బాబోయ్‌.. నకిలీ మందులు! | fake drugs | Sakshi
Sakshi News home page

బాబోయ్‌.. నకిలీ మందులు!

Published Tue, Jul 26 2016 5:01 PM | Last Updated on Mon, Oct 1 2018 6:38 PM

బాబోయ్‌.. నకిలీ మందులు! - Sakshi

బాబోయ్‌.. నకిలీ మందులు!

  పనిచేయని కలుపు నివారణ మందులు
⇒  రూ.వేలు ఖర్చుచేసినా నష్టపోతున్న రైతన్నలు
⇒  ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఫర్టిలైజర్‌ షాపుల యజమానులు
⇒  రైతులకు బిల్లులు ఇవ్వని వ్యాపారులు
⇒  వ్యవసాయ అధికారుల పర్యవేక్షణ శూన్యం

యాలాల: రెండేళ్లుగా ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు.. కరువుతో అల్లాడుతున్న రైతన్నలకు ఈ సారి కురుస్తున్న వర్షాలతో ఆశలు చిగురించాయి. అయితే, వారి ఆశలను నకిలీ పురుగు మందులు అడియాశలు చేస్తున్నాయి. తాము సాగుచేస్తున్న పంట పొలాల్లో పెరుగుతున్న కలుపు నివారణ మందులు నకిలీవి కావడంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. యాలాల మండలంలోని తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన భీమప్ప గ్రామ శివారులో ఆరెకరాలు కౌలుకు తీసుకొని కందిని సాగు చేస్తున్నాడు. కంది పంటలో కలుపు మందు పెరగుతుండడంతో ఈ నెల 14న తాండూరులోని అన్నదాత ఫర్టిలైజర్‌ షాపు నుంచి రూ.3,200 పెట్టి నాలుగు లీటర్ల కలుపు నివారణ మందును కొనుగోలు చేశాడు. దానిని పొలంలో చల్లాడు. అయినప్పటికీ పొలంలో కలుపు శాతం తగ్గకపోగా మరింత పెరగడంతో బాధిత రైతు ఆందోళన వ్యక్తం చేశాడు. దీనికితోడు పొలాల్లో కలుపు నివారణకు కూలీలు లభించక, వేసిన పంట కళ్ల ముందే నష్టపోతుండడంతో రైతన్న లబోదిబోమంటున్నాడు. ఇదే విషయమై ఫర్టిలైజర్‌ షాపు నిర్వాహకులను బాధిత రైతు ప్రశ్నిస్తే నిర్లక్ష్య సమాధానం ఇచ్చాడని వాపోయాడు. ఫర్టిలైజర్‌ షాపు నిర్వాహకులు మందులు ఇచ్చిన అనంతరం బిల్లులు ఇవ్వకపోగా, కనీసం మందు ఎలా పిచికారి చేయాలి, ఎంత మోతాదులో వాడాలి? ఎలా వాడాలి? తదితర వివరాలు తెలియజేయాల్సి ఉన్నా ఇవన్నీ పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. దీనికి తోడు ఫర్టిలైజర్‌ షాపుల పట్ల వ్యవసాయ శాఖ అధికారులు ‘చూసీచూడనట్లు’ వ్యవహరిస్తుండడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రైతుల వాదన. ఇది ఒక్క భీమప్ప పరిస్థితే కాదు. మండలంలో వివిధ పంటలు సాగుచేస్తున్న రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. మందులు కొనుగోలు చేసిన అనంతరం షాపు నిర్వాహకులు తెల్ల కాగితంపై ధర మాత్రమే రాసి ఇస్తున్నారు. ఇదేంటని అడిగిన రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
 
బిల్లులు ఇవ్వని దుకాణాలపై కఠిన చర్యలు!

మందులు కొనుగోలు చేసిన రైతులు బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఏ ఫర్టిలైజర్‌ షాపు నిర్వాహకుడైనా బిల్లు ఇవ్వకపోతే అడిగి మరీ తీసుకోండి. బిల్లులు ఇవ్వని దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. లైసెన్సులు రద్దు చేస్తాం. తిమ్మాయిపల్లి రైతు భీమప్ప విషయంలో విచారణ జరిపి చర్య తీసుకుంటాం. - గిరిబాబు, మండల వ్యవసాయాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement