ఒకే రోజు రెండు విషాద వార్తలు! రెండూ పసిపిల్లలకు సంబంధించినవే. థాయ్‌లాండ్‌లోని శిశు సంరక్షణాలయంపై ఉన్మాది బుల్లెట్లు కురిపించి 37 మంది ప్రాణాలు తీశాడు. మన దేశానికి చెందిన మేడెన్ ఫార్మాస్యూటికల్ సంస్థ ఉత్పత్తి చేసిన మందుల కారణంగా ఆఫ్రికా ఖండ దేశమైన గాంబియాలో 66 మంది చిన్నారులు గత నెలలో ప్రాణాలు కోల్పోయారు.
మారణాయుధంతో పసికూనలపై విరుచుకుపడిన రాక్షసుడికీ... కేవలం లాభార్జన కాంక్షతో కలుషిత ఉత్పత్తులకు ఔషధమన్న ముద్రేసి అంటగట్టిన సంస్థ యజమానులకూ తేడా ఏమీ లేదు. కొన్ని ఔషధ సంస్థల టక్కుటమార విద్యలపైనా, వాటి ఉత్పత్తులపైనా ప్రజారోగ్య రంగంలో పనిచేస్తున్న దినేష్ ఎస్. ఠాకూర్ వంటి నిపుణులు తరచు హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ సరైన పర్యవేక్షణ కొరవడిన చోట అలాంటివారిది అరణ్యరోదనే అవుతోంది.
ఇప్పుడు గాంబియా పసిపిల్లల ఉసురు తీసిన మందులకు భారత్‌లో విక్రయించడానికి అనుమతుల్లేవని అంటున్నారు. మన దేశంలో విక్రయానికి పనికిరాని ఉత్పత్తులు గాంబియాకు ఎలా పోయాయి? అంతర్జాతీయంగా మన పరువు తీసిన ఈ ఉదంతం తర్వాతనైనా పాలకులు మేల్కొనవలసి ఉంది. ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా ప్రాంత దేశాల్లో మన ఫార్మా రంగ సంస్థలదే పైచేయి.
ఆఖరికి రష్యా, పోలాండ్, బెలారస్ వంటి దేశాల్లోనూ మన ఔషధాలే కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా మూడోవంతు ఫార్మా ఉత్పత్తులు మన దగ్గర నుంచే ఎగుమతి అవుతున్నాయి. అయినా పటిష్టమైన నియంత్రణ వ్యవస్థ అవసరమని పాలకులు గుర్తించలేదు!
పౌష్టికాహారలోపం, వాతావరణ కాలుష్యం, అపరిశుభ్రమైన నీరు, విషాహారం తదితరాలు ప్రజలను రోగాలబారిన పడేస్తాయి. రోగగ్రస్తులకు అందుబాటులో ఉంటున్న ఔషధాలు జబ్బు తగ్గించటం మాట అటుంచి ప్రాణాలు తీయడమంటే అంతకన్నా ఘోరమైన నేరం ఉంటుందా? కానీ చట్టంలో ఉండే లొసుగుల కారణంగా ఈ నేరం నిత్యం జరుగుతూనే ఉంది.
ఆఫ్రికా దేశాల్లో, ముఖ్యంగా గాంబియాలో సరైన ఔషధ నియంత్రణ వ్యవస్థ లేదనీ, జవాబుదారీతనం అసలే లేదనీ కొందరంటున్నారు. కానీ మనదగ్గరమటుకు ఏం ఉన్నట్టు? హరియాణాలోని కుండ్లీలో ఉన్న తమ ఫ్యాక్టరీలో ఉన్నతమైన ప్రమాణాలు పాటిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించిందని గాంబియా విషాదం వెల్లడి కాకముందు మేడెన్ ఔషధ సంస్థ వెబ్‌సైట్ ఘనంగా చెప్పుకొంది.
ప్రస్తుతం దాన్ని తొలగించి హరియాణాలోనే ఉన్న మరో ఫ్యాక్టరీకి, హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న ఫ్యాక్టరీకి ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు దక్కిందని ఆ సంస్థ గొప్పలు పోతోంది. అంతేకాదు... తమకు ఐఎస్‌ఓ గుర్తింపు కూడా వచ్చిందంటున్నది. మేడెన్ సంస్థ ఫ్యాక్టరీలనుగానీ, దాని ఉత్పత్తులనుగానీ తనిఖీలు చేయలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అటు ఐఎస్‌ఓ గుర్తింపు పొందిన ఔషధ సంస్థల జాబితాలో మేడెన్ లేనేలేదు.
