బాన్సువాడ, న్యూస్‌లైన్ : బాన్సువాడకు చెందిన షంషొద్దీన్ అనే మెకానిక్ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా అందిస్తున్న సబ్సిడీ రుణాల కోసం మూడు నెలల క్రితం దరఖాస్తు చేసుకొన్నాడు. సార్వత్రిక ఎన్నికల కారణంగా సబ్సిడీ రుణాల ప్రక్రియ ఆగిపోయింది. ప్రస్తుతం ఎన్నికలు ముగిసి వారం రోజులైనా నిధులు విడుదల కాలేదు. మరోవైపు రాష్ట్ర విభజన ప్రక్రియ సాగుతోంది.. ఈ నేపథ్యంలో తనకు రుణం అందిస్తారో లేదో అనే ఆందోళనలో అతను ఉన్నాడు.. ఇది ఒక్క షంషొద్దీన్‌కే కాదు జిల్లా వ్యాప్తంగా సుమారు మూడు వేల మంది ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ,బీసీ, వికలాంగ యువతీ యువకుల్లో నెలకొన్న ఆందోళన.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జనవరి నెలలో అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు 50శాతం సబ్సిడీపై రుణాలు ఇచ్చేందుకు నిర్ణయించింది. లక్ష రూపాయల సబ్సిడీ తీసుకొంటే 50వేలు బ్యాంకు ద్వారా,50వేలు సంబంధిత కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ అందజేస్తారు. ఒక కుటుంబంలో ఒకరికే అవకాశం కల్పించడంతో పాటు వారికి ఐదేళ్ళ పాటు మరోమారు రుణం ఇవ్వరు. అయితే సబ్సిడీ శాతం పెరగడంతో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన యువతీ యువకులు వేల సంఖ్యలో దరఖాస్తు చేసుకొన్నారు.
యుద్ధప్రాతిపదికన జరిగిన ఎంపిక ప్రక్రియను పూర్తి చేసిన ఆయా కార్పొరేషన్ల అధికారులు, లబ్ధిదారులకు సంబంధించిన జీరో అకౌంట్ బ్యాలెన్సులతో బ్యాంకుల్లో ఖాతా సైతం తెరిచారు. 2లక్షల రుణం తీసుకుంటే లక్ష సబ్సిడీ రూపంలో వస్తుందని తెలుసుకొని దరఖాస్తు చేసుకొన్నారు. అయితే గత రెండు రోజుల్లో కొందరికే సబ్సిడీ మంజూరైంది. 2లక్షల రుణం కోసం దరఖాస్తు చేసుకొన్న వారికి సబ్సిడీ విడుదల కాలేదు. ఒక్క మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారానే జిల్లా వ్యాప్తంగా 1,292 మంది నిరుద్యోగ మైనారిటీ యువ తీయువకులకు రుణాలు ఇవ్వడానికి ఎంపిక చేయగా, ఒక్కో మండలానికి సగటున 50 మందికి రుణాల మంజూరీ ఇచ్చారు. దీని ద్వారా రాయితీ రూపంలో సుమారు 10 కోట్ల వరకు లబ్ధి పొందనున్నారు.
గతంలో మైనారిటీ కార్పొరేషన్ ద్వారా లక్ష రుణం తీసుకుంటే గరిష్టంగా 30వేల సబ్సిడీ అందించే వారు. ఇప్పుడు దీనిని 50వేలకు పెంచారు. ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి కల్లా ఈ లక్ష్యం పూర్తి కావాల్సి ఉంది. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో సబ్సిడీ రుణాల ప్రక్రియ నిలిచిపోయింది. సబ్సిడీ రుణాలు వస్తున్నాయనే ఉత్సాహంలో అనేక మంది నిరుద్యోగులు తమ వ్యాపారాలను వృద్ధి చేసుకొనేందుకు వడ్డీపై వస్తుసామాగ్రిని కొనుగోలు చేశారు.
కొందరు కొత్తగా వ్యాపారాలు పెట్టడానికి మడిగెలను అద్దెకు తీసుకొని ప్రస్తుతం వేలకు వేలు చెల్లిస్తున్నారు. ఇలా వేలాది మంది తమకు సబ్సిడీ రుణాలు వస్తాయనే ఆశతో ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈనెల 24లోపే రాష్ట్రంలోని అన్ని పద్దులను సరిచేసుకోవాల్సి ఉంది. దీంతో తమకు సబ్సిడీ రుణాలు వస్తాయా? లేదా? అనేది స్పష్టం కావడం లేదని లబ్ధిదారులు అంటున్నారు. ఈ విషయమై అధికారులు సైతం ఏ మాత్రం స్పందించడం లేదు.
సబ్సిడీ రుణాలు ఏవీ !
Published Mon, May 26 2014 2:44 AM | Last Updated on Sat, Sep 2 2017 7:50 AM
Advertisement
Advertisement