
దేశంలోని అత్యున్నత కేంద్రీయ ఔషధ నియంత్రణ అధారిటీ తన తాజా నివేదికలో వెల్లడించిన అంశాలు సంచలనం రేపుతున్నాయి. మనం తరచూ వాడే మందుల్లో 50కి పైగా ఔషధాల నమూనాలు ‘నిర్ణీత నాణ్యతాప్రమాణాలకు తగినట్టు లేనివి’(ఎన్‌ఎస్‌క్యూ) అంటూ నివేదిక వెల్లడించింది. జ్వరం, కడుపులో పూత లాంటి వాటికి వాడే ప్యారాసెటమాల్, పాన్–డి మందులతో సహా విటమిన్ సప్లిమెంట్లు, షుగర్ వ్యాధి మాత్రలు, యాంటీ బయాటిక్స్ సైతం ఆ జాబితాలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
నాసిరకం మందులను ఉత్పత్తి చేసినవాటిలో కొన్ని పేరున్న సంస్థల పేర్లూ ఉండేసరికి ఆందోళన రెట్టింపవుతోంది. అమాయక ప్రజల ఆరోగ్యభద్రతకై అత్యవసర చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. అదే సమయంలో ఔషధాల తయారీకి ప్రధాన కేంద్రంగా, అంతర్జాతీ యంగా ఔషధాల ఎగుమతిలో అగ్రగామిగా, ‘ప్రపంచానికే మందుల అంగడి’గా భారతదేశానికి గుర్తింపున్న నేపథ్యంలో నాణ్యతపై మనం మరింతగా దృష్టి పెట్టాల్సి ఉందని అర్థమవుతోంది.
గత ఏడాదీ 51 ఔషధాలు నాణ్యతా పరీక్షలో విఫలమయ్యాయి. ప్రభుత్వ ఔషధ విభాగం నిరుడు 1,306 నమూనాలను పరీక్షించినప్పుడు, అది బయటపడింది. నిజానికి, భారతదేశంలో ఔషధాలు, సౌందర్య ఉత్పత్తుల నాణ్యత అంశం ‘1940 నాటి ఔషధ, సౌందర్య ఉత్పత్తుల చట్టం’ కిందకు వస్తుంది. ఆ చట్టం ప్రకారమే వీటి పర్యవేక్షణ, నియంత్రణ సాగుతుంది. ఔషధ నియంత్రణ అధికారులు క్రమం తప్పకుండా మార్కెట్ నుంచి ఔషధ నమూనాలను సేకరించి, పరీక్షలు చేస్తుంటారు.
చట్టప్రకారం నిర్దేశించిన ప్రమాణాలను పాటించని ఉత్పత్తుల గురించి ప్రతి నెలా నివేదిక విడుదల చేస్తారు. కేంద్రీయ ఔషధ నాణ్యతా నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ) సర్వసాధారణంగా ఇలా పరీక్షలు జరపడం, వాటి ఫలితాలనూ – ఆ పరీక్షల్లో తప్పిన మందుల జాబితానూ ఎప్పటి కప్పుడు వెల్లడించడం కచ్చితంగా మంచిదే. అన్ని వర్గాలూ అప్రమత్తమయ్యే వీలు చిక్కుతుంది. అయితే, సామాన్య జనం నిత్యం వాడే యాంటీ బయాటిక్స్, షుగర్, బీపీల మందులు కూడా నిర్ణీత నాణ్యతా ప్రమాణాల్లో విఫలమవుతున్నట్టు ఇటీవలి నివేదికల్లో వెల్లడవడం ఆందోళన రేపుతోంది. పైగా, ప్రమాణాలు పాటించని జాబితాలోని మందులు ఎక్కువవుతూ ఉండడం గమనార్హం.
తాజాగా ఈ ఆగస్టులో చేసిన పరీక్షల్లో కొన్ని రకాల సీ విటమిన్, బీ కాంప్లెక్స్ మందులూ నాసి రకమేనని తేలింది. భారతీయ ఔషధ ప్రబంధం నిర్దేశాలకు అనుగుణంగా కొన్ని మందులు ‘విలీన పరీక్ష’లో, మరికొన్ని ‘నీటి పరీక్ష’లో విఫలమైనట్టు అధికారిక కథనం.
నాణ్యత మాట అటుంచితే, కొన్ని బ్యాచ్‌ల ఔషధాలు అచ్చంగా నకిలీవట! ఇది ప్రజల ఆరోగ్యానికి హానికరమే కాక, విశ్వ వేదికపై ఔషధ సరఫరాదారుగా భారతదేశ పేరుప్రతిష్ఠలకు భంగకరం కూడా! సహజంగానే పలు మందుల కంపెనీలు తాము తయారు చేస్తున్నవి అన్ని రకాలుగా నాణ్యమైనవేనంటూ ప్రతిస్పందిస్తున్నాయి.
నాణ్యత లేకపోవడానికీ – నకిలీ మందులకూ చాలా తేడా ఉందనీ, దాన్ని స్పష్టంగా గుర్తించాలనీ పేర్కొంటున్నాయి. అది నిజమే కానీ, అసలు అనుమానాలే రాని రీతిలో, లోపరహితంగా మందుల తయారీ బాధ్యత ఆ రంగంలో ఉన్న తమదేనని ఆ సంస్థలు మరువరాదు. ఆ మాటకొస్తే, ఈ రంగానికి ఉన్న ప్రతిష్ఠను కాపాడేందుకు ముందుగా అవే చొరవ తీసుకోవాలి.
ఔషధ రంగం మన దేశానికి అత్యంత కీలకమైనది. దేశంలో కనీసం 10 వేల దాకా ఔషధ తయారీ యూనిట్లున్నాయి. దాదాపు 200కు పైగా దేశాలకు భారత్ నుంచి మందులు సరఫరా అవుతుంటాయి. మన ఔషధ విపణి పరిమాణం దాదాపు 5 వేల కోట్ల డాలర్లు. పైగా సరసమైన ధరలకే మందులు అందిస్తున్న పేరున్న మన మార్కెట్ ప్రస్తుతం రెండంకెల వృద్ధి రేటుతో పురోగమిస్తోంది.
కోవిడ్ సమయంలోనే కాక, విడిగానూ అనేక రోగాలకు టీకాలు అందించడంలో భారత్ అగ్రశ్రేణిలో నిలిచిందని పాలకులు పదే పదే చెప్పుకొస్తుంటారు. అలాంటప్పుడు మన దగ్గర తయారయ్యే ఔషధాల నాణ్యతపై మరింత అప్రమత్తత తప్పనిసరి కదా!
దురదృష్టవశాత్తూ, అందులోనే మనం వెనుకబడుతున్నాం. గ్యాంబియా, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాల్లో సంభవించిన బాలల మరణాలకు భారతీయ తయారీ ఔషధాలే కారణమంటూ ఆ మధ్య అంతర్జాతీయ వివాదాలు తలెత్తిన సంగతి విస్మరించలేం. అంటే బయటపడ్డ కొన్ని మందుల విషయంలోనే కాదు...
మొత్తంగా ఔషధతయారీ, నాణ్యత, నియంత్రణ వ్యవస్థపై లోతుగా దృష్టి పెట్టాల్సి ఉంది. ఎగుమతి మాట దేవుడెరుగు... ముందుగా ప్రభుత్వాలకైనా, ఔషధ తయారీ సంస్థలకైనా ప్రజారోగ్య భద్రత ముఖ్యం కావాలి. అందులో ఎవరు రాజీపడినా అమాయకుల ప్రాణాలతో చెలగా టమే. అది సహించరానిది, భరించ లేనిది. అందువల్ల నాసిరకమనీ, నకిలీవనీ తెలిసిన మందులను మార్కెట్ నుంచి వెంటనే వెనక్కి రప్పించాలి.
అందుకు చట్టం, తగిన విధివిధానాలు లేకపోలేదు. కానీ, వాటిని ఏ మేరకు అమలు చేస్తున్నారన్నది చెప్పలేని పరిస్థితి. అది మారాలి. అలాగే, నాణ్యతా పరీక్షల్లో లోటుపాట్లు లేకుండా చూడడం కీలకం. పరీక్షల కోసం నమూనాలను ఎప్పుడు తీసుకు న్నదీ, ఎన్ని తీసుకున్నదీ ప్రకటించడం వల్ల మరింత పారదర్శకత నెలకొంటుంది. కొత్త అనుమానా లకు ఆస్కారమివ్వకుండా పోతుంది.
విదేశాల్లోనే కాక, ప్రస్తుతం స్వదేశంలోనూ ఔషధాలపై సందే హాలు ముసురుకుంటున్న వేళ ప్రపంచస్థాయి ప్రమాణాలు అందుకొనేలా మన మందుల తయారీ సాగాలి. అవసరమైతే అందుకు అంతర్జాతీయ నియంత్రణ సంస్థలతో కలసి అడుగులు వేయాలి. ఇంటా బయటా మన ఔషధాలు ఆరోగ్యభద్రతకు చిరునామా కావాలే తప్ప రోగుల నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. ఎందుకంటే, మందుల విలువ కన్నా మనుషుల ప్రాణాల విలువ ఎక్కువ!
Comments
Please login to add a commentAdd a comment