
తీగలా అల్లుకుని
‘ఔషధ నియంత్రణ’ చేతిలో కీలక సమాచారం‘ఫెన్సిడిల్’ దగ్గు మందు బంగ్లాదేశ్‌కు తరలడానికి హైదరాబాదే అసలు అడ్డా అయినా,.....
సరిహద్దులు చెరిపేసి.. చెక్‌పోస్టులు దాటేసి
‘బంగ్లా’కు చేరుతున్న ఫెన్సిడిల్ సీసాలు
అక్రమ వ్యాపారులు అందరూ బంధువులే
‘అజంతా’ సుధాకరే కీలక పాత్రధారి
కామారెడ్డి కేంద్రంగానే సాగిన దందా
ఏటా కోట్లాది రూపాయల అక్రమార్జన
‘ఔషధ నియంత్రణ’ చేతిలో కీలక సమాచారం‘ఫెన్సిడిల్’ దగ్గు మందు బంగ్లాదేశ్‌కు తరలడానికి హైదరాబాదే అసలు అడ్డా అయినా, ఈ కీలక వ్యాపారానికి కొన్నేళ్లుగా కామారెడ్డే ప్రధాన కేంద్రం. ఇక్కడ మొదలైన వ్యాపారం కరీంనగర్, వరంగల్, మెదక్, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌కు తీగలా అల్లుకుపోయింది. చివరకు భారత్- బంగ్లాదేశ్ సరిహద్దులు దాటింది. అక్కడ దొరికిన ‘ఫెన్సిడిల్’ సీసాల ఆధారంగా అధికారులు విచారణ ప్రారంభిస్తే రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది.
నిజామాబాద్ : అక్రమ దందా పూర్తి వివరాలను సేకరించిన ఔషధ నియంత్రణ శాఖ అధికారులు దీనికి కీలక సూత్రధారి కామారెడ్డికి చెందిన అజంతా మెడికల్, జనరల్ స్టోర్స్ మేనేజింగ్ పార్టనర్ పి.సుధాకర్‌గా గుర్తించారు. ఇదే కేసుతో సంబంధం ఉన్న ఇతర జిల్లాలకు చెందిన మెడికల్ ఏజెన్సీలు కూడా ఆయన బంధువులవిగా గుర్తించిన అధికారులు మరింత ముఖ్య సమాచారం సేకరించినట్లు తెలిసింది. ఏటా కోట్లాది రూపాయల అక్రమార్జనకు కారణమైన ఈ కేసు వెనుక ఉన్న మరి కొందరి కోసం ఆరా తీస్తున్నారు. కామారెడ్డిలో దొరికిన ఆధారాలను కీలకంగా చేసుకుని విస్తృత దాడులు జరుపుతున్నారు.
సుధాకర్ సరఫరా చేసిందే అధికం
హైదరాబాద్ రామంతాపూర్‌లోని మహేందర్‌కు చెందిన ప్రణిత్ ఫార్మా, సికింద్రాబాద్‌లోని సురేందర్‌కు చెందిన మహావీర్ ఫార్మా, ఈ అక్రమ వ్యాపారం కొనసాగిస్తోంది. వీరు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాలలో 25 మంది డీలర్లను ఏర్పాటు చేసుకున్నారు. వీరికి ప్రతి నెల ఐదు వేల ఫెన్సిడిల్ సిరప్ సీసాలను సరఫరా చేస్తున్నట్లు ఇండెంట్‌లో పేర్కొన్నారు. కానీ, వీటిని నేరుగా హైదరాబాద్ నుంచి బంగ్లాదేశ్‌కు సరఫరా చేస్తున్నారు. సుధాకర్ ఈ వ్యాపారంలో రెండడుగులు ముందుకు వేశాడు. జిల్లాలో 400 మెడికల్ దుకాణాలకు ఈ మందు సరఫరా చేసినట్లు బిల్లులు సృష్టించాడు. అందరికీ ఐదు వేల సీసాలు మాత్రమే అందిస్తే ఇతను మాత్రం 15 నుంచి 20 వేల వరకు ఇండెంట్‌ను కొనసాగించాడు. దీంతో ఎక్కువ పర్సెంటేజీ పొందాడు. హైదరాబాద్‌లోని నాలుగు, కరీంనగర్‌లోని కోరుట్లకు చెందిన కె.ఎస్.ఏజెన్సీ, హైదరాబాద్‌కు చెందిన రోహిత్ ప్రణిత్, మిస్రీ మరికొన్ని ఏజెన్సీల పేరిట ఇండెంట్ పెట్టాడు. ఇలా నెలకు 1.25 లక్షల ఫెన్సిడిల్ దగ్గుమందును బంగ్లాదేశ్‌కు సరఫరా చేస్తున్నారు. 2012 నుంచి నెలకు రూ.32 కోట్ల రూపాయల వ్యాపారం కొనసాగుతోంది. సుధాకర్ 2013 ఫిబ్రవరి నుంచి అక్రమ దందా కొనసాగి స్తున్నట్లు విచారణలో తేలింది.
పట్టుబడింది ఇలా
బంగ్లాదేశ్‌కు అక్రమంగా రవాణా అవుతున్న ఫెన్సిడిల్ మందును గత అక్టోబర్‌లో తనిఖీ అధికారులు దేశ సరిహద్దులో పట్టుకున్నారు. బ్యాచ్‌నెంబర్ ఆధారంగా వివరాలు పరిశీలించి హైదరాబాద్‌కు చెందినవిగా గుర్తించారు. అనుమానంతో కామారెడ్డి, ఆర్మూర్, నిజామాబాద్‌లోని మందుల దుకాణాలను తనిఖీ చేయాలని జిల్లా ఔషధనియంత్రణ అధికారులను ఆదేశిం చారు. ఈ మేరకు ఆ శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ సురేంద్రనాథ్‌సాయి ఆదేశాల మేరకు డీఐలు ప్రసాద్, రాజిరెడ్డి ఆయా దుకాణాలను తనిఖీ చేశారు. అప్పటి వరకు గుట్టుగా ఉన్న ఈ వ్యవహారాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చి వరస కథనాలు వెలువరించింది. దీంతో అధికారులు విచారణను వేగవంతం చేసి మరిన్ని వివరాలు రాబట్టారు. దర్యాప్తును కొనసాగిస్తూనే నివేదికలను ఉన్నతాధికారులకు పంపించారు.
‘దగ్గుమందు’ దందా ఎందుకంటే
ఫెన్సిడిల్ అక్రమ వ్యాపారం తక్కువ ఆదాయంతో ఎక్కువ లాభం చేకూర్చే విధంగా మారింది. ఈ మందును కోడిల్ ఫార్మాతో తయారు చేస్తారు. దగ్గు నివారణకు ఒక చెంచా మందును మాత్రమే తాగాల్సి ఉంటుంది. ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మత్తు వస్తుంది. బంగ్లాదేశ్‌లో దీనికి సంబంధించిన ఫార్మా నిషేధంలో ఉంది. హైదరాబాద్ ప్రాంతంలో ఈ ఫెన్సిడిల్ మందు రూ. 65 రూపాయలకు లభిస్తుంది. బంగ్లాదేశ్‌లో దీనిని రూ. 260 రూపాయలకు విక్రయిస్తున్నారు. అక్కడ ఈ మందుకు విపరీతమైన డిమాండ్ ఉంది. మన దేశంలోని మందుల దుకాణాలలో దీనిని ఐదు సీసాల కంటే కంటే ఎక్కువగా అందుబాటులో ఉంచరు. దీంతో వ్యాపారులు అక్రమ రవాణా వైపు దృష్టి మళ్లించారు.