- మందుల కొనుగోళ్లలో టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ కక్కుర్తి
- హసీబ్ ఫార్మా స్టెరైల్ వాటర్‌లో నాణ్యత లేదని నిర్ధారించిన బెంగాల్
సాక్షి, హైదరాబాద్ : కమీషన్ల కక్కుర్తి.. రోగుల పట్ల నిర్లక్ష్యం.. ముందుచూపు లేకపోవడం వెరసి టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. స్టెరైల్ వాటర్‌నే నాణ్యతా ప్రమాణాల మేరకు తయారుచేయని కంపెనీకి.. సెలైన్ బాటిళ్ల టెండర్లను కట్టబెట్టింది. సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో ఏడుగురి చూపు పోవడానికి సెలైన్ బాటిళ్లలోని బ్యాక్టీరియానే కారణమని వైద్యులు చెబుతున్న విషయం తెలిసిందే. ఈ సెలైన్ బాటిళ్లను సరఫరా చేసిన నాగపూర్‌కు చెందిన హసీబ్ ఫార్మాసూటికల్స్ కంపెనీ తయారు చేసిన స్టెరైల్ వాటర్ బాటిళ్లను 2013సెప్టెంబర్‌లో నాణ్యతా ప్రమాణాలు లేవంటూ బెంగాల్ ప్రభుత్వం నిషేధించింది. కానీ అదే కంపెనీకి చెందిన 13.07లక్షల సెలైన్ బాటిళ్లను రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) కొనుగోలు చేసి అన్ని జిల్లాలకు పంపింది.
చర్యలు కరువు: మూడు బ్యాచ్‌లకు చెందిన సెలైన్ బాటిళ్లలో బ్యాక్టీరియా ఉండటంతో ఇన్ఫెక్షన్ సోకి ఏడుగురు కంటి చూపు కోల్పోయారు. నిలోఫర్ ఆసుపత్రిలోనూ సెలైన్ బాటిళ్లలో ఫంగస్ చేరినట్లు గుర్తించారు. కానీ ప్రభుత్వం ఇప్పటివరకూ ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదు. కేవలం సెలైన్ బాటిళ్లను సీజ్ చేసి చేతులు దులుపుకుంది. మరోవైపు స్టెరైల్ వాటర్‌నే సరిగా తయారు చేయలేని కంపెనీకి సెలైన్ బాటిళ్ల టెండర్ ఎలా అప్పగించారని కొందరు వైద్యాధికారులు ప్రశ్నిస్తున్నారు.
స్టెరైల్ నుంచే సెలైన్: స్టెరైల్ వాటర్‌ను ఇంజెక్షన్ల కోసం ఉపయోగిస్తుం టారు. స్టెరైల్ వాటర్‌ను విని యోగించుకునే సెలైన్ ఐవీ ఫ్లూయీడ్స్ వంటి వాటిని తయారు చేస్తారని డ్రగ్ కంట్రోల్ అధికారులు చెబుతున్నారు. అలాంటిది స్టెరైల్ వాటరే నాణ్యతా ప్రమాణాల మేరకు లేకపోతే... దాని నుంచి తయారయ్యే సెలైన్ ఎంత వరకు సురక్షితమనేది అర్థం చేసుకోవచ్చు. హసీబ్ ఫార్మాస్యూటికల్స్ నుంచి కొనుగోలు చేసిన 13.07 లక్షల సెలైన్ బాటిళ్లో 8లక్షలు ఇప్పటికే వినియోగించగా, మిగతావి సీజ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల సెలైన్ బాటిళ్లను సీజ్ చేసిన టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ అధికారులు ఇప్పుడు వాటికి ప్రత్యామ్నాయంగా రెండు లక్షల సెలైన్ బాటిళ్లను గోవా, అహ్మదాబాద్‌ల నుంచి తెప్పిస్తున్నారు.
అక్కడ నిషేధిస్తే.. ఇక్కడెలా అనుమతిచ్చారు?
Published Sat, Jul 9 2016 4:00 AM | Last Updated on Fri, May 25 2018 2:47 PM
Advertisement
Advertisement