బాన్సువాడ, న్యూస్‌లైన్ : నకిలీ మందులు.. నకిలీ నిత్యావసరాలు.. నాసిరకం బియ్యం.. కల్తీ నూనెలు.. ఇలా అన్ని రకాల వస్తువులకు నకిలీ బెడద ఇప్పటికే ఉంది. తాజాగా సెల్‌ఫోన్ రంగాన్ని నకిలీ మకిలీ అంటుకుంది. సెల్‌ఫోన్‌లు, వాటి విడిభాగాలు మార్కెట్‌ను శాసిస్తున్నాయి. నకిలీ వస్తువులను పసిగట్టి, చర్యలు తీసుకునేందుకు అధికారులకు వీలున్నప్పుడల్లా దాడులు చేస్తున్నా, సెల్‌ఫోన్ మార్కెట్‌లో మాత్రం నకిలీలను సీజ్ చేసేందుకు సాహసించడం లేదు. దీంతో జిల్లా మార్కెట్‌లో నకిలీల అమ్మకాలు జోరందుకున్నాయి.
బ్రాండెడ్‌తో పాటు...
ఈ రోజుల్లో సెల్‌ఫోన్ మనిషికి ప్రాథమిక వనరైంది. చేతిలో సెల్ లేని వ్యక్తి కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదు. ఇదే వ్యాపారులకు వరంగా మారింది. నకిలీలతో వినియోగదారుల జేబుకు చిల్లు పెడుతున్నారు. సెల్ కంపెనీల అంచనా ప్రకారం జిల్లాలో సుమారు 10 లక్షల ఫోన్లు ప్రజల చేతుల్లో ఉన్నాయి. ఇందులో నోకియా, సాంసంగ్, సోనీ, ఎల్‌జీ, ఆపిల్, బ్లాక్ బెర్రీ, సెల్‌కాన్, కార్బన్ కంపెనీల ఫోన్లు వాడుతున్నారు. అయితే చైనా ఫోన్లు వాడేవారి సంఖ్య సైతం అధికంగానే ఉంది. బ్రాండెడ్ కంపెనీల ధరలకంటే నాన్‌బ్రాండెడ్, మరీ ముఖ్యంగా చైనా ఫోన్ల ధరలు చాలా తక్కువగా ఉంటున్నాయి.
దీంతో ప్రజలు వాటినే కొంటున్నారు. వీటిలో తక్కువ ధరకే ఆడియో, వీడియో, నెట్, చాటింగ్ తదితర అన్ని రకాల సౌకర్యాలు ఉండటం కూడా వినియోగదారులు వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు. అవి ఎక్కువ రోజులు పని చేయవని తెలిసినామోడల్ నచ్చడంతో తరచూ రిపేర్లు చేయించుకొంటూనే వాడుతున్నారు. దీంతో విడి భాగాల అమ్మకాలు సైతం ఊపందుకున్నాయి. నకిలీలను తెచ్చి సొమ్ము చేసుకొంటున్నారు. వీటిని గుర్తించడం వినియోగదారులకు ఇబ్బందికరమే. జిల్లాలోని నిజామాబాద్, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, ఆర్మూర్, బోధన్ తదితర ప్రాంతాల్లో హోల్‌సెల్ విడిభాగాల దుకాణాలు ఉన్నాయి. వాటిలో 60 శాతం విడిభాగాలు నకిలీవేనని ‘న్యూస్‌లైన్’ పరిశీలనలో తేలింది. ఈ నకిలీలతోనే వ్యాపారులు అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.
నకిలీ విడిభాగాలు ఇవీ...
సెల్‌ఫోన్లలో పాటలు వినడం ఫ్యాషన్‌గా మారింది. ప్రతి సెల్‌లో మెమొరీ కార్డులుంటున్నాయి. వాటి విడి భాగాల షాపుల్లోనే మెమొరీ కార్డుల అమ్మకాలు సాగుతుంటాయి. వీటిలో అధికంగా రెండు, మూడో క్వాలిటీవే ఉంటున్నాయి. సామర్థ్యం ఆధారంగా *150 నుంచి *800ల వరకు మెమొరీ కార్డులను అమ్ముతున్నారు. వీటికి బిల్లు, గ్యారెంటీ, వారెంటీ ఏదీ ఇవ్వరు. కొద్ది రోజులకే పాడవుతుంటాయి. ఇవేకాక స్పీకర్లు, స్క్రీన్లు, కీప్యాడ్స్, టచ్‌ప్యాడ్స్, హెడ్‌సెట్ తదితర విడిభాగాలు సైతం నకిలీవే రాజ్యమేలుతున్నాయి.
సెల్‌ఫోన్ బ్యాటరీల అమ్మకాల్లో కూడా నకిలీలే అధికం. బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ బ్యాటరీలను వినియోగదారులకు అంటగడుతున్నారు. ఇవి పేలిన సందర్భాలు చాలా ఉన్నాయి. నకిలీ బ్యాటరీలు బ్రాండెడ్ కంపెనీల మాదిరిగానే ఉండటంతో వినియోగదారులు నష్టపోతున్నారు. వీటి అమ్మకాలపై పర్యవేక్షణ లేక మార్కెట్‌లో అవే రాజ్యమేలున్నాయి. చైనా సెల్‌ఫోన్లు తరచూ రిపేరుకు వస్తుండటంతో విడిభాగాల వ్యాపారం కూడా జోరుగా సాగుతోంది.
జిల్లాలో వ్యాపారం కోట్లలోనే..
జిల్లాలో ప్రతి నెల సుమారు కోటి నుంచి 1.5 కోట్ల మేర సెల్‌ఫోన్ విడిభాగాల అమ్మకాలు అవుతున్నాయి. హైదరాబాద్, చెన్నై, నాగ్‌పూర్‌ల నుంచి వ్యాపారులు విడిభాగాలను కొనుగోలు చేసి విక్రయిస్తుంటారు. హోల్‌సెల్ వ్యాపారులు ఢిల్లీ, ముంబై నుంచి సైతం విడిభాగాలు తెచ్చి అమ్ముతుంటారు. వీటితో వ్యాపారులకు రూపాయికి పది రూపాయల లాభం వస్తోంది. నకిలీ విడిభాగాలు, సెల్‌ఫోన్ల కారణంగా వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నా, ఫిర్యాదు చేయలేకపోతున్నారు. నకిలీలను అరికట్టాలంటే ఏ ప్రభుత్వ శాఖకు ఫిర్యాదు చేయాలి ? ఏ అధికారి స్పందిస్తారు ? అనే సంశయంలో వారన్నారు.
మార్కెట్ ‘నకిలీ’మయం
Published Sat, May 31 2014 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 8:05 AM
Advertisement
Advertisement