డ్రగ్స్ నియంత్రణకు టాస్క్‌ఫోర్స్
విశాఖ నుంచి భారీ ఎత్తున గంజాయి రవాణా: మంత్రి గంటా
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగాన్ని నియంత్రించేందుకు పోలీస్, డ్రగ్ కంట్రోల్, ఎక్సైజ్ అధికారులతో ప్రభుత్వం టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేయనుందని మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. దీంతో పాటు హెల్ప్‌లైన్, టోల్‌ఫ్రీ నంబరును కూడా అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఆదివారం వివిధ పాఠశాలల యాజమాన్యాలు, ఎక్సైజ్ , డ్రగ్ నియంత్రణ అధికారులు, మానసిక ఆస్పత్రి వైద్యులతో సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన విశాఖ సర్క్యూట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ వ్యవహారం వెలుగు చూసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైందన్నారు. పాఠశాల స్థాయిలో 8, 9 తరగతుల నుంచే పిల్లలు డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నందున ఆదిలోనే అరికట్టే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
గంజాయి సరఫరాలో పెద్దల హస్తం: విశాఖ ఏజెన్సీ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు పెద్ద ఎత్తున గంజాయి అక్రమ రవాణా జరుగుతోందని, ఇందులో కొంతమంది పెద్దల పాత్ర కూడా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని మంత్రి గంటా చెప్పారు. గతంలో గంజాయి కిలోల్లో రవాణా అయ్యేదని, ఇప్పుడు టన్నుల్లో జరుగుతోందని తెలిపారు.