ప్రాణప్రదమైన ఔషధ సంస్థలు ఇలా ఇష్టానుసారం ప్రకటించుకుని జనం ప్రాణాలతో చెలగాటమాడుతుంటే అన్ని వ్యవస్థలూ గుడ్లప్పగించి చూస్తూ ఉండటం విస్మయం కలిగిస్తోంది. ఈ సంస్థపై గత దశాబ్దకాలంలో బిహార్, గుజరాత్, కేరళ, జమ్మూ, కశ్మీర్‌లు ఫిర్యాదులు చేశాయి. కానీ అవన్నీ నాసిరకమైన మందులకు సంబంధించిన ఫిర్యాదులు. ఇప్పుడు గాంబియా పిల్లల ప్రాణాలు తీసిన దగ్గు, జలుబు మందుల్లో అత్యంత ప్రమాదకరమైన డైథిలీన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ రసాయనాలు మోతాదుమించి ఉన్నాయని తేల్చారు.
ఇవి కిడ్నీలనూ, ఇతర అంగాలనూ తీవ్రంగా దెబ్బతీయటంతో పిల్లలు మరణించారని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. గ్లిసరిన్‌ను సాంద్రత బాగా తగ్గించి దగ్గు మందుల్లో వినియోగిస్తారు. గ్లిసరిన్‌తో పోలిస్తే ఈ రెండు రసాయనాలూ చవగ్గా లభిస్తాయని చాలామంది వాటివైపు మొగ్గుతున్నారు. అయితే పెయింట్లు, ఇంకులూ తయారీలో వినియోగించే ఈ రసాయనాలు ఏమాత్రం మోతాదు మించినా ప్రాణాంతకమవుతాయి. ఇప్పుడు గాంబియాలో జరిగింది అదే.
మనకు ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ(సీడీఎస్‌సీఓ) ఉంది. దేశంలో అనేకచోట్ల కేంద్ర ఔషధ పరీక్ష కేంద్రాలు (సీడీఎల్) ఉన్నాయి. రాష్ట్రాల స్థాయిలో ఔషధ తనిఖీ అధికారులున్నారు. దేశం వెలుపలికిపోయే ఔషధాల ప్రమాణాల నిర్ధారణకు సంబంధించి ఎన్నో నిబంధనలున్నాయి. కానీ మేడెన్ సంస్థ ఈ వ్యవస్థల కళ్లు కప్పగలిగింది.
2020లో జమ్మూ, కశ్మీర్‌లో ఈ దగ్గుమందు 14 మంది ప్రాణాలు తీసినప్పుడు ప్రజారోగ్య రంగ కార్యకర్త దినేష్ కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖకు సవివరమైన ఫిర్యాదు పంపితే దర్యాప్తు చేయటం మాట అటుంచి, కనీసం అది అందుకున్నట్టు చెప్పే దిక్కు కూడా లేకపోయిందంటే ఎలాంటి పరిస్థితులున్నాయో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో ఔషధ ప్రమాణాల నిర్ధారణకూ, నియంత్రణకూ 1940 నాటి డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టమే ఆధారం.
2004లో రాన్‌బాక్సీ సంస్థపై ఆరోపణలు వెల్లువెత్తి, ఆ తర్వాత అమెరికా, యూరోప్ దేశాల నియంత్రణ సంస్థలు గగ్గోలు పెట్టినప్పుడు ఆనాటి పాలకులు ఇదంతా కుట్రగా తేల్చిపారేశారు తప్ప ఫార్మా రంగ సంస్కరణలకు పూనుకోలేదు. వర్తమాన అవసరాలకు తగ్గట్టు కొత్త చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు.
వర్ధమాన దేశాలకు చవగ్గా ఔషధాలందిస్తుందన్న ఖ్యాతిని నిలుపుకోవాలన్నా, ప్రపంచ ఫార్మా రంగంలో పెరుగుతున్న మన వాటా రక్షించుకోవా లన్నా ఔషధ నియంత్రణ వ్యవస్థ ప్రక్షాళనకు తక్షణం పూనుకోవాలి. లేదంటే మన ప్రతిష్ఠ అడుగంటడం ఖాయం.
మందులా... మృత్యు గుళికలా!
Published Sat, Oct 8 2022 12:21 AM | Last Updated on Sat, Oct 8 2022 12:21 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment