క్రీన్లు, కీప్యాడ్స్, టచ్ప్యాడ్స్, హెడ్సెట్ తదితర విడిభాగాలు సైతం నకిలీవే రాజ్యమేలుతున్నాయి. సెల్‌ఫోన్ బ్యాటరీల అమ్మకాల్లో కూడా నకిలీలే అధికం. బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ బ్యాటరీలను వినియోగదారులకు అంటగడుతున్నారు. ఇవి పేలిన సందర్భాలు చాలా ఉన్నాయి. నకిలీ బ్యాటరీలు బ్రాండెడ్ కంపెనీల మాదిరిగానే ఉండటంతో వినియోగదారులు నష్టపోతున్నారు. వీటి అమ్మకాలపై పర్యవేక్షణ లేక మార్కెట్లో అవే రాజ్యమేలున్నాయి. చైనా సెల్ఫోన్లు తరచూ రిపేరుకు వస్తుండటంతో విడిభాగాల వ్యాపారం కూడా జోరుగా సాగుతోంది. జిల్లాలో వ్యాపారం కోట్లలోనే.. జిల్లాలో ప్రతి నెల సుమారు కోటి నుంచి 1.5 కోట్ల మేర సెల్‌ఫోన్ విడిభాగాల అమ్మకాలు అవుతున్నాయి. హైదరాబాద్, చెన్నై, నాగ్‌పూర్‌ల నుంచి వ్యాపారులు విడిభాగాలను కొనుగోలు చేసి విక్రయిస్తుంటారు. హోల్‌సెల్ వ్యాపారులు ఢిల్లీ, ముంబై నుంచి సైతం విడిభాగాలు తెచ్చి అమ్ముతుంటారు. వీటితో వ్యాపారులకు రూపాయికి పది రూపాయల లాభం వస్తోంది. నకిలీ విడిభాగాలు, సెల్ఫోన్ల కారణంగా వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నా, ఫిర్యాదు చేయలేకపోతున్నారు. నకిలీలను అరికట్టాలంటే ఏ ప్రభుత్వ శాఖకు ఫిర్యాదు చేయాలి ? ఏ అధికారి స్పందిస్తారు ? అనే సంశయంలో వారన్నారు.