banspuwada
-
మార్కెట్ ‘నకిలీ’మయం
బాన్సువాడ, న్యూస్‌లైన్ : నకిలీ మందులు.. నకిలీ నిత్యావసరాలు.. నాసిరకం బియ్యం.. కల్తీ నూనెలు.. ఇలా అన్ని రకాల వస్తువులకు నకిలీ బెడద ఇప్పటికే ఉంది. తాజాగా సెల్‌ఫోన్ రంగాన్ని నకిలీ మకిలీ అంటుకుంది. సెల్ఫోన్లు, వాటి విడిభాగాలు మార్కెట్‌ను శాసిస్తున్నాయి. నకిలీ వస్తువులను పసిగట్టి, చర్యలు తీసుకునేందుకు అధికారులకు వీలున్నప్పుడల్లా దాడులు చేస్తున్నా, సెల్‌ఫోన్ మార్కెట్లో మాత్రం నకిలీలను సీజ్ చేసేందుకు సాహసించడం లేదు. దీంతో జిల్లా మార్కెట్లో నకిలీల అమ్మకాలు జోరందుకున్నాయి. బ్రాండెడ్‌తో పాటు... ఈ రోజుల్లో సెల్‌ఫోన్ మనిషికి ప్రాథమిక వనరైంది. చేతిలో సెల్ లేని వ్యక్తి కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదు. ఇదే వ్యాపారులకు వరంగా మారింది. నకిలీలతో వినియోగదారుల జేబుకు చిల్లు పెడుతున్నారు. సెల్ కంపెనీల అంచనా ప్రకారం జిల్లాలో సుమారు 10 లక్షల ఫోన్లు ప్రజల చేతుల్లో ఉన్నాయి. ఇందులో నోకియా, సాంసంగ్, సోనీ, ఎల్జీ, ఆపిల్, బ్లాక్ బెర్రీ, సెల్కాన్, కార్బన్ కంపెనీల ఫోన్లు వాడుతున్నారు. అయితే చైనా ఫోన్లు వాడేవారి సంఖ్య సైతం అధికంగానే ఉంది. బ్రాండెడ్ కంపెనీల ధరలకంటే నాన్‌బ్రాండెడ్, మరీ ముఖ్యంగా చైనా ఫోన్ల ధరలు చాలా తక్కువగా ఉంటున్నాయి. దీంతో ప్రజలు వాటినే కొంటున్నారు. వీటిలో తక్కువ ధరకే ఆడియో, వీడియో, నెట్, చాటింగ్ తదితర అన్ని రకాల సౌకర్యాలు ఉండటం కూడా వినియోగదారులు వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు. అవి ఎక్కువ రోజులు పని చేయవని తెలిసినామోడల్ నచ్చడంతో తరచూ రిపేర్లు చేయించుకొంటూనే వాడుతున్నారు. దీంతో విడి భాగాల అమ్మకాలు సైతం ఊపందుకున్నాయి. నకిలీలను తెచ్చి సొమ్ము చేసుకొంటున్నారు. వీటిని గుర్తించడం వినియోగదారులకు ఇబ్బందికరమే. జిల్లాలోని నిజామాబాద్, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, ఆర్మూర్, బోధన్ తదితర ప్రాంతాల్లో హోల్‌సెల్ విడిభాగాల దుకాణాలు ఉన్నాయి. వాటిలో 60 శాతం విడిభాగాలు నకిలీవేనని ‘న్యూస్‌లైన్’ పరిశీలనలో తేలింది. ఈ నకిలీలతోనే వ్యాపారులు అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. నకిలీ విడిభాగాలు ఇవీ... సెల్ఫోన్లలో పాటలు వినడం ఫ్యాషన్‌గా మారింది. ప్రతి సెల్లో మెమొరీ కార్డులుంటున్నాయి. వాటి విడి భాగాల షాపుల్లోనే మెమొరీ కార్డుల అమ్మకాలు సాగుతుంటాయి. వీటిలో అధికంగా రెండు, మూడో క్వాలిటీవే ఉంటున్నాయి. సామర్థ్యం ఆధారంగా *150 నుంచి *800ల వరకు మెమొరీ కార్డులను అమ్ముతున్నారు. వీటికి బిల్లు, గ్యారెంటీ, వారెంటీ ఏదీ ఇవ్వరు. కొద్ది రోజులకే పాడవుతుంటాయి. ఇవేకాక స్పీకర్లు, స్క్రీన్లు, కీప్యాడ్స్, టచ్ప్యాడ్స్, హెడ్సెట్ తదితర విడిభాగాలు సైతం నకిలీవే రాజ్యమేలుతున్నాయి. సెల్‌ఫోన్ బ్యాటరీల అమ్మకాల్లో కూడా నకిలీలే అధికం. బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ బ్యాటరీలను వినియోగదారులకు అంటగడుతున్నారు. ఇవి పేలిన