సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ ముస్లిం నేత కరీం ఖాన్
రాజమహేంద్రవరం సిటీ: ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ ద్వారా వంద రోజుల శిక్షణ పొందిన ముస్లిం మహిళలకు కుట్టుమెషిన్ల పంపిణీ వ్యవహారం వైఎస్సార్ సీపీదే తప్ప ప్రభుత్వానిది కాదని వక్ఫ్ బోర్డు మాజీ జిల్లా అధ్యక్షుడు ఎండీ కరీంఖాన్ అన్నారు. ఈ మెషీన్ల పంపిణీ కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానిని పిలువలేదంటూ టీడీపీకి చెందిన ముస్లిం నేతల విమర్శలను ఆయన ఖండించారు. స్థానిక ప్రెస్ క్లబ్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ముస్లిం మైనారిటీ సంస్థ ద్వారా ఈ మెషీన్లు మంజూరైనట్టు చెప్పారు. ఆ మెషీన్లు పాడయ్యే పరిస్థితి రావడంతో ప్రముఖులతో పంపిణీ తామే చేపట్టామన్నారు. ఎమ్మెల్యే భవాని అంటే గౌరవం ఉందని, వైఎస్సార్ సీపీకి చెందిన విషయం కావడంతో ఎమ్మెల్యేను ఆహా్వనించలేదని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు టీడీపీ ప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరైనట్టు ప్రకటించారని, అయితే జీఓలే నిధులు మంజూరు కాలేదన్నారు. ఆ నిధులు ఎక్కడ ఉన్నాయో చెబితే ముస్లిం సంక్షేమానికి ఖచ్చు చేస్తామన్నారు. టీడీపీ పాలనలో వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం అయ్యాయని ఆరోపించారు.
మాటపై నిలబడి సుభాన్ రాజకీయాల్లోంచి తప్పుకుంటారా?
కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సోషల్ మీడియాలో టీడీపీ నాయకుడు షేక్ సుభాన్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ మాటపై నిలబడి రాజకీయాల నుంచి ఆయన వైదొలగాలని అన్నారు. సుభాన్ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నగరంలో ముస్లింల ఆస్తులు కారుచౌకగా లీజుకు ఇచ్చిన టీడీపీ నాయకులు ఆర్థికంగా ఫలితాలు పొందారన్నారు.
రాజమహేంద్రవరం పార్లమెంట్ మైనార్టీ సెల్ నాయకుడు మహ్మద్ ఆరిఫ్ మాట్లాడుతూ అబ్దుల్ కలాం పురస్కారం పేరు మార్పు విషయంలో అధికారుల అత్యుత్సాహానికి పాల్పడ్డారనే విషయం సీఎం గుర్తించారన్నారు. రాష్ట్రంలో ముస్లింలు సీఎం వెన్నంటి ఉన్నారన్నారు. టీడీపీ నాయకులు లేనిపోని విమర్శలు చేసి ఉన్న పరువు పోగొట్టుకోవద్దని సలహా ఇచ్చారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ ముస్లిం నాయకులు సయ్యద్ రబ్బాని, నయూమ్ భాయ్, హసన్, సయ్యద్ మదీనా, గౌస్, ఆరిఫ్ ఉల్లాఖాన్, షేక్ మస్తాన్, అమనుల్లా బేగ్, సయ్యద్, ఈసా మొగల్, అల్తాఫ్, షరీఫ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment