లెప్రసీ వ్యాధికి వ్యాక్సిన్ కనుగొన్న భారత్
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా భారత్ లెప్రసీ (కుష్టు వ్యాధి)ని నిరోధించేందుకు వ్యాక్సిన్ కనుగొన్నది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలోజి వ్యవస్థాపక డైరెక్టర్ జీపీ తల్వార్ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. ఈ వ్యాక్సిన్‌ను ఉపయోగించేందుకు భారత్ డ్రగ్ కంట్రోలర్ జనరల్‌తో పాటు అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిష్ట్రేషన్ విభాగం అనుమతి మంజూరు చేసింది.
ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముందుగా బీహార్, గుజరాత్‌లోని ఐదు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద కొన్ని వారాల్లోనే అమలు చేయనున్నారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. 2013-14 లెక్కల ప్రకారం దేశంలో 1.27 లక్షల మంది రోగులు లెప్రసీతో బాధ పడుతున్నారు.
ఈ వ్యాక్సిన్ ఫలితాలను అంచనా వేసేందుకు లెప్రసీ రోగులతో కలసిమెలసి ఉండే కుటుంబ సభ్యలకు వ్యాక్సిన్‌ను ఇచ్చారు. మూడేళ్ల కాలంలోనే 60 శాతం కేసులు తగ్గిపోయాయి. అంటే వారికి లెప్రసీ వ్యాధి రాలేదు. ముందుగా దేశవ్యాప్తంగా వాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత కుష్టు రోగులను పూర్తిగా నయం చేసేందుకు కూడా ఈ వ్యాక్సిన్ ద్వారా కృషి చేస్తామని భారతీయ వైద్య పరిశోధనా మండలి డైరెక్టర్ జనరల్ సౌమ్యా స్వామినాథన్ తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే లెప్రసీ వ్యాధి ఎక్కువగా ఉన్న దేశంలోని 127 జిల్లాల్లో ఏడున్నర కోట్ల మంది ప్రజలపై పరీక్షలు జరపగా వారిలో ఐదువేల మందికి లెప్రసీ వ్యాధి ఉన్నట్లు తేలింది.