సందర్భాలు చాలా ఉన్నాయి. నకిలీ బ్యాటరీలు బ్రాండెడ్ కంపెనీల మాదిరిగానే ఉండటంతో వినియోగదారులు నష్టపోతున్నారు. వీటి అమ్మకాలపై పర్యవేక్షణ లేక మార్కెట్లో అవే రాజ్యమేలున్నాయి. చైనా సెల్ఫోన్లు తరచూ రిపేరుకు వస్తుండటంతో విడిభాగాల వ్యాపారం కూడా జోరుగా సాగుతోంది. జిల్లాలో వ్యాపారం కోట్లలోనే.. జిల్లాలో ప్రతి నెల సుమారు కోటి నుంచి 1.5 కోట్ల మేర సెల్‌ఫోన్ విడిభాగాల అమ్మకాలు అవుతున్నాయి. హైదరాబాద్, చెన్నై, నాగ్‌పూర్‌ల నుంచి వ్యాపారులు విడిభాగాలను కొనుగోలు చేసి విక్రయిస్తుంటారు. హోల్‌సెల్ వ్యాపారులు ఢిల్లీ, ముంబై నుంచి సైతం విడిభాగాలు తెచ్చి అమ్ముతుంటారు. వీటితో వ్యాపారులకు రూపాయికి పది రూపాయల లాభం వస్తోంది. నకిలీ విడిభాగాలు, సెల్ఫోన్ల కారణంగా వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నా, ఫిర్యాదు చేయలేకపోతున్నారు. నకిలీలను అరికట్టాలంటే ఏ ప్రభుత్వ శాఖకు ఫిర్యాదు చేయాలి ? ఏ అధికారి స్పందిస్తారు ? అనే సంశయంలో వారన్నారు. -
సబ్సిడీ రుణాలు ఏవీ !
బాన్సువాడ, న్యూస్‌లైన్ : బాన్సువాడకు చెందిన షంషొద్దీన్ అనే మెకానిక్ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా అందిస్తున్న సబ్సిడీ రుణాల కోసం మూడు నెలల క్రితం దరఖాస్తు చేసుకొన్నాడు. సార్వత్రిక ఎన్నికల కారణంగా సబ్సిడీ రుణాల ప్రక్రియ ఆగిపోయింది. ప్రస్తుతం ఎన్నికలు ముగిసి వారం రోజులైనా నిధులు విడుదల కాలేదు. మరోవైపు రాష్ట్ర విభజన ప్రక్రియ సాగుతోంది.. ఈ నేపథ్యంలో తనకు రుణం అందిస్తారో లేదో అనే ఆందోళనలో అతను ఉన్నాడు.. ఇది ఒక్క షంషొద్దీన్కే కాదు జిల్లా వ్యాప్తంగా సుమారు మూడు వేల మంది ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ,బీసీ, వికలాంగ యువతీ యువకుల్లో నెలకొన్న ఆందోళన. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జనవరి నెలలో అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు 50శాతం సబ్సిడీపై రుణాలు ఇచ్చేందుకు నిర్ణయించింది. లక్ష రూపాయల సబ్సిడీ తీసుకొంటే 50వేలు బ్యాంకు ద్వారా,50వేలు సంబంధిత కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ అందజేస్తారు. ఒక కుటుంబంలో ఒకరికే అవకాశం కల్పించడంతో పాటు వారికి ఐదేళ్ళ పాటు మరోమారు రుణం ఇవ్వరు. అయితే సబ్సిడీ శాతం పెరగడంతో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన యువతీ యువకులు వేల సంఖ్యలో దరఖాస్తు చేసుకొన్నారు. యుద్ధప్రాతిపదికన జరిగిన ఎంపిక ప్రక్రియను పూర్తి చేసిన ఆయా కార్పొరేషన్ల అధికారులు, లబ్ధిదారులకు సంబంధించిన జీరో అకౌంట్ బ్యాలెన్సులతో బ్యాంకుల్లో ఖాతా సైతం తెరిచారు. 2లక్షల రుణం తీసుకుంటే లక్ష సబ్సిడీ రూపంలో వస్తుందని తెలుసుకొని దరఖాస్తు చేసుకొన్నారు. అయితే గత రెండు రోజుల్లో కొందరికే సబ్సిడీ మంజూరైంది. 2లక్షల రుణం కోసం దరఖాస్తు చేసుకొన్న వారికి సబ్సిడీ విడుదల కాలేదు. ఒక్క మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారానే జిల్లా వ్యాప్తంగా 1,292 మంది నిరుద్యోగ మైనారిటీ యువ తీయువకులకు రుణాలు ఇవ్వడానికి ఎంపిక చేయగా, ఒక్కో మండలానికి సగటున 50 మందికి రుణాల మంజూరీ ఇచ్చారు. దీని ద్వారా రాయితీ రూపంలో సుమారు 10 కోట్ల వరకు లబ్ధి పొందనున్నారు. గతంలో మైనారిటీ కార్పొరేషన్ ద్వారా లక్ష రుణం తీసుకుంటే గరిష్టంగా 30వేల సబ్సిడీ అందించే వారు. ఇప్పుడు దీనిని 50వేలకు పెంచారు. ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి కల్లా ఈ లక్ష్యం పూర్తి కావాల్సి ఉంది. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో సబ్సిడీ రుణాల ప్రక్రియ నిలిచిపోయింది. సబ్సిడీ రుణాలు వస్తున్నాయనే ఉత్సాహంలో అనేక మంది నిరుద్యోగులు తమ వ్యాపారాలను వృద్ధి చేసుకొనేందుకు వడ్డీపై వస్తుసామాగ్రిని కొనుగోలు చేశారు. కొందరు కొత్తగా వ్యాపారాలు పెట్టడానికి మడిగెలను అద్దెకు తీసుకొని ప్రస్తుతం వేలకు వేలు చెల్లిస్తున్నారు. ఇలా వేలాది మంది తమకు సబ్సిడీ రుణాలు వస్తాయనే ఆశతో ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈనెల 24లోపే రాష్ట్రంలోని అన్ని పద్దులను సరిచేసుకోవాల్సి ఉంది. దీంతో తమకు సబ్సిడీ రుణాలు వస్తాయా? లేదా? అనేది స్పష్టం కావడం లేదని లబ్ధిదారులు అంటున్నారు. ఈ విషయమై అధికారులు సైతం ఏ మాత్రం స్పందించడం లేదు. -
సౌకర్యాలు లేకనే..
బాన్సువాడ టౌన్, న్యూస్‌లైన్ : అకాల వర్షాలు రైతన్నలను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. అసలే ధాన్యం కొనుగోళ్లు లేక, కనీస మద్దతు ధర రాక తీవ్ర ఆందోళన చెందుతున్న రైతులపై ప్రకృతి విరుచుకు పడుతోంది. బాన్సువాడ మండలంలో మంగళవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ వర్షం వల్ల మండలంలోని వేలాది క్వింటాళ్ల ధాన్యం తడిసి ముద్దయింది. బాన్సువాడ మార్కెట్ యార్డులో ఉన్న ధాన్యం కుప్పలన్నీ వర్షం నీటిలో మునిగి పోయాయి. పొద్దంతా ఎండలు మండిపోతున్నాయి. రాత్రి వేళ వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వచ్చి వర్షం కురియడంతో రైతులు ధాన్యాన్ని కాపాడుకోలేక పోతున్నారు. రైతులకు తాటిపత్రులు కూడా అందుబాటులో ఉండక పోవడంతో ధాన్యం కుప్పలు తడిసి పోతున్నాయి. బాన్సువాడ మండలంలోని తాడ్కోల్, సోమేశ్వర్, బుడ్మి, తిర్మలాపూర్, చింతల్‌నాగారం, బోర్లం తదితర గ్రామాల్లో పొలాల్లోనే ఉన్న ధాన్యం వర్షానికి తీవ్రంగా దెబ్బతిన్నది. చింతల్ నాగారంలో రెండు రోజుల క్రితమే సుమారు 400 ఎకరాల్లో రైతులు వరి కోతలు కోసి ధాన్యాని ఆరబెట్టారు. వర్షం దాటికి కుప్పలన్నీ నానిపోయాయి. ఎకరానికి రూ. 30 వేల నుంచి రూ. 40 వేల వరకు నష్టం వాటిల్లినట్లు రైతులు పేర్కొంటున్నారు. గన్నీ సంచుల కొరత, రైస్ మిల్లర్ల నిబంధనలు, హమాలీల కొరత కారణంగా ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం జరుగుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో రోజుల తరబడి ధాన్యం కాంటాలు కావడం లేదని, ఫలితంగా ధాన్యం కుప్పలన్నీ వర్షం పాలవుతున్నట్లు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.