క్లీనిక్‌పై అధికారుల దాడులు
- రూ. లక్ష విలువైన మందులు సీజ్
నంద్యాల విద్య: నంద్యాల పట్టణంలోని దేవనగర్‌లోని సయ్యద్ క్లినిక్ (ప్రథమ చికిత్స కేంద్రం)పై జిల్లా ఔషధ నియంత్రణ అధికారుల బృందం శనివారం దాడులు చేసింది. ఈ దాడులలో క్లినిక్‌లో అక్రమగా నిల్వ ఉన్న రూ. లక్ష విలువ చేసే ఔషధ మందులను సీజ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ ఔషధ నియంత్రణ పరిపాలన అధికారి చంద్ర శేఖర్‌రావు మాట్లాడుతూ ఎటువంటి లైసెన్స్ లేకుండా అనధికారికంగా, భారీ స్థాయిలో ఔషధ మందులను నిల్వ చేసుకోవడం నేరమన్నారు. ఇటువంటి మందులను అమ్మడం కాని, వాటిని నిల్వ చేసుకోవడం క్లినిక్ నిర్వహిస్తూ భారీ స్థాయిలో మందులను కలిగియున్న సయ్యద్ ఇస్తాక్ అహమ్మద్‌పై కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తామన్నారు. మందులు ఎక్కడ నుండి కొనుగోలు చేశారనే వివరాలు విచారణలో తెలుస్తుందన్నారు. వీరి వెంట నంద్యాల డ్రగ్ ఇన్‌స్పెక్టర్ హరిహర తేజ, కర్నూలు అర్బన్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ షేక్ అబిద్ ఆలి, ఆదోని డ్రగ్ ఇన్‌స్పెక్టర్ షేక్ దాదా కలందర్ ఉన్నారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటం:
పట్టణంలోని దేవనగర్ ప్రాంతంలో విచ్చలవిడిగా వెలసిన ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు ఉన్నాయి. ఎవరైనా ప్రమాదవశాత్తు గాయపడిన, జబ్బు పడిన, వారి ప్రాణాలను కాపాడటానికి ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. అయితే నిబంధనలు విరుద్ధంగా అడ్మిట్ చేసుకొని అక్కడనే రోగికి ఇంజక‌్షన్లు, సెలైన్ బాటిల్స్, నేబ్యులైజేషన్ వంటి చికిత్సలు నిర్వహిస్తున్నారు. ఎటువంటి అర్హతలు లేకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వీరిని నియంత్రించే వైద్య శాఖాధికారులు తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తున్న తీరు పలు విమర్శలకు దారితీస్తుంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు ఇటువంటి ఫస్ట్ ఎయిడ్ సెంటర్లపై తